కొండపల్లి బొమ్మ.. తరతరాల జ్ఞాపకం

Kondapalli Bommalu Significance: Women Plays Role In Making Toys - Sakshi

‘కొండపల్లి కొయ్యబొమ్మ... కోటగట్టి కూచుందమ్మ...’ అని పాడుకోవడానికే కాదు.. కొండపల్లి బొమ్మ పాటకు తగ్గట్టే తరతరాలకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది కూడా.  అమ్మకు చిన్నప్పుడు తిరునాళ్లలో తాతయ్య కొనిచ్చిన ‘అమ్మాయి– అబ్బాయి’ బొమ్మ ఉంటుంది. అన్నయ్య కొనిపించుకున్న ఎడ్లబండి అదే షెల్ఫ్‌లో చోటు చేసుకుంటుంది. నానమ్మ ముచ్చటపడి తెచ్చుకున్న దశావతారాల బొమ్మ ఉండనే ఉంటుంది. కొండపల్లి బొమ్మ ఒకసారి ఇంట్లో షోకేస్‌లోకి వచ్చిందంటే ఇక తరాలు మారినా ఆ బొమ్మ చెక్కు చెదరదు. బొమ్మ చెక్కు చెదరదు... కానీ ఇటీవల బొమ్మలు చేసే వాళ్లు కనుమరుగైపోతున్నారు. వందలాది కుటుంబాలు ఈ కళను కొనసాగించలేక ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోయాయి. ఈ దశలో కళను బతికించుకోవడానికి, కళతోనే తమ బతుకును నిర్మించుకోవడానికి ముందుకు వచ్చారు మహిళలు.  

బావుదరి పట్టారు!
నలభై ఏళ్ల కిందట కొండపల్లి కళాకారుల చేతిలో 84 రకాల కళాఖండాలు రూపుదిద్దుకునేవి. ఇప్పుడా సంఖ్య ఐదారుకు మించడం లేదు. ఈ కళ మీద ఆధారపడి ఉపాధి పొందే పరిస్థితులు సన్నగిల్లడంతో ఈ తరం యువకులు ఎవరూ ముందుకు రావడం లేదు. కళ అంతరించిపోవడానికి ఎంతోకాలం పట్టదనే పరిస్థితి పదేళ్ల కిందటే మొదలైంది. ఈ దశలో మహిళలు ముందుకు వచ్చారు. ఇంతవరకు మగవాళ్లు బొమ్మలు చేస్తుంటే, మహిళలు ఆ బొమ్మలకు రంగులు వేయడం, ప్యాకింగ్‌ వంటి సహాయక బాధ్యతలకే పరిమితమయ్యారు. ఇప్పుడు మహిళలే కలప కొట్టడం, రంపంతో కోసి చిన్న దిమ్మలు చేయడం, ఆ దిమ్మలను కుంపటి మీద ఆరబెట్టడం నుంచి బొమ్మను చెక్కి రంగులు వేయడం వరకు అన్ని పనులూ చేస్తున్నారు.

‘ఈ బొమ్మల తయారీలో ఉపయోగించే మెటీరియల్‌ మొత్తం సహజమైనదే. చెట్ల బెరళ్లు, కాయల పై తొక్కలు, గింజల పొడులతో రంగులు తయారు చేస్తారు. ఈ కలప మెత్తగా ఉంటుంది. కాబట్టి పిల్లలు నోట్లో పెట్టుకున్నా, ఒకరి మీద ఒకరు విసురుకున్నా అంతగా దెబ్బ తగలదు. కాబట్టి స్కూల్‌ కిట్‌ల కోసం ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి కూడా మంచి డిమాండ్‌ రావచ్చ’ని ఆశాభావం వ్యక్తం చేశారు అభిహార స్వచ్ఛంద సంస్థ నిర్వహకురాలు సుధారాణి. అంతర్జాతీయ వేదికల మీద మన కొండపల్లి బొమ్మలు కనిపించాలనేది ఆమె ఆకాంక్ష. ఇన్నాళ్లూ బావుదరికి దూరంగా ఉన్న మహిళలు ఇప్పుడు తమ కెరీర్‌ని స్వయంగా చెక్కుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ల దృష్టి కార్లలో వేళ్లాడే నారింజ రంగు హనుమాన్‌ బొమ్మ మీద పడింది. కొండపల్లి హనుమాన్‌ రూపకల్పనలో మునిగిపోయారు. కార్లలో షోపీస్‌లుగా కొండపల్లి బొమ్మలు కనిపించే రోజు ఎంతో దూరం ఉండకపోవచ్చు.

