
స్థానిక సంస్థల ఎన్నికలు కీలకం
ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ మధుసూదన్
ఖమ్మంవైరారోడ్: గ్రామ రాజకీయాలను శాసించే స్థానిక సంస్థల ఎన్నికలను కీలకంగా తీసుకుని పార్టీ అభ్యర్థుల విజయానికి బీఆర్‌ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సూచించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ఏ రూపంలో వచ్చినా కూడా బీఆర్‌ఎస్ విజయఢంకా మోగించడం ఖాయమే అయినా కార్యకర్తలు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉండొద్దని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం ఖమ్మంలో బుధవారం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అధ్యక్షతన జరగగా రవిచంద్ర మాట్లాడారు. గత 22 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడగా, అలవికాని హామీలు అమలుచేయలేకపోయారని ఆరోపించారు. అంతేకాక ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. అధికార పక్షం నాయకుల ప్రోద్బలంతో పెడుతున్న కేసులకు బీఆర్‌ఎస్ శ్రేణులు భయపడకుండా సంఘటిత శక్తితో ముందుకు సాగాలని సూచించారు. నెల రోజులు కష్టపడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించడం ఖాయమని రవిచంద్ర తెలిపారు. ఎమ్మెల్సీ మధు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో పట్టణాల నాయకులు, కార్యకర్తలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో గ్రామాల నాయకులు ప్రచారం చేయడం ద్వారా ఘన విజయాలు నమోదవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, బానోతు చంద్రావతి, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, నాయకులు ఉప్పల వెంకటరమణ, బమ్మెర రాంమూర్తి, పగడాల నాగరాజు, తిరుమలరావు, బెల్లం వేణుగోపాల్, బానోతు మంజుల, కట్టా అజయ్‌కుమార్, గిరిబాబు, కట్టా కృష్ణార్జునరావు తదితరులు ప్రసంగించారు.