
పండగ పూటా పచ్చ కుట్రలు
కొండపి: కొండపి నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆగడాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. పండగ పూటా పచ్చ నేతలు కుట్రలు చేసిన తీరు చూసి జనం చీకొట్టారు. వివరాల్లోకి వెళ్తే.. మహర్నవమి సందర్భంగా బుధవారం రాత్రి కొండపి మండలం పెద్ద కండ్లగుంట గ్రామంలో రామలింగేశ్వరస్వామి ఆలయంలో వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రభపై కోలాట ప్రదర్శనకు, టీడీపీ నేతల ఆధ్వర్యంలో ప్రభపై పాటకచేరీకి ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ సీపీ నేతలు పోలీసుల అనుమతికి దరఖాస్తు చేసుకోగా నిరాకరించడంతో ఆ పార్టీ నేతలు ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు కోలాట ప్రదర్శనకు పోలీసులు అనుమతించక తప్పలేదు. తొలుత అనుమతి నిరాకరించేలా పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసిన టీడీపీ నాయకులు తమ కుట్రలకు మరింత పదునుపెట్టారు. కోలాట ప్రదర్శనను సవ్యంగా సాగకుండా పోలీసులను ఉసిగొల్పి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.
లైట్లు ఆపేసి.. ప్రదర్శన త్వరగా నిలిపేసి..
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై బెలూన్లు తొలగింపజేసిన పోలీసులు.. డెకరేషన్ లైట్లను సైతం ఆపివేయించారు. మైకుల సంఖ్యను కూడా కుదించి కోలాట ప్రదర్శనను నిర్వహించుకోవాలని సూచించారు. అయినప్పటికీ సంయమనం పాటించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు.. టీడీపీ నేతల డైరెక్షన్‌లో పోలీసులు ఇచ్చిన ఆదేశాలను పాటించారు. అమ్మవారి మొక్కు తీర్చుకునేందుకు వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్ల వెలుగులోనే కోలాట ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ప్రభపై అశ్లీలతకు పేరొందిన రికార్డ్ డ్యాన్స్‌కు అడగగానే అనుమతిచ్చేసిన పోలీసులు.. సాంస్కృతిక కార్యక్రమమైన కోలాట ప్రదర్శనకు అనుమతి నిరాకరించడం, లైట్లు ఆపేయడం, బెలూన్లు సైతం తొలగించడం చూసి చుట్టుపక్కల గ్రామాల భక్తులతోపాటు గ్రామస్తులు విస్తుపోయారు. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన కోలాటాన్ని రెండు గంటల వ్యవధిలోనే అంటే 11 గంటలకే నిలిపేసిన పోలీసులు.. టీడీపీ ప్రభపై రికార్డ్ డ్యాన్స్‌ను మాత్రం తెల్లవారుజామున 3 గంటల వరకు దగ్గరుండి జరిపించడం గమనార్హం.
ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన
పెద్దకండ్లగుంటలో కోలాట ప్రదర్శన ఆహూతులను అలరించింది. సుమారు 46 మంది కళాకారులు రెండు నెలలపాటు సాధన చేసి కోలాటం ప్రదర్శించారు. కోలాటాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హాజరయ్యారు. రెండు గంటలపాటు సాగిన ప్రదర్శనను ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా 2 వేల మందికి అన్న సంతర్పణ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బచ్చల కోటేశ్వరరావు, వైస్ ఎంపీపీ వేముల ప్రసాద్, మండల సీనియర్ నాయకులు వేముల రమేష్, ఎంపీటీసీ సుబ్బారావు, లక్ష్మీనరసయ్య, కార్తీక్ సుల్తాన్, రవీంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఓబుల్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్లు, బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొండపి మండలం పెద్దకండ్లకుంటలో టీడీపీ నేతల దుశ్చర్య
కోలాట ప్రదర్శనకు అనుమతివ్వకుండా
పోలీసులపై ఒత్తిడి
హైకోర్టు అనుమతితో కార్యక్రమానికి
వైఎస్సార్ సీపీ శ్రేణుల ఏర్పాట్లు
అయినా పోలీసులను పురమాయించి
అడుగడుగునా ఆంక్షలు
ప్రభ డెకరేషన్ లైట్లు ఆపి, రాత్రి 11 గంటలకే ప్రదర్శన నిలిపివేత
టీడీపీ ప్రభపై తెల్లవారుజామున 3 గంటల వరకు రికార్డు డ్యాన్స్
అనవసర రాద్ధాంతం చేశారు
కోలాట ప్రదర్శనకు అనుమతి అడిగితే పోలీసులు కాదనడంతో హైకోర్టును ఆశ్రయించాం. కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ టీడీపీ నేతల ఒత్తిడితో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కోలాట ప్రదర్శన నిర్వహించకూడదన్నది వారి ఉద్దేశం. అందుకు పోలీసులను అడ్డుపెట్టుకుని ఇబ్బందులు పెట్టారు. అయినా మేమంతా సంయమనం పాటించాం. పోలీసుల సూచన మేరకు లైట్లు ఆపేసి ఉన్న కాస్త వెలుగులోనే ప్రదర్శన కొనసాగించాం. ఏడు గంటలకు ప్రారంభం కావాల్సిన కోలాట ప్రదర్శన పోలీసుల ఆంక్షల వల్ల 9 గంటలకు మొదలైంది. టీడీపీ ప్రభ వద్ద జనం లేరన్న కారణంతో 11 గంటలకే మా ప్రోగ్రామ్‌ను ఆపేశారు. పండగ పూట రాజకీయాలు చేయడం, అందుకు పోలీసులు సహకరించడం ఎంత వరకు సబబో ఆలోచించుకోవాలి.
– భువనగిరి సత్యనారాయణ,
పెద్దకండ్లగుంట సర్పంచ్

పండగ పూటా పచ్చ కుట్రలు