
పాఠశాలల అభివృద్ధికి ‘కడేర్ల’ సూచనలు
కెరమెరి(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం సావర్‌ఖేడా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కడేర్ల రంగయ్య పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సూచనలు, సలహాలు ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీఐలో గత మూడు రోజులుగా 33జిల్లాల డీఈవోలకు శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోని హెచ్‌ఎంలకు పాఠశాలల అభివృద్ధిపై మాట్లాడేందుకు అవకాశం కల్పించగా.. అందులో రంగయ్య ఒకరు కావడం గమనార్హం. ఆదివారం ఆయన బడిలో విద్యార్థుల సంఖ్యను 55నుంచి 200కు పెంచడం, ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, డిజిటల్ తరగతులు, పదేళ్లుగా ఉచితంగా తన సతీమణి కడేర్ల వీణ విద్యాబోధన చేయడం, సూపర్ 100 విద్యార్థులతో విద్యాబోధన, ఎఫ్‌ఎం సావర్‌ఖేడా రేడియో స్టేషన్ ఏర్పాటు, పాఠశాల అభివృద్ధికి సొంతంగా రూ.లక్ష, గ్రామస్తులు, తల్లిదండ్రులు, దాతల విరాళాల సేకరణ, గ్రామంలో మద్యపాన నిషేధం కోసం ధర్నా చేపట్టడం, రంగయ్యను ప్రేరణాత్మక కథనంతో పోల్చి ‘సర్’ చిత్ర నిర్మాతలు రూ.3లక్షలు విరాళం అందజేయడం తదితర అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమాలపై పాఠశాల విద్య డైరెక్టర్ నరసింహారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి యోగితారాణా, జేడీ రాజీవ్, ఆర్జేడీ సత్యనారాయణ తదితరులు రంగయ్యను అభినందించారు. పాఠశాలల అభివృద్ధికి మీ అనుభవాలు, సేవలు ఎంతో అవసరమని కొనియాడారు.