ఇండియా, దట్‌ ఈజ్‌ భారత్‌! | Sakshi Editorial On Pahalgam Terror Attack | Sakshi
Sakshi News home page

ఇండియా, దట్‌ ఈజ్‌ భారత్‌!

Published Sun, Apr 27 2025 12:16 AM | Last Updated on Sun, Apr 27 2025 1:58 PM

Sakshi Editorial On Pahalgam Terror Attack

ఎట్టకేలకు పాకిస్తాన్‌ తన ముసుగును తొలగించింది. ఉగ్రవాద ముఠాలను పాలుపోసి పెంచి పెద్దచేసింది తామేనని అధికారికంగా అంగీకరించినట్లయింది. పాకిస్తాన్‌ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ రెండు రోజుల క్రితం ‘స్కైన్యూస్‌’ ప్రతినిధితో మాట్లాడుతూ అమెరికా కోసం, పశ్చిమ రాజ్యాల కోసం తామీ ‘చెత్తపని’ని చేయవలసి వచ్చిందని అంగీకరించారు. అయితే పహల్‌గామ్‌ ఉగ్రదాడి వెనుక తమ హస్తం లేదని పాత పద్ధతిలోనే బుకాయించే ప్రయత్నం చేశారు. ఈ బుకాయింపునకు పెద్దగా విలువుండదు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించింది తామేనని అంగీకరించిన తర్వాత వారి కార్యకలాపాలతో తమకు సంబంధం లేదని వాదిస్తే అంగీకరించడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు.

భారత్‌పైకి ఉగ్ర ముఠాలను ఉసిగొలిపే అవసరం కూడా పాకిస్తాన్‌కే ఉన్నది. ఇప్పుడదొక విఫల రాజ్యంగా ప్రపంచం ముందు నిలబడి ఉన్నది. ఎన్నడూ రాజకీయ సుస్థిరత లేదు. చెప్పుకోదగిన ఆర్థికాభివృద్ధీ లేదు. తరచుగా మిలిటరీ పాలకుల పెత్తనానికి తలొగ్గే దుఃస్థితి. ప్రజాస్వామ్యం ఒక మేడిపండు చందం. ‘ద్విజాతి’ సిద్ధాంతం అనే విద్వేషపు విత్తనంతో మొలకెత్తిన పాకిస్తాన్‌ వటవృక్షంగా మారి పిశాచ గణాలకు ఆశ్రయమిస్తున్నది. ముస్లిములు ఒక జాతి, హిందువులు మరొక జాతి అన్నదే ఈ ద్విజాతి సిద్ధాంతం.

ఇదొక అసహజమైన భావన. ఒకే ప్రాంతం, ఒకే చరిత్ర, ఉమ్మడి అనుభవాలు, ఆచార వ్యవహారాలు మొదలైన వాటి ప్రాతిపదికపై ఒక జాతిని గుర్తిస్తారు. వీటికి పాలనాపరమైన, చట్టపరమైన అంశాలు కూడా తోడు కావచ్చు. కానీ మతాన్నే జాతిగా భావించే ఆలోచనాధోరణి నుంచి ఇంకా పాకిస్తాన్‌ బయటపడలేదు. 

పది రోజుల కిందటి పాకిస్తాన్‌ ఆర్మీ ఛీఫ్, డిఫ్యాక్టో పాలకుడైన అసీమ్‌ మునీర్‌ ఉపన్యాసాన్ని గమనిస్తే సమీప భవిషత్తులో ఆ దేశం ఈ ఆలోచన నుంచి బయటపడే అవకాశం లేదని అర్థమవుతుంది. ప్రవాసీ పాక్‌ వ్యాపారవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పాకిస్తాన్‌ పుట్టుక గురించి మీ పిల్లలకు చెప్పండి, ఆ తర్వాతి తరాలకు కూడా చెప్పండి. ముస్లింలు వేరనీ, హిందువులు వేరనీ చెప్పండి. మన ద్విజాతి సిద్ధాంతం గురించి చెప్పండ’ని సభికులకు ఆయన నూరిపోశారు.

కశ్మీర్‌ సమస్యను ఎప్పటికీ విడిచిపెట్టబోమనీ, అది తమ జీవనాడని కూడా ఆయన రెచ్చగొట్టారు. ఇది జరిగిన వారం రోజులకే పహల్‌గామ్‌ దాడి జరగడం గమనార్హం. రెండు ప్రయోజనాల్ని ఆశించి పాకిస్తాన్‌ పాలకులు ఈ ద్విజాతి విద్వేష భావజాలాన్నీ, కశ్మీర్‌ అంశాన్నీ జ్వలింపజేస్తున్నారనుకోవాలి. స్వదేశీ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించి వారి భావోద్వేగాలను భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం మొదటిది. ఇక రెండవది – భారతదేశ ప్రజలను కూడా మత ప్రాతిపదికన విడదీసి, ఈ దేశాన్ని అస్థిరత పాలు చేయాలని భావించడం. భారత ప్రజలు కూడా మత ప్రాతిపదికపై విడిపోయి విద్వేషాలు వెదజల్లుకుంటే పాకిస్తాన్‌ పన్నిన ఉచ్చులో చిక్కుకున్నట్టే!

