
పహల్గాంలో దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరినీ వేటాడుతాం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చరిక
దేశంలో ఉగ్రవాదం అంతమయ్యే దాకా పోరాటం ఆగదని వెల్లడి
న్యూఢిల్లీ: ప్రతి ఉగ్రవాద చర్యకూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత్ తగిన సమాధానం ఇస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. పిరికిపందల్లా దాడులకు పాల్పడి అదే గొప్ప విజయంగా భావిస్తూ పొంగిపోవద్దని ఉగ్రవాదులకు హితవు పలికారు. ఇది నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత్ అనే సంగతి గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. ఒకరి తర్వాత ఒకరిపై వరుసగా ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్రవాదులను ఘాటుగా హెచ్చరించారు. దేశంలో ఉగ్రవాదాన్ని ప్రతి మూల నుంచీ అంతం చేస్తామని పునరుద్ఘాటించారు. ఒక్క అంగుళం భూభాగంలోనూ ఉగ్రవాదం అనేది లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
అనుకున్నది సాధించి తీరుతామని ప్రతిజ్ఞ చేశారు. ఆయన గురువారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. ఉగ్రవాదంపై తాము ప్రారంభించిన పోరాటానికి అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ పోరాటంలో 140 కోట్ల మంది భారతీయుల మద్దతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరి మద్దతు కావాలని చెప్పారు. ఉగ్రవాదాన్ని నామరూపాల్లేకుండా చేయడానికి ప్రపంచమంతా ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. మనమంతా చేతులు కలిపి పనిచేస్తే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేయొచ్చని తెలిపారు.
ఇండియాలో దాడులకు పాల్పడి, ప్రజల ప్రాణాలను బలితీసుకున్న ముష్కరులకు తగిన శిక్ష విధించడం తథ్యమని అన్నారు. ఉగ్రవాదం పూర్తిగా అంతమయ్యే దాకా తమ పోరాటం ఆగదని వెల్లడించారు. పహల్గాంలో దాడికి పాల్పడిన ప్రతి ఒక్క ముష్కరుడినీ వేటాడుతామని అమిత్ షా స్పష్టంచేశారు. వారు శిక్ష నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరని అన్నారు. మోదీ ప్రభుత్వం ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోదని చెప్పారు. 26 మందిని హత్య చేసి, గెలిచామనుకుంటే అది పొరపాటే అవుతుందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదుల అరాచకాలను సహించే ప్రసక్తే లేదన్నారు.