
విద్య, వైద్యానికి ప్రాధాన్యం
● ఏటీసీ సెంటర్ల ఏర్పాటుతో యువతకు ఉద్యోగావకాశాలు
● ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే క్యాన్సర్ నివారణకు ప్రత్యేక చర్యలు
● ప్రతి జిల్లాకు పాలశీతలీకరణకేంద్రాలు మంజూరు
● రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి వెల్లడి
● కొండారెడ్డిపల్లిలో రూ.134 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం
వంగూరు: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య క్రమంలో విద్య, వైద్యంపై ప్రత్యేకంగా దృష్టిసారించిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి గ్రామంలో రూ.134 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 8 మెడికల్ కళాశాలలు, 74 ట్రామా సెంటర్లు, 102 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశామని, క్యాన్సర్ నివారణకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగావకాశాల కోసం ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే రాష్ట్రంలో 65 సెంటర్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర యువతకు నైపుణ్యమైన విద్యనందించి ప్రపంచంతో పోటీపడే విధంగా తీర్చిదిద్దేందుకు ఒక్కో ఏటీసీ సెంటర్‌కు రూ.45 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామంపై మమకారంతో అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. గ్రామం మొత్తం సోలార్ విద్యుత్‌ను వాడే విషయంలో కొండారెడ్డిపల్లి దేశంలో రెండవది అన్నారు. గ్రామంలోని 514 ఇళ్లకు గాను 480 ఇళ్లకు సోలార్ సౌకర్యం కల్పించడం జరిగిందని, ప్రతి ఇంటి నుంచి 360 యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుందన్నారు. సెప్టెంబర్ నెలలో గ్రామం నుంచి దాదాపు లక్ష యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అందించడంతో గ్రామానికి రూ.5 లక్షల ఆదాయం సమకూరిందన్నారు. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రతి జిల్లాలో పాలశీతలీకరణ కేంద్రాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ రంగంతోపాటు పాడిపరిశ్రమపై దృష్టి సారించాలన్నారు. కొండారెడ్డిపల్లి గ్రామంలో రూ.2.50 కోట్లతో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడం వల్ల రోజుకు 30 వేల లీటర్ల పాలను నిలువ చేయవచ్చన్నారు. రాష్ట్రంలో ఇంతపెద్ద బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ కొండారెడ్డిపల్లిలో మాత్రమే ఉందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, బాలాజీసింగ్ పాల్గొన్నారు.