పాకిస్తాన్‌ ప్రస్థానానికి భిన్నంగా భారత్‌ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. లౌకిక, ప్రజాస్వామిక రాజ్యంగా అది తనను తాను ఆవిష్కరించుకున్నది. ‘భారతీయులమైన మేము’ అంటూ తన రాజ్యాంగ రచనను ప్రారంభించిందే తప్ప విభజన నామవాచకాలను వాడలేదు. దేశం పేరును ‘హిందూస్థాన్‌’ అని ప్రకటించాలని కొన్ని వర్గాలు డిమాండ్‌ చేసినప్పటికీ రాజ్యాంగ సభలోని సభ్యులెవరూ దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. 

ఇండియా లేదా భారత్‌ అనే పేర్లపైనే సభ్యులు రెండుగా విడిపోయారు. చివరకు ‘ఇండియా, దటీజ్‌ భారత్‌’ అనే అంబేడ్కర్‌ సూచించిన పదబంధాన్ని అందరూ ఆమోదించారు. హెచ్‌.వి. కామత్‌ ఒక్కరే తొలుత ‘హింద్‌’ అనే పేరును ప్రతిపాదించి, ఆయనే ఉపసంహరించుకున్నారు. ఆ రకంగా భారత రాజ్యాంగంలో ‘ఇండియా, దటీజ్‌ భారత్‌ షల్‌ బీ ఏ యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ అనే వాక్యం ఒకటవ అధికరణంగా చేరింది. 



బహువిధమైన సువిశాల భారతదేశ భిన్నత్వంలో ఏకత్వానికి ఈ మొదటి అధికరణం అద్దంపట్టింది. హిందూయిజం కూడా దాని అంతస్సారంలో భిన్నత్వంలో ఏకత్వమేనని ప్రముఖ తత్వవేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు. దాన్నాయన ఒక మతంగా కాకుండా హిందూ జీవన విధానంగా పరిగణించిన విషయం తెలిసిందే. 

ఈ జీవన విధానంలో భిన్న ఆచార వ్యవహారాలు కలిగిన స్రవంతులు కలిసి ప్రయాణిస్తాయి. సహజీవనం చేస్తాయి. భారతీయత కూడా అంతే! కశ్మీరియత్‌ కూడా అంతే! కశ్మీరీ హిందూ, ముస్లింల మధ్య ఒకప్పటి మత సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం, ఉమ్మడి పండుగలు, ఉత్సవాలు, సూఫీ – భక్తి ఉద్యమాల ప్రభావం, లౌకిక భావాలు కలగలిసిన జీవన విధానమే ‘కశ్మీరియత్‌’గా భావిస్తారు.

కశ్మీరీ యువత స్వతంత్ర భావాలను పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదం హైజాక్‌ చేసిన తర్వాత కూడా, కశ్మీరీ పండితులను ఈ ఉగ్రవాదం లోయ నుంచి తరిమేసిన తర్వాత కూడా, భారత్‌ సైన్యాలు కశ్మీర్‌ లోయను ఒక బందీఖానాగా మార్చి పౌరహక్కుల్ని ఉక్కు పాదాలతో తొక్కేసిన తర్వాత కూడా, ఆర్టికల్‌ 370 రద్దు ద్వారా ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని ఊడబెరికిన తర్వాత కూడా, ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి, కనీస రాష్ట్ర హోదాను లాగేసుకున్న తర్వాత కూడా ‘కశ్మీరియత్‌’ సజీవంగా నిలిచే ఉందని మొన్నటి దాడి సందర్భంగా జరిగిన పరిణామాలు నిరూపించాయి.

ఉగ్రవాద మూకలు అమాయక పర్యాటకుల మీద తుపాకులతో తూటాలు కురిపిస్తుంటే వాళ్లను కాపాడేందుకు చావుకు తెగించి ముష్కర మూకను ప్రతిఘటించి ప్రాణాలు బలిపెట్టిన సయ్యద్‌ హుస్సేన్‌ సజీవ కశ్మీరియత్‌కు ప్రతీక. ఆ దాడి నుంచి తప్పించుకున్నవారు తమకు అండగా నిలబడి కాపాడిన కశ్మీరీ ముస్లిం యువత మానవత గురించి కథలు కథలుగా చెబుతున్నారు. 

