
సాంస్కృతికపరంగానే కాదు వాణిజ్యపరంగా కూడా ఖాదీ పునర్జీవనం హైలెవెల్లో ఉంది. ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల అమ్మకాలు 2024–25 నాటికి అనూహ్యంగా రూ.1,70,551,37 కోట్లకు పెరిగాయి. గ్రామీణ భారతంలో ఖాదీ జీవనోపాధి వనరు, పట్టణాల్లో మాత్రం ప్రతీకాత్మక వస్త్రధారణగా మారింది. ప్రత్యేక సందర్భాల్లో ఖాదీ దుస్తులు ధరించే వారి సంఖ్య పెరుగుతోంది. ఎంతోమంది ఫ్యాషన్ డిజైనర్‌లు ఖాదీతో ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం విశేషం.
ఫ్యాషన్ ఇండస్ట్రీలో ‘న్యూ ఖాదీ ఫర్ ది న్యూ ఇండియన్’ ధోరణి వేళ్లూనుకుంది. ‘న్యూ ఖాదీ ఫర్ న్యూ ఇండియన్’ నినాదాన్ని తమ ప్రచారానికి వాడుకుంటుంది లూనా బ్రాండ్. ఆధునిక మార్కెట్ కోసం ఖాదీని పునర్నిర్వచిస్తున్న బ్రాండ్‌లలో బెంగళూరుకు చెందిన లూనా బ్రాండ్ ఒకటి. కొత్త బ్రాండ్‌లు ట్రెండ్ ఆధారిత ఫ్యాషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ‘ఖాదీకి ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా విలాసవంతమైన, నైతిక, పర్యావరణ హితమైన భవిష్యత్తుకు పునాది వేయవచ్చు’ అంటున్నారు ఖాదీని ఇష్టపడే ఫ్యాషన్ డిజైనర్‌లు.