
కులగణన ప్రతిపాదనపై గత కొన్నేళ్లుగా కారాలూ మిరియాలూ నూరుతూ వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎట్టకేలకు తన వైఖరి మార్చుకుంది. వచ్చే జనగణనతోపాటే కులగణన కూడా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ బుధవారం నిర్ణయించటం దేశ చరిత్రలో ఒక కీలకమైన మలుపు. అయితే ఇప్పటికే అయిదేళ్లుగా వాయిదా పడుతూవస్తున్న జనగణన ఎప్పుడు ప్రారంభిస్తారన్న అంశంలో స్పష్టత లేదు.
స్వాతంత్య్రానంతరం అణగారిన కులాలు సైతం విద్యావకాశాలను అందుకోవటం, ఉన్నతోద్యోగాలు సాధించటం వంటి పరిణామాల కారణంగా ఆ వర్గాల్లో చైతన్యం పెరిగింది. జనాభా దామాషా ప్రాతిపదికన అవకాశాలు దక్కటం లేదన్న అసంతృప్తి ఎక్కువైంది. అందుకే కులగణన జరపాలన్న డిమాండ్ ముందుకొచ్చింది. దేశంలో దీన్ని మొట్టమొదట స్వాగతించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 2021లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం కులగణన జరపాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానంచేసి పంపింది.
2024 జనవరిలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వేగవంతంగా, శాస్త్రీయంగా కులగణన నిర్వహించారు. బిహార్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు సైతం కులగణన చేశాయి. అయితే బీజేపీ మొదటినుంచీ ఈ డిమాండును వ్యతిరేకించింది. 2021 జులై 20 నాడు పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చిన ఆనాటి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ‘జనగణనలో ఎప్పటిలా ఎస్సీ, ఎస్టీ వర్గాల జనాభా లెక్కల సేకరణ మినహా ఇతర కులాల లెక్కింపు జరపరాదన్నది కేంద్రప్రభుత్వ విధానపరమైన నిర్ణయం’ అని ప్రకటించారు.
బయట ఎక్కడా నేరుగా కులగణనను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు ప్రకటనలు చేయకపోయినా, సమాజాన్ని విచ్ఛిన్నం చేయటానికి కాంగ్రెస్ కులాన్ని ఉపయోగించుకుంటున్నదని విమర్శించేవారు. మొన్నటికి మొన్న పహల్‌గామ్‌లో ఉగ్రవాదులు నావికాదళ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌ను మతం ఏమిటో కనుక్కుని కాల్చిచంపటాన్ని ప్రస్తావించి ‘వారడిగింది మతం... కులంకాదు’ అని ఛత్తీస్‌గఢ్ బీజేపీ ట్వీట్ చేసింది. అయితే కులగణన చేయటమే సరైందని ఆరెస్సెస్ భావిస్తున్నదని రెండు నెలల క్రితం ఒక ఆంగ్లపత్రిక వెల్లడించినప్పటినుంచీ దీనిపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి.
జనాభా లెక్కలతోపాటు కులగణన కూడా జరిగితే దేశంలో దాదాపు వందేళ్ల తర్వాత ఆ ప్రక్రియ మళ్లీ అమల్లోకొచ్చినట్టవుతుంది. ఆఖరుసారి వలస పాలకుల హయాంలో 1931లో కులాలవారీ జనాభా లెక్కేశారు. అప్పట్లో 4,147 కులాలున్నట్టు తేల్చారు. 1901లో ఈ సంఖ్య 1,646. తర్వాత 1941లో కూడా కొంతవరకూ జనాభా లెక్కల్లో కులాన్ని గణించారుగానీ రెండో ప్రపంచయుద్ధ కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. స్వాతంత్య్రానంతరం ఎస్సీ, ఎస్టీల వివరాలు మాత్రమే సేకరిస్తున్నారు. పీపుల్ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు 1992లో జరిపిన ఒక సర్వే ప్రకారం దేశంలో 4,635 కులాలున్నాయి.