ఇప్పుడు మేమే చెక్కుతున్నాం! 
నేను ముప్పై ఏళ్లుగా ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు అన్ని పనులూ నేర్చుకున్నాను. కలపను ముక్కలు చేయడం, ఆరబెట్టడం వంటివి పది బొమ్మలకు సరిపడిన మెటీరియల్‌ ఒకేసారి సిద్ధం చేసుకుంటాం. ఆకారాలు చెక్కడం రెండు రోజుల్లో పూర్తవుతుంది. ఈ బొమ్మల్లో మనిషి దేహం చెక్కేటప్పుడు పాదాల నుంచి తల వరకు ఒకే ముక్కలో చెక్కుతాం. చేతులను విడిగా చెక్కి అతికిస్తాం. ఆ తర్వాత తల మీద కిరీటం వంటి అలంకరణ చేసి రంగులు వేస్తాం. అడుగు ఎత్తున్న బొమ్మల జత ధర నాలుగు నుంచి ఆరువేలవుతుంది. మొదట్లో మేము లేపాక్షి హస్తకళల ఎంపోరియమ్‌కి ఇచ్చేవాళ్లం. ఇప్పుడు అభిహార సంస్థ వాళ్లు మాకు మరికొన్ని కొత్త వస్తువులు చేయడంలో కూడా శిక్షణ ఇస్తున్నారు. మేము చేసిన బొమ్మలను మార్కెట్‌ చేయడానికి వాళ్లకే ఇస్తున్నాం. ఇప్పుడు రోజూ పని ఉంటోంది. కొండపల్లి బొమ్మ చేయడానికి తెల్ల పొణికి చెక్క వాడతాం. ఎన్నేళ్లయినా ఈ చెక్కలో పగుళ్లు రావు. అందుకే బొమ్మలు కలకాలం అంత అందంగా ఉంటాయి. 
– చందూరి స్వరాజ్యం, కొండపల్లి బొమ్మల కళాకారిణి 

‘చెక్క’ని విప్లవం 
కొండపల్లి బొమ్మల తయారీలో మహిళల శ్రమ చిన్నది కాదు. కానీ ఆ శ్రమ ప్రధాన బొమ్మ తయారీ కాకపోవడంతో వాళ్లకు ఆర్టిజాన్‌ గుర్తింపు కార్డు వచ్చేది కాదు. నాలుగు నెలల శిక్షణలో ఇప్పుడు మహిళలు ఎవరి సహాయమూ లేకుండా స్వయంగా బొమ్మ చేయగలుగుతున్నారు. ఇప్పుడు మహిళలు కూడా హక్కుగా ఆర్టిజాన్‌ కార్డు పొందవచ్చు. ఇప్పటి వరకు మహిళలకు కళాకారులుగా గుర్తింపు లేకపోవడంతో కళాఖండాల ప్రదర్శన, కళాకారుల అవార్డుల విషయంలో మహిళలు కనిపించేవాళ్లు కాదు. ఇప్పుడు ఈ మహిళలు ఆ పరిధిని చెరిపివేశారు. 
– సుధారాణి, అభిహార సంస్థ నిర్వహకురాలు

బొమ్మల బడి!
కొండపల్లి బొమ్మలు చూపుతిప్పుకోనివ్వడం లేదు. ఈ కళాకారుల చేతిలో చెక్క చక్కని బొమ్మగా ఎంత లాలిత్యంగా రూపుదిద్దుకుంటుందో వర్ణించడం సాధ్యం కాదు. ఇంత గొప్ప కళ అంతరించిపోతుంటే చూస్తూ ఊరుకోకూడదు. ఆ కళ తరతరాలకు అందాలి, ఈ కళాకారులు సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో జీవించాలి. అందుకే మాకు వచ్చిన ఆలోచనలను ఆచరణలో పెడుతున్నాం. స్కూల్‌ కిట్‌కు ఐడియా ఇచ్చాం. ఆ కిట్‌లో తెలుగు, ఇంగ్లిష్‌ అక్షరమాల ఉంటాయి. అలాగే పిల్లలు లాయర్, టీచర్, డాక్టర్, రైతు, జాలరి వంటి వృత్తులను తెలుసుకోవడానికి వీలుగా ఆ బొమ్మలు చేయించాం. ఆఫీస్‌లో ఉపయోగించే ట్రే, పెన్‌ స్టాండ్, ఇళ్లలో ఉపయోగించే వస్తువులను కూడా ఈ మెటీరియల్‌తో చేయవచ్చు. ఇలాంటి మార్పును స్వాగతిస్తే కళాకారులకు చేతినిండా పని ఉంటుంది. ఈ కళాకారుల కోసం బీటూబీ మీటింగ్‌ వంటి మార్కెట్‌ వేదికల గురించి ఆలోచిస్తున్నాం.
– విజయశారదారెడ్డి, వైస్‌ చైర్‌పర్సన్, ఏపీఎస్‌ఈఆర్‌ఎమ్‌సీ 

కొండపల్లి కృష్ణుడు 
నేను చేసిన తొలి బొమ్మ గోపికల మధ్య కృష్ణుడు. బావుదరి మీద పట్టు రావడానికి నెల రోజులు పట్టింది. అది వస్తే ఇక బొమ్మలు చేయడం ఏ మాత్రం కష్టం కాదు. మా బ్యాచ్‌ ట్రైనింగ్‌ పూర్తి కావస్తోంది. తర్వాత బ్యాచ్‌కి మరో పది మంది సిద్ధంగా ఉన్నారు.  
– పద్మావతి వెన్నవల్లి, శిక్షణలో ఉన్న విద్యార్థి

 – వాకా మంజులారెడ్డి 
ఫొటోలు : ఎ. బాబు, సాక్షి, ఇబ్రహీంపట్నం 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top