
5 నిమిషాలు బుల్లెట్లకు అడ్డునిలిచి..
అమెరికాలో డల్లాస్ కాల్పుల ఘటనలో షెటామియా టేలర్ అనే మహిళ ప్రాణాలకు తెగించి తన కొడుకును రక్షించింది.
డల్లాస్: అమెరికాలో డల్లాస్ కాల్పుల ఘటనలో షెటామియా టేలర్ అనే మహిళ ప్రాణాలకు తెగించి తన కొడుకును రక్షించింది. బుల్లెట్ల నుంచి తన 15 ఏళ్ల కొడుకుని రక్షించేందుకు టేలర్ జంప్ చేసి అతనికి అడ్డుగా నిలిచింది. తన కాలులోకి బుల్లెట్ దూసుకొచ్చినా లెక్కచేయకుండా, కొడుకును రెండు కార్ల మధ్యకు సురక్షితంగా తీసుకెళ్లింది. కుమారుడికి బుల్లెట్లు తగలకుండా ఉండేందుకు తన శరీరాన్ని కవచంలా చేసి అతన్ని దాచిపెట్టింది. కాల్పులు జరుగుతుండగా ఐదు నిమిషాల పాటు టేలర్ అలాగే ఉండిపోయింది. చివరకు పోలీసులు వచ్చి వారిని అక్కడి నుంచి తరలించారు.
డల్లాస్లో నల్లజాతీయుల నిరసన ర్యాలీ కాల్పుల ఘటన గురించి టేలర్ సోదరి థెరిసా విలియమ్స్ వివరించింది. టేలర్, ఆమె నలుగురు కొడుకులతో పాటు తాను ఈ ర్యాలీలో పాల్గొన్నట్టు విలియమ్స్ చెప‍్పింది. వందలాది మంది పాల్గొన్న ఈ ర్యాలీ ప్రశాంతంగా సాగిందని, కాసపేట్లో అక్కడి నుంచి తాము వెళ్లాల్సివుండగా కాల్పులు జరిగాయని చెప్పింది. ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడనున్నవారు పారిపోయారని, టేలర్ ముగ్గురు కొడుకులు సురక్షిత ప్రాంతానికి వెళ్లగా, ఆమె, మరో కొడుకు చిక్కుకుపోయారని తెలిపింది. తన సోదరి ప్రాణాలకు తెగించి కొడుకును రక్షించుకుందని చెప్పింది. టేలర్కు ఆస్పత్రికి తరలించి శస్త్రచికిత్స చేసి బుల్లెట్ తీశారని చెప్పింది.
డల్లాస్ కాల్పుల్లో ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు పోలీసులతో పాటు ఇద్దరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు నిందితుడు జాన్సన్ను హతమార్చారు.