
యాస్పెక్ట్ బులియన్ ప్రణాళిక
దేశవ్యాప్తంగా వచ్చే 12–18 నెలల్లో 50 వరకు బంగారం, వెండి వెండింగ్ మెషిన్లను ఏర్పాటు చేయనున్నట్టు యాస్పెక్ట్ బులియన్ అండ్ రిఫైనరీ ప్రకటించింది. ఈ వెండింగ్ మెషిన్ల ద్వారా బంగారం, వెండి కాయిన్లను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. వెండింగ్ మెషిన్ వద్దే అప్పటికప్పుడు ధరలను కస్టమర్లు చూసుకోవచ్చని.. రియల్‌టైమ్ మార్కెట్ ధరలు అక్కడ కనిపిస్తాయని పేర్కొంది. వేగంగా, భద్రంగా కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ఈ వెండింగ్ మెషిన్లు ఉంటాయని.. మూడు నిమిషాల్లోనే కొనుగోలును పూర్తి చేసుకోవచ్చని వెల్లడించింది. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డు సహా పలు రకాల పేమెంట్ ఆప్షన్లను వినియోగించుకోవచ్చని తెలిపింది.
వెండింగ్ మెషిన్ ఎలా పని చేస్తుందంటే..
గోల్డ్ కాయిన్ వెండింగ్ మెషిన్లు సాధారణ వెండింగ్ మెషీన్ల మాదిరిగానే పనిచేస్తాయి. కానీ బంగారం విలువ కారణంగా అదనపు భద్రతను కల్పిస్తారు. అందులో భాగంగా వినియోగదారుల వెరిఫికేషన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
మెషిన్‌లో ముందుగా వినియోగదారులు తమకు కావాల్సిన బంగారు నాణెం బరువు, రకాన్ని ఎంచుకుంటారు.
నగదు, క్రెడిట్/డెబిట్ కార్డు లేదా మొబైల్ బ్యాంకింగ్ (యూపీఐ, క్యూఆర్ కోడ్లు మొదలైనవి) ద్వారా చెల్లింపులు చేయవచ్చు.
కొన్ని యంత్రాలకు గుర్తింపు ధ్రువీకరణ అవసరం అవుతుంది. ముఖ్యంగా అధిక మొత్తంలో చేసే లావాదేవీల కోసం ఆధార్ లేదా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ వంటి కేవైసీ (నో యువర్ కస్టమర్) పద్ధతులను ఉపయోగిస్తారు.
చెల్లింపు అయినట్లు ధ్రువీకరించిన తరువాత మెషిన్‌లోని స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ నుంచి బంగారు నాణేన్ని రిలీజ్ చేస్తుంది.
ఇదీ చదవండి: ఐటీఆర్ ఫారంలను నోటిఫై చేసిన కేంద్రం
కొన్ని యంత్రాల ద్వారా బంగారు కడ్డీలు కూడా పొందే వీలుంటుంది. దానికి సంబంధించిన వివరాలను ముందుగానే వినియోగదారులకు తెలియజేస్తుంది.
పంపిణీ సమయంలో భద్రతకోసం సీసీటీవీ మానిటరింగ్, ట్యాంపరింగ్ ప్రూఫ్ మెకానిజమ్స్, వెయిట్ సెన్సర్లను అమరుస్తారు.
యంత్రాల్లో యాంటీ-థెఫ్ట్ అలారంలు, రియల్-టైమ్ ఇన్వెంటరీ ట్రాకింగ్ విధానం కూడా ఉంటుంది.
బంగారం కొనుగోలు రుజువు కోసం ఈ-రశీదులు కూడా పొందవచ్చు.