ఆ రాష్ట్రానికి పర్యాటకులుగా వెళ్లినవారు ఘటన తర్వాత బిక్కుబిక్కుమంటున్న వేళ వందలాది ముస్లిం గృహస్థులు వారికి తోడుగా నిలబడి ఆశ్రయం కల్పించారనీ, సాదరంగా సాగనంపారనీ కూడా వార్తలొస్తున్నాయి. అయితే, ఆ వార్తలకు ప్రధాన స్రవంతి మీడియాలో రావాల్సిన ప్రాధాన్యం రావడం లేదు. సౌభ్రాతృత్వంతో కూడిన ‘కశ్మీరియత్‌’కూ, ‘ద్విజాతి’ సిద్ధాంతపు విద్వేషానికీ ఎప్పటికీ సాపత్యం కుదరదు. 

కాకపోతే భారతీయత ఆ సౌభ్రాతృత్వాన్ని సమాదరించి గౌరవించాలి. భారత ప్రభుత్వం కశ్మీరీల కిచ్చిన హామీలను అమలు చేయాలి. వారి విశ్వాసాన్ని చూరగొనాలి. ఇది జరిగిన నాడు కశ్మీర్‌ కోసం వెయ్యేళ్ల యుద్ధానికైనా సిద్ధపడతామన్న నాటి పాక్‌ ప్రధాని జుల్ఫికర్‌ అలీ భుట్టో మాటలకు ఇంకో వెయ్యేళ్లు జోడించినా ఫలితముండదు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ గళం విప్పుతున్నాయి. భారత్‌కు బాసటగా ఉంటామని ప్రకటిస్తున్నాయి. తాము ఒంటరవుతున్నామని గమనించిన పాకిస్తాన్‌ ప్రధాని దాడి ఘటనపై విచారణకు సిద్ధమని ప్రకటించారు. ముష్కర మూకను రెచ్చగొట్టింది పాక్‌ ఆర్మీ చీఫ్‌. సిసలైన పాక్‌ పాలకుడు ఆయనే! ఉగ్రవాదులకు మూడు దశాబ్దాలుగా ఆశ్రయమిస్తున్నామని పాక్‌ రక్షణమంత్రి స్వయంగా ప్రకటించిన తర్వాత పాక్‌ ప్రధాని అమాయకత్వం నటిస్తే ఎవరు నమ్ముతారు? ఈ అనుకూల వాతావరణంలోనే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాక్‌పై కఠిన చర్యలను తీసుకోవడానికి కేంద్రం ఉపక్రమించాలి. అయితే ముందుగా దాడికి దిగిన ముష్కరులకు పాక్‌తో ఉన్న సంబంధాలను ధ్రువీకరించవలసిన అవసరం ఉన్నది.

దాడి ఘటనలో ప్రభుత్వపరంగా భద్రతా ఏర్పాట్లలో లోపాలు, నిఘా వైఫల్యాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. అవి దాచేస్తే దాగని నిజాలు. కనీసం ఇప్పుడా హంతకులను పట్టుకొని వారితో పాక్‌ సంబంధాలను రుజువు చేసైనా చేసిన తప్పును దిద్దుకోవలసిన అవసరమున్నది. ఘటన తర్వాత ప్రధాని మోదీ తీవ్రంగానే స్పందించారు. ఇది దేశంపై జరిగిన దాడిగా ప్రకటించారు. వెంటనే కొన్ని చర్యలను ప్రకటించారు. 

అందులో ముఖ్యమైనది సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడం. నిజానికి ఈ పని ఎప్పుడో చేయాల్సింది. బహుశా అంతర్జాతీయ ఒత్తిడి పర్యవసానంగా నెహ్రూ ఈ ఒప్పందానికి తలూపి ఉంటారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు ఇప్పుడున్నంత పలుకుబడి అప్పుడు లేదు. నెహ్రూకు వ్యక్తిగత పలుకుబడి మాత్రం ఉండేది. ఉగ్రవాదాన్ని అప్పుడింకా ఈ స్థాయిలో ఊహించలేదు. కనుక పాకిస్తాన్‌కూ పశ్చిమ రాజ్యాల మద్దతు ఉండేది.

సింధు నదీ జలాల ప్రవాహంలో సగానికి పైగా భారత్‌లో ఉన్న పరివాహక ప్రాంతమే మోసుకెళ్తున్నది. సింధు నది టిబెట్‌లోని కైలాస పర్వతం పాదాల దగ్గర పుట్టి, భారత్‌లోని లద్దాఖ్, పాక్‌ ఆక్రమిత గిల్గిట్‌లలో 1100 కిలోమీటర్లు ప్రవహించి పాకిస్తాన్‌లో ప్రవేశిస్తుంది. నదికి కుడివైపు నుంచి పాక్‌ భూభాగం, పాక్‌ ఆక్రమిత భూభాగాల ద్వారా అరడజనుకు పైగా ఉపనదులు కలుస్తాయి. 