2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కులగణన నిర్వహిస్తామని వాగ్దానం చేశారు. అనంతరం సాంఘికార్థిక సర్వేకింద 2011–12 మధ్య ఆ లెక్కలు తీశారు. కానీ ఆ డేటాను బయటపెట్టలేదు. ఇటీవల జనగణనపై కాంగ్రెస్ పట్టుబట్టడం మొదలైంది. మతంపై ప్రధానంగా కేంద్రీకరించే బీజేపీ ఇందుకు ససేమిరా సమ్మతించబోదని, అందువల్ల ఎన్నికల్లో కులగణన తనకు ప్రధాన ఆయుధంగా మారుతుందని ఆ పార్టీ భావించింది. కానీ బీజేపీ హఠాత్తుగా మనసు మార్చుకోవటంతో కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ నినాదం లేకుండా పోయింది.
అణగారిన కులాలు అడిగాయని కాదు... కులం ఒక వాస్తవం అయినప్పుడూ, సమాజంపై దాని ప్రభావం అమితంగా వున్నప్పుడూ ఎవరి సంఖ్య ఎంతో తేల్చటం ప్రభుత్వాల బాధ్యత. ఇన్నాళ్లూ దాన్ని విస్మరించారు. ఇందువల్ల రెండు రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సంక్షేమ ఫలాలు లక్షిత వర్గాలకు సరిగా చేరటం లేదు. ఇప్పటికీ విద్యాగంధం అంటని, ప్రభుత్వ పథకాల సంగతే తెలియని కులాలవారు గణనీయంగావున్నారు.
ఫలితంగా బడ్జెట్‌లలో గర్వంగా ప్రకటించుకునే పథకాలు ఆచరణలో నిరుపయోగం అవుతున్నాయి. ఇక ఇంద్ర సాహ్ని కేసులో రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్టు నిర్ణయం కోటా పెంపు ప్రయత్నాలకు అవరోధమవుతోంది. సమస్య వుందని ప్రభుత్వాలకు తెలిసినా, కొత్తగా తెరపైకొస్తున్న కులాలకు న్యాయం చేద్దామనుకున్నా అసాధ్యమవుతున్నది. అన్ని రంగాల్లోనూ ఆధిపత్య కులాల హవా కొనసాగుతోంది.
సమయానుకూల నిర్ణయాలు తీసుకోవటంలో, గాలివాలుకు అనుగుణంగా దూసుకెళ్లటంలో బీజేపీ దరిదాపుల్లోకొచ్చే రాజకీయపక్షం మరొకటి లేదు. వాస్తవానికి గత లోక్‌సభ ఎన్నికల ముందూ... మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల సందర్భాల్లో కులగణనపై కేంద్రం నిర్ణయం ప్రకటిస్తుందని అందరూ భావించారు. అలాచేస్తే కాంగ్రెస్ డిమాండుకు తలొగ్గినట్టయ్యేది. పహల్‌గామ్ మారణకాండపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నవేళ కులగణన నిర్ణయం తీసుకోవటంతో అది తన ఘనతేనని కాంగ్రెస్ చెప్పుకునే పరిస్థితి లేకుండాపోయింది.
పైగా కేంద్రంలో ఎక్కువకాలం అధికారంలోవున్నా కులగణన జోలికి పోకపోవటం... 2011–12లో ఆ పని చేసినా దాన్ని సామాజికార్థిక సర్వేగా చెప్పటం ఆ పార్టీకి పెద్ద మైనస్. బిహార్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ తీసుకున్నా తాజా నిర్ణయం నిస్సందేహంగా బీజేపీకి ఉపకరిస్తుంది. అయితే దీని వెంబడి రాగల ఇతరేతర డిమాండ్లతో ఆ పార్టీ ఎలా వ్యవహరిస్తుందన్నది చూడాలి.