
మనిషన్నాక బాధ్యత ఉండాలి.. సిగ్గుండాలి.. పిల్లలు పెరుగుతున్నారు.. ఒక గూడు ఉండాలన్న భయం... ఒక అది.. ఒక ఇది లేదు.. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనేలా ఉంటే ఎలా.. చుట్టూ ఉన్నోళ్లు ఎలా ఉన్నారు. మనం ఎలా ఉన్నాం.. వాళ్ళ కుటుంబాలు చూడు ఎంత కంఫర్ట్ ఉన్నాయి.. నువ్వూ ఉన్నావు.. సిగ్గులేని మనిషి... సిగ్గులేని జన్మ అంటూ భార్య నోరాపకుండా తిడుతూనే ఉంది.
ఒసేయ్.. నేను మనిషిని అని ఎవరన్నారు.. కాదు.. ఐన ఒకరితో నన్ను పోల్చకు.. ఇన్నేళ్ళకాపురంలో నిన్ను బిడ్డల్ని సరిగా చూశానా లేదా.. మీ అమ్మానాన్నను కాదని నన్ను నువ్వు ప్రేమించి ఎగిరిపోయి వచ్చినపుడే నిన్ను గుండెల్లో గూడు కట్టి చూసుకున్నాను అన్నాడు భర్త. ఓరి నా తింగరి మొగుడా.. గుండెల్లో కాదురా.. బయట కట్టాలి గూడు.. ముందు ఆ పని చూడు అని మళ్ళీ మురిపెంగా కసిరింది ముద్దులుపెళ్ళాం.. సరే రెండ్రోజుల్లో సైట్ చూసి మెటీరియల్ డంప్ చేసేద్దాం.. వారంలో ఇల్లు రెడీ అన్నాడు.. మొత్తానికి ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి ప్లాట్ ఫిక్స్ చేసారు..
గూటి కోసం ప్లాట్ ఫిక్స్ చేస్తామని చెప్పిన మొగుడుగారు.. ఏకంగా మా స్కూటీని తీసుకొచ్చి పెళ్ళానికి చూపించినట్లున్నాడు.. బయటెక్కడినా ఐతే ఎండ. పైగా శత్రుభయం .. ఈ స్కూటీ డిక్కీ ఐతే నీడ.. పైగా సేఫ్.. అందుకే ఇక్కడకు ఇద్దరూ ఫిక్షయారు .. అయ్యో.. పనికిమాలిన మొగుడు అనుకున్నాను కానీ తెలివైనవాడే.. మంచి సైట్ చూసాడు అని కిచకిచలాడింది.. పెళ్ళాం పిచ్చుక.. మొత్తానికి రెండ్రోజుల్లో కొన్ని చిన్న పుల్లలు. ఎండుగడ్డివంటిది తెచ్చి పెట్టారు.. ఇదేంటి అనుకుంటి తీసేసి పక్కన పడేసినా మళ్ళీ రెండ్రోజుల్లో ఇద్దరూ కలిపి మొత్తం డిక్కీ సగం నింపేశారు. పోన్లే ఏమవుతుందో అని జాలితో డిక్కీని. బండికి ముట్టుకోకుండా వదిలేశాం. నెలరోజులు బండి ముట్టుకోకపోతే బ్యాటరీ పోతుందేమో. మళ్ళా స్టార్ట్ అవ్వదేమో అనే చర్చ వచ్చినా.. పోన్లే ఒక పక్షి కుటుంబానికి ఆసరాగా నిలిచాం చాలు అనే భావనతో బండి అలాగే వదిలేశాం...
నాలుగు రోజుల్లో దానిలో రెండు గుడ్లు పెట్టింది.. దానికి కాపలాగా తల్లి అక్కడే స్కూటీ దగ్గర్లో ఉంటే తండ్రి ఎక్కడెక్కడికో తిరిగి ఏదేదో తెచ్చిపెట్టేవాడు. అన్యోన్య దాంపత్యం.. ఒక్కోరోజు రెండూ ఆ స్కూటీ దగ్గర్లోనే కూర్చు బహుశా పిల్లల భవిష్యత్ గురించి కావచ్చు కిచకిచలతో చర్చలు పెట్టేవి.. అరుదైన నల్ల పిచ్చుకలు. కంఠం వద్ద ఎర్రని జీర.. చూస్తుంటే ముచ్చటేస్తుంది.. అపురూపమైన కాపురాన్ని చూడాలనిపించి నెలరోజులు స్కూటీ కదపలేదు.. నాలుగురోజుల తరువాత డిక్కీ చూస్తే కళ్ళు తెరవని రెండు చిన్న జీవులు వచ్చి చేరాయి.. ఆ చిన్న దంపతుల ఆనందానికి అంతులేదు.. రోజూ ఆ స్కూటీ దారిలోనే తిరుగుతూ ఎవరైనా అక్కడికి వస్తే చాలు భయంతో అరిచేవి.. జీవి చిన్నదే కావచ్చు..
తల్లిదండ్రుల ప్రేమ అనంతం కదా.. అందుకే బిడ్డల కోసం వాటి ఆరాటం.. రోజూ తిరిగి ఏదేదో పురుగులు. నీళ్లు తెచ్చి బిడ్డలకు పోస్తుండేది తల్లి.. అలా పదిరోజులు గడిచాక చిన్నగా రెక్కలొచ్చి పిచ్చుకలు ఎగిరిపోయాయి.. తల్లి పిచ్చుక మళ్ళీ అక్కడే తిరుగుతోంది... ఇక మీ గెస్ట్ హౌస్ వదలండి.. అన్నట్లుగా నేను బండి తీసి స్టార్ట్ చేయబోతే ..ఉహు.. మొరాయించింది.. షెడ్డుకు తీసుకెళ్తే వెయ్యి వదిలింది.. పొతే పోనీ.. ఒక గువ్వల జంటకు నెలకు ఫ్రీగా ఆశ్రయం ఇచ్చాను అనిపించింది.
:::సిమ్మాదిరప్పన్న