రాష్ట్రవిభజన అనివార్యమైతే కేంద్ర ప్రభుత్వం వ రాలు జల్లు కురిపిస్తుంది. సీమాంధ్రలో కొత్తగా సెంట్రల్ యూనివర్సిటీలు,
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: రాష్ట్రవిభజన అనివార్యమైతే కేంద్ర ప్రభుత్వం వ రాలు జల్లు కురిపిస్తుంది. సీమాంధ్రలో కొత్తగా సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి సంస్థలు ఏర్పాటవుతాయి. ఈనేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీని సెంట్రల్ యూనివర్సిటీగా మార్చాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఈ మేరకు ఇక్కడ పోరాట కమిటీ ఏర్పాటైంది. ఇదిలా ఉండగా..రాష్ట్రంలో అతిపెద్ద యూనివర్సిటీల్లో ఒకటైన ఆంధ్రా యూనివర్సిటీని మాత్రం సెంట్రల్ యూనివర్సిటీ చేయొద్దని అక్కడి వారు పోరాడుతుండడం గమనార్హం.
ఇదీ కథ..
ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో కనీస వసతులు కరువవుతున్నాయి. యూజీసీ 12-బి, నాక్ వంటి గుర్తింపు కూడా లేదు. వర్సిటీకి 80 మందికి పైగా బోధకులు అవసరం కాగా.. రెగ్యులర్ బోధకులు 12 మంది మాత్రమే ఉన్నారు. 2008లో వర్సిటీ ఏర్పడ్డాక మాతృ సంస్థ ఏయూకు వెళ్లిపోయిన బోధకులు స్థానాలను భర్తీ చేయలేదు. అనుబంధ కళాశాలలకు పరీక్షలు నిర్వహించే సామర్థ్యం కూడా లేదు. వర్సిటీకి ఒకే ఒక ప్లస్ ఏమిటంటే..అభివృద్ధి చెందేందుకు అనుకూల వాతావరణం. ప్రభుత్వం కేటాయించిన 130 ఎకరాల భూమి. ఈ నేపథ్యంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడితే రూ. కోట్లలో నిధులు వచ్చి పడతాయి.రెగ్యులర్ బోధకుల నియామకాలు జరుగుతాయి. పరిశోధనా కోర్సులు పెరుగుతాయి. కనీసం 100 డిపార్ట్‌మెంట్లు వరకు కొత్తగా ప్రారంభించే అవకాశాలు ఉంటాయి. ఐదేళ్లలో మొత్త స్వరూపం మారిపోతుంది. సైన్స్, ఇంజినీరింగ్, ఫార్మసీ వంటి కోర్సుల ప్రారంభానికి అవకాశం ఉంటుంది.
ఏయూకు వద్దు..
ఏయూను సెంట్రల్ యూనివర్సిటీ చేయొద్దంటూ..సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఎఫిలియేటెడ్ కళాశాలలు ఈ యూనివర్సిటీ పరిధిలోకి వస్తాయి. సుమారు రూ.5 వేల కోట్ల ఆస్తులు వర్సిటీ సొంతం. యూజీసీకి సంబంధించి అన్ని గుర్తింపులు ఉండడంతో నిధుల కొరత లేదు. దూర విద్య కోర్సుల ద్వారా కూడా కోట్లాది రూపాయల నిధులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్ యూనివర్సిటీ అయితే..నష్టమే తప్ప..లాభమేమీ ఉండదని అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయమైంది.
వెనుక బాటుతనాన్ని పరిగణనలోకి తీసుకోవాలి
శ్రీకాకుళం.. వెనుకబడిన జిల్లా. ఇక్కడి ప్రజలందరూ సమైక్యాంధ్రను కోరుకుంటున్నారు. విభజన అనివార్యమైతే..బీఆర్‌ఏయూను సెంట్రల్ యూనివర్సిటీగా మార్చాలి. దీంతో ఇక్కడి ప్రజలకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుంది. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ప్రొఫెసర్ గుంట తులసీరావు,
సీడీసీ డీన్, బీఆర్‌ఏయూ
సెంట్రల్ యూనివర్సిటీ అవసరం
ప్రస్తుతం ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు అవసరం. కావల్సినంత స్థలం ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ వస్తేనే ప్రాంతీయ అభివృద్ధికి అవకాశం ఉంటుంది. అందుకే పోరాట కమిటీని ఏర్పాటు చేశాం.
డాక్టర్ హనుమంతు సుబ్రహ్మణ్యం,సెంట్రల్ యూనివర్సిటీ పోరాట కమిటీ కన్వీనర్
విద్యార్థులకు మంచి భవిష్యత్తు
ఇప్పటీ రాష్ట్ర విభజనను అడ్డు కుంటున్నాం. అనివార్య మైతే మాత్రం వెనుకబడిన శ్రీకాకుళానికి న్యాయం చెయ్యాలి. జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలి. బీఆర్‌ఏయూను సెంట్రల్ యూనివర్సిటీ చెయ్యాలి.బడే రామారావు,
విద్యార్థి జేఏసీ నాయకుడు