‘జన పథం’లో భాగంగా వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమవారం మధ్యాహ్నం ధర్మవరంలో పర్యటి ంచారు.
ధర్మవరం, న్యూస్‌లైన్: ‘జన పథం’లో భాగంగా వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమవారం మధ్యాహ్నం ధర్మవరంలో పర్యటి ంచారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విజయమ్మకు సాదరస్వాగతం పలికారు. ఇందిరమ్మ కాలనీ నుంచి ప్రారంభమైన విజయమ్మ రోడ్‌షో వైఎస్సార్ కాలనీ, ఎల్‌సీకే పురం, సాయిబాబాగుడి, ఆర్టీసి బస్టాండ్, కాలేజ్ సర్కిల్, కళాజ్యోతి సర్కిల్ మీదుగా పాండురంగ సర్కిల్‌కు చేరుకుంది. దారివెంబడి విజయమ్మ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
విజయమ్మను చూసేందుకు పట్టణ వాసులు బారులు తీరారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ధర్మవరంలో 17వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు, తాగునీటి ఎద్దడిని తీర్చినట్లు, పొదుపు సంఘాల మహిళలకు రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా రుణాలు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. రైతు, చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని గుర్తుచేశారు.
వైఎస్ మరణం తరువాత అనేక సంక్షేమ పథకాలు మరుగునపడ్డాయన్నారు. తిరిగి రాజన్య రాజ్యం రావాలన్నా.. ప్రతి పేదవానికీ అన్ని సంక్షేమ పథకాలు అందాలన్నా.. ఒక్క జగన్‌మోహనరెడ్డితోనే సాధ్యమన్నారు. మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఫ్యాన్‌గుర్తుకు ఓటువేసి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బహిరంగ సభ అనంతరం పట్టణంలోని అంజుమన్ సర్కిల్, తేరు బజార్, కేశవనగర్, సంజయ్‌నగర్, శివానగర్, శారదానగర్‌ల మీదుగా మునిసిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి అనంతపురంలో జరిగే బహిరంగ సభకు వెళ్లారు.