
Photo Courtesy: BCCI
సీఎస్‌కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో అత్యంత భారీ సిక్సర్ (109 మీటర్లు) కొట్టాడు. నిన్న (మే 3) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో జడ్డూ ఈ ఘనత సాధించాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్ ఐదో బంతికి (ఛేదనలో) లుంగి ఎంగిడి వేసిన ఫుల్ టాస్ బంతిని జడేజా స్టేడియం పైకప్పు పైకి పంపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది.
109m six! 👏
Ravindra Jadeja hit a MONSTROUS maximum during his fighting knock of 77*(45)! 🔥
Watch his full knock▶️ https://t.co/76RyGG8wAn#TATAIPL | #RCBvCSK | @ChennaiIPL | @imjadeja pic.twitter.com/L5Lv6291pT— IndianPremierLeague (@IPL) May 3, 2025
జడేజా బాదిన ఈ సిక్సర్‌కు ముందు ఈ సీజన్‌లో అత్యంత భారీ సిక్సర్ రికార్డు సన్‌రైజర్స్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ పేరిట ఉండేది. క్లాసెన్ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 మీటర్ల సిక్సర్ బాదాడు. క్లాసెన్ తర్వాత ఈ సీజన్ బిగ్గెస్ట్ సిక్సర్ల రికార్డు ఆండ్రీ రసెల్, అభిషేక్ శర్మ పేరిట ఉంది. రసెల్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై.. అభిషేక్ పంజాబ్‌పై 106 మీటర్ల భారీ సిక్సర్లు కొట్టారు. ఈ సీజన్‌లో ఐదో భారీ సిక్సర్ రికార్డు ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ పేరిట ఉంది. సాల్ట్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 105 మీటర్ల సిక్సర్ కొట్టాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆయుశ్ మాత్రే (48 బంతుల్లో 94; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ద సెంచరీలతో చెలరేగినా ఆర్సీబీ చేతిలో సీఎస్‌కే 2 పరుగుల స్వల్ప తేడాతో ఓడింది.
చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. జేకబ్ బేతెల్ (33 బంతుల్లో 55; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రొమారియో షెపర్ట్ (14 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.
సీఎస్‌కే బౌలర్లలో పతిరణ (4-0-36-3), నూర్ అహ్మద్ (4-0-26-1) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. ఖలీల్ అహ్మద్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు (3-0-65-0). ఖలీల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 33 పరుగులు పిండుకున్నాడు. పతిరణ వేసిన చివరి ఓవర్‌లోనూ అదే జోరు కొనసాగించిన షెపర్డ్ ఆ ఓవర్‌లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రాబట్టాడు.
అనంతరం 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్‌కే.. చివరి బంతి వరకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులకే పరిమితమైంది. ఆయుశ్ మాత్రే, రవీంద్ర జడేజా సీఎస్‌కేను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు.
సీఎస్‌కే గెలుపుకు చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా.. యశ్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫలితంగా సీఎస్‌కే లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. దయాల్, కృనాల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్‌కే ఈ ఓటమితో చివరి స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపుగా ఖరారైనట్లే.