ఆయకట్టులో వారబందీ పద్ధతిని వెంటనే ఎత్తివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హుజూర్‌నగర్,న్యూస్‌లైన్: ఆయకట్టులో వారబందీ పద్ధతిని వెంటనే ఎత్తివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నేరేడుచర్లకు చెందిన టీడీపీ నాయకులు ఇనుపాల పిచ్చిరెడ్డి, మేళ్లచెరువు మండలం మల్లారెడ్డిగూడానికి చె ందిన చింతరెడ్డి రవీందర్‌రెడ్డిలు వేర్వేరుగా వారి అనుచరులతో కలిసి శ్రీకాంత్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
ఈ సందర్బంగా పార్టీలో చేరిన వారికి శ్రీకాంత్‌రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం స్థాపించిన వైఎస్సార్‌సీపీతోనే స్వర్ణయుగ పాలన సాధ్యమవుతుందన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పదవులే పరమావధిగా భావించి ప్రజల బాధలను పట్టించుకోవడం లేదన్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో ప్రస్తుత రబీ సీజన్‌కు గాను పూర్తిస్థాయిలో సాగు నీరు అందించకుండా వారబందీ విధానాన్ని ప్రవేశ పెట్టడం అన్యాయమన్నారు.
ఈ విధానం వల్ల కాలవ చివరి భూములు నీరందక ఎండిపోతున్నాయన్నారు. వెంటనే ప్రభుత్వం రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని వారబందీ పద్ధతిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గత ఖరీ్‌ఫ్ సీజన్‌లో పంట నష్టపోయిన రైతాంగానికి ఒక్క రూపాయి కూడా పరిహారం అందించకపోవడం అన్యాయమన్నారు. రైతన్నలను కన్నీరుపెట్టించిన పాలకులకు తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పేందుకు ఇప్పటికే సిద్ధమయ్యారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని గట్టు పిలుపునిచ్చారు.