
రూ.80 లక్షల కోట్ల లక్ష్యంలో ఇచ్చింది 19 శాతమే
నైపుణ్య లేమితో ఎంఎస్‌ఎంఈల ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం... పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులకు విముఖత
ప్రభుత్వ పాలసీలపై కొరవడిన అవగాహన
అంతర్జాతీయ మార్కెట్ చైన్‌కు దూరంగా మన పరిశ్రమ... ఎంఎస్‌ఎంఈల్లో పోటీతత్వం పెంపుపై నీతి ఆయోగ్ నివేదిక
సాక్షి, హైదరాబాద్: భారతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వాణిజ్య సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లు అప్పులు పుట్టక, పెట్టుబడులు రాక కునారిల్లుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరిశ్రమ ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నా, అప్పులు ఇవ్వాలని లక్ష్యాలు నిర్దేశించినా బ్యాంకర్లు రుణాలు ఇవ్వటంలేదు. ఎంఎస్‌ఎంఈలకు రూ.80 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని కేంద్రం నిర్దేశించగా.. బ్యాంకులు ఇచ్చింది మాత్రం 19 శాతమేనని నీతి ఆయోగ్ వెల్లడించింది.
ఎంఎస్‌ఎంఈ రంగంలో పోటీతత్వం పెంపునకు సంబంధించిన నివేదికను ఈ సంస్థ శుక్రవారం విడుదల చేసింది. ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్‌నెస్ (ఐఎఫ్‌సీ) సహకారంతో ఈ నివేదికను రూపొందించింది. భారతీయ ఎంఎస్‌ఎంఈల పోటీతత్వాన్ని ప్రభావితం చేస్తున్న కీలక సవాళ్లను ఈ నివేదిక విశ్లేషించింది.
రుణ వితరణ 19 శాతమే: దేశంలో ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించేందుకు బ్యాంకుల ద్వారా రూ.80 లక్షల కోట్ల రుణాలు ఇప్పించాలని 2021–22 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిర్ణయించింది. కానీ, బ్యాంకులు ఇచ్చింది మాత్రం లక్ష్యంలో 19 శాతమేనని నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొంది. 2020–24 మధ్యకాలంలో బ్యాంకుల నుంచి చిన్న సంస్థలకు రుణాలు 14 నుంచి 20 శాతానికి పెరగ్గా, మధ్య తరహా సంస్థలకు 4 నుంచి 9 శాతానికి పెరిగాయి. ఎంఎస్‌ఎంఈలకు రుణ వితరణను పెంచేందుకు ఏర్పాటు చేసిన క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ (సీజీటీఎంఎస్‌ఈ)ను విస్తరించినా పరిమిత ఫలితాలే సాధించినట్లు నివేదిక పేర్కొంది.
పీడిస్తున్న నైపుణ్య లేమి
నైపుణ్య లేమి ఎంఎస్‌ఎంఈలను వేధిస్తోంది. ఈ సంస్థల్లో పనిచేసేవారిలో ఎక్కువ మందికి సాంకేతిక శిక్షణ లేకపోవడం సంస్థల ఉత్పాదకత, నిర్వహణపై ప్రభావం చూపుతోంది. మరోవైపు అనేక ఎంఎస్‌ఎంఈలు నాణ్యత పెంపు కోసం అవసరమైన ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై నిధులు వెచ్చించడం లేదు. దీంతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ పోటీలో భారతీయ ఎంఎస్‌ఎంఈలు నిలదొక్కులేకపోతున్నాయని నీతి ఆయోగ్ విశ్లేషించింది.
నాణ్యమైన విద్యుత్, ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడంతో ఆధునిక సాంకేతికతను ఈ రంగం అందిపుచ్చుకోలేకపోతోంది. అధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలపై ఈ సంస్థలకు అవగాహన ఉండటం లేదు. జాతీయ, అంతర్జాతీయ పోటీలో రాణించాలంటే ఆధునిక సాంకేతికతను స్థానిక ఎంఎస్‌ఎంఈలు అందిపుచ్చుకోవాలని నీతి ఆయోగ్ సూచించింది.
భాగస్వామ్యాలతోనే పోటీతత్వం
ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం, సంస్థల నడుమ భాగస్వామ్యాలు, అంతర్జాతీయంగా పోటీ పడటం ద్వారా ఎంఎస్‌ఎంఈలు సుస్థిర ఆర్థిక ప్రగతి సాధిస్తాయని నివేదిక వెల్లడించింది. డిజిటల్ మార్కెటింగ్‌లో శిక్షణ, భాగస్వామ్య ఒప్పందాలు, మార్కెట్‌తో ప్రత్యక్ష అనుసంధానం తదితరాల ద్వారా ఎంఎస్‌ఎంఈల పురోగతి సాధ్యమవుతుందని పేర్కొంది. ఈశాన్య, తూర్పు భారత్‌లో ఎంఎస్‌ఎంఈ రంగం అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.