
ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయ రంగానికి చాలాకాలంగా సవాలుగా మారుతున్నాయి. ఉత్పత్తి, సరఫరా గొలుసులు, మార్కెట్ స్థిరత్వానికి విఘాతం కలిగిస్తున్నాయి. వరదలు, తుపానులు, ఈదురుగాలులు, కరువులు, హారికేన్లు, కార్చిచ్చులు.. వంటి సంఘటనలు అన్నదాతలపాలిట శాపంగా మారుతున్నాయి. ఇటీవల తీవ్ర ఈదురుగాలులు, ఆకాల వర్షాలతో తెలంగాణ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో భారీగా పంటనష్టం వాటిల్లింది. నిత్యం దేశవ్యాప్తంగా ఎక్కడోచోట ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. దేశ జీడీపీలో సింహభాగాన్ని ఆక్రమించిన వ్యవసాయంలో అనిశ్చితుల వల్ల ఆర్థిక పరిస్థితి కుంటుపడుతుంది. ప్రకృతి వైపరీత్యాలు ఆర్థికంగా వ్యవసాయాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఉత్పాదకత తగ్గుదల
వ్యవసాయం స్థిరమైన వాతావరణ పరిస్థితులపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఏదైనా అంతరాయం కలిగినప్పుడు గణనీయమైన ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. పంట వైఫల్యాలు, పశువుల మరణాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతినడం.. వంటివి ఉత్పాదకతను తగ్గిస్తాయి. ఇది రైతులు, వ్యవసాయ ఆధారిత వ్యాపారాల ఆదాయ మార్గాలను నేరుగా ప్రభావితం చేస్తుంది.
సరఫరా గొలుసు అంతరాయాలు
ప్రకృతి వైపరీత్యాలు రవాణా నెట్‌వర్క్‌లను నిర్వీర్యం చేస్తాయి. ఈదురుగాలులు, తుపానులు.. వంటివి సంభవించినప్పుడు వ్యవసాయ రవాణా కష్టతరమవుతుంది. దాంతో పంట ఉత్పత్తులను పొలాల నుంచి మార్కెట్లకు తరలించడం సాధ్యం కాదు. నీట మునిగిన రోడ్లు, దెబ్బతిన్న ఓడరేవులు, లాజిస్టిక్స్ నష్టపోవడం వల్ల జాప్యం జరుగుతుంది. ఫలితంగా మార్కెట్‌లో కొరత ఏర్పడే అవకాశం ఉంది.
మార్కెట్ అస్థిరత.. ధరల హెచ్చుతగ్గులు
వ్యవసాయ ఉత్పత్తుల్లో సరఫరా అంతరాయాలు తరచుగా ధరల హెచ్చుతగ్గులకు దారితీస్తాయి. నిత్యావసర పంటల ఆకస్మిక కొరత ధరలను పెంచుతుంది. ఇది వినియోగదారులు, వ్యవసాయ ముడి పదార్థాలపై ఆధారపడిన వ్యాపారాలను ప్రభావితం చేస్తుంది.
దీర్ఘకాలిక ఆర్థిక పరిణామాలు
తక్షణ నష్టాలకు మించి ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతాయి. నేల క్షీణత, వ్యవసాయ యోగ్యమైన భూమి కోల్పోవడం, వ్యవసాయంలో పెట్టుబడి తగ్గడం ప్రధాన సమస్యలుగా మారుతాయి. తిరిగి ఈ వ్యవస్థ రికవరీకి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: ‘ఐటీ’ ఫలితాలు నేలచూపులు.. అందుకు కారణాలు..
ఏం చేయాలంటే..
ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని తగ్గించడానికి క్లైమేట్-స్మార్ట్ అగ్రికల్చర్(వాతావరణ అనుకూల వ్యవసాయం), సుస్థిర పద్ధతుల్లో వ్యవసాయం చేసేలా రైతుల్లో అవగాహన కల్పించాలి. ఎలివేటెడ్ షెడ్ల నిర్మాణం వల్ల ఇలాంటి వైపరీత్యాలను కొంతవరకు కట్టడి చేయవచ్చు. కానీ ఇది పరిమితమైన కమతాలకే ఉపయోగపడుతుంది. దీనిపై మరింత పరిశోధనలు జరిగాలి. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా సప్లై-చెయిన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలి. విపత్తును ముందుగానే గుర్తించేందుకు, తగిన ప్రతిస్పందన చర్యల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి.