
నాళం వారి సత్రం భూముల కౌలు వేలం వాయిదా
తొండంగి: రాజమహేంద్రవరానికి చెందిన నాళంవారి సత్రంకు సంబంధించి శృంగవృక్షంలోని 268.64 ఎకరాల భూమి మూడు సంవత్సరాల కౌలు వేలం ప్రక్రియ మంగళవారం వాయిదా పడింది. దేవదాయధర్మాదాయశాఖ సత్రం కార్యనిర్వహణాధికారి చందక దారబాబు, పర్యవేక్షణాధికారి రమణి, ఇతర సిబ్బంది 268.64 ఎకరాలకు 13 బిట్లుగా కౌలు వేలం నిర్వహించేందుకు శృంగవృక్షం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాట్లు చేశారు. గతంలో సత్రం భూములకు వేలం సొమ్మును బకాయిదారులు 52 మంది రూ1.36 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంది. రైతులందరూ పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకుని వేలం పాటలో పాల్గొనేందుకు బకాయిలు చెల్లిస్తామని అధికారులకు వివరించారు. కొద్ది మంది రైతులు రూ.9.27 లక్షలు చెల్లించారు. మరి కొంత మంది సమయం ఇస్తే బకాయిలు చెల్లించి వేలం పాటలో పాల్గొంటామని కోరారు. ప్రస్తుతం వేలంలో పాల్గొనేందుకు రైతులు పూర్తిస్థాయిలో హాజరుకాని నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు వేలం ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు ఈవో దారబాబు తెలిపారు. రైతుల అభ్యర్థనను దేవదాయశాఖ ఆర్‌జేసీకి తెలియజేసి త్వరలో వేలం షెడ్యూల్ వెల్లడిస్తామని తెలిపారు.
భూములను గుట్టుగా రాయించుకునేందుకు రాజకీయ ఒత్తిడులు
నాళం వారి సత్రం భూములు కేవలం తక్కువగా 13 బిట్లుగా వేలం నిర్వహిస్తున్నారు. దీంతో ఎక్కువ మంది పాల్గొనేందుకు వీలు లేదు. దీర్ఘకాలం నుంచి దేవదాయ ధర్మాదాయశాఖ అధికారులను రాజకీయ ఒత్తిడి చేసి తక్కువ ధరకు మొక్కుబడిగా బహిరంగ వేలం తంతు నిర్వహించి కొందరు భూములను దక్కించుకున్నారని, వారు ఇతరులకు సబ్ లీజుకు ఇచ్చి సొమ్ము అక్రమంగా సంపాదించారని రైతులు ఆరోపిస్తున్నారు. అలా సొమ్ము చేసుకున్న పాట దారులు సత్రానికి చెల్లించకపోవడంతో బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. ప్రస్తుతంసత్రం అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో కార్యనిర్వహణాధికారిని బదిలీ చేయించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.
యువతి అదృశ్యం
అమలాపురం టౌన్: తన అక్క ఇంటికి అమలాపురం వచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని పంజా సెంటరుకు చెందిన యాళ్ల భూమిక శివ సాయి మంగళవారం అదృశ్యమైంది. ఈ మేరకు యువతి తండ్రి యాళ్ల నాగభూషణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలోని తన అక్క ఇంటికి వచ్చిన భూమిక మంగళవారం ఉదయం అదృశ్యమైంది.
రూ. 9.27
లక్షలు చెల్లించిన
పాత బకాయిదారులు
చెల్లింపునకు మరింత
గడువు ఇవ్వాలని
కోరిన రైతులు