అందులో కాబూల్‌ నది, గిల్గిట్‌ నది, హూంజా నది, స్వాట్‌ నది ముఖ్యమైనవి. కానీ భారత్‌ నుంచి సింధులో ఎడమ వైపుగా కలిసే పంచ నదులే ఆ నదికి ప్రాణం. ఈ ఐదు నదుల్లో జీలం, చీనాబ్‌ నదులతోపాటు సింధు నది జలాలపై పూర్తి హక్కుల్ని ఈ ఒప్పందం పాక్‌కు కట్టబెట్టింది. సట్లెజ్, రావి, బియాస్‌ నదీ జలాలపై మాత్రమే భారత్‌కు వినియోగించుకునే హక్కులు దక్కాయి.

సింధు నది బేసిన్‌లో ఈ పంచ నదులకున్న కీలక పాత్రకు రుగ్వేదకాలం నుంచే అంటే మూడున్నర వేల యేళ్ల క్రితం నుంచే గుర్తింపు ఉన్నది. రుగ్వేద ఆర్యులు ఈ బేసిన్‌ను ‘సప్తసింధు’గా పిలిచారు. రుగ్వేద కాలానికి ఇంచుమించు సమాన కాలంలో పర్షియన్‌ నాగరికతలో ప్రభవించిన ‘అవెస్థా’ గ్రంథం కూడా ఈ లోయను ‘హప్తహెందూ’గా ప్రస్తావించింది. 

అంటే ఆ ఏడు నదులకు సింధుతో సమాన ప్రాధాన్యతనిచ్చారు. వాటిని 1. సింధు నది, 2. వితస్థా (జీలం), 3. అసిక్ని లేదా చంద్రభాగా (చీనాబ్‌), 4. పురుష్ణి (రావి), 5. విపాస (బియాస్‌), 6 శతుద్రి (సట్లెజ్‌), 7. సరస్వతీ నదులుగా రుగ్వేదం ప్రస్తావించిందని చెబుతారు. ఈ ఏడో నది వేలయేళ్ల క్రితమే ప్రస్తుత రాజస్థాన్‌ ప్రాంతంలో అంతరించి ఉంటుందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే సింధు బేసిన్‌లో భారత భూభాగానికి ఉన్న ప్రాధాన్యత అర్థమవుతుంది. న్యాయబద్ధంగా ఈ బేసిన్‌లో సగటున లభ్యమయ్యే ఎనిమిది వేల టీఎమ్‌సీల్లో (బ్రిటానికా లెక్క) సగం మనకు దక్కాలి. కానీ ఒప్పందం కారణంగా ఇరవై శాతం జలాలపైనే హక్కులున్నాయి. ఆయా ప్రాంతాల నైసర్గిక స్వరూపాలు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ‘బేసిన్లూ లేవు, భేషజాలూ లేవు’ అని గతంలో కేసీఆర్‌ వ్యాఖ్యానించడం నిజమే. కానీ అది ఒకే దేశంగా ఉన్నప్పటి మాట. రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత, ఒక దేశం మీద మరొక దేశం ఉగ్రదాడులు చేస్తున్న నేపథ్యంలో బేసిన్లూ ఉంటాయి. భేషజాలూ ఉంటాయి.

కీలకమైన పంచ నదుల ప్రవాహాన్ని భారత్‌ అడ్డుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ శక్తీ అడ్డుకోకపోవచ్చు. కానీ ఈ చర్య వలన పాక్‌ పౌరుల ఆహార భద్రతకు కలిగే ముప్పును, పర్యావరణ మార్పుల సంభావ్యతను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. పాక్‌ పాలకుల స్పందనను బట్టి ఈ జలాయుధ ప్రయోగ తీవ్రత ఉండవచ్చు. భారతీయులుగా ఈ దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం, దేశ భద్రత కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతునీయడం ప్రజల బాధ్యత. 

అదే సందర్భంలో ప్రజలను విడగొట్టకుండా భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలబెట్టుకోవడం ద్వారా మాత్రమే భారతీయత నిలబడుతుంది. ద్విజాతి సిద్ధాంతం ప్రభావం మన దేశంలో కూడా కొంతమందిపై ఇప్పుడు కనిపిస్తున్నది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే పాకిస్తాన్‌ బాటలోనే భారత భవిష్యత్తును దర్శించవలసి వస్తుంది. భిన్నత్వంలో ఏకత్వమనే భారతీయ జీవన విధానమే కాలపరీక్షకు తట్టుకొని అభివృద్ధికి ఆలంబనగా నిలిచింది. ఇకముందు కూడా అదే మనకు శ్రీరామరక్ష.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement