
ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ పవర్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 శాతం నీరసించి రూ. 2,599 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,737 కోట్లు ఆర్జించింది. రూ. 350 కోట్లమేర ఇబిటాపై వన్‌టైమ్ ఐటమ్ ప్రభావం పడినట్లు కంపెనీ పేర్కొంది.
మొత్తం ఆదాయం మాత్రం 5 శాతం వృద్ధితో రూ. 13,787 కోట్ల నుంచి రూ. 14,522 కోట్లకు బలపడింది. విద్యుత్ విక్రయాలు 26.4 బిలియన్ యూనిట్ల(బీయూ)కు చేరాయి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం భారీగా క్షీణించి రూ. 12,750 కోట్లకు చేరింది. 2023–24లో కేవలం రూ. 20,829 కోట్ల లాభం ఆర్జించింది.
ఇందుకు ప్రధానంగా వన్‌టైమ్ ఐటమ్, అధిక పన్ను వ్యయాలు కారణమైనట్లు కంపెనీ తెలియజేసింది. మొత్తం ఆదాయం 11 శాతం పుంజుకుని రూ. 56,473 కోట్లకు చేరింది. ఈ కాలంలో 102.2 బీయూ విద్యుత్‌ను ఉత్పత్తి చేయగా.. విక్రయాలు 21 శాతం ఎగసి 95.9 బీయూను తాకాయి. ఫలితాల నేపథ్యంలో అదానీ పవర్ షేరు బీఎస్‌ఈలో 3% క్షీణించి రూ. 532 వద్ద ముగిసింది.
నష్టాల బాటలో జేఎస్‌పీఎల్
ప్రయివేట్ రంగ దిగ్గజం జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్‌పీఎల్) గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ని రుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. రూ. 304 కోట్ల నష్టం నమోదు చేసింది.
అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కా లంలో రూ. 933 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరు కి రూ. 2 డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 15,749 కోట్ల నుంచి రూ. 15,525 కోట్లకు స్వల్పంగా క్షీణించింది. ఫలితాల నేపథ్యంలో జేఎస్‌పీఎల్ షేరు బీఎస్‌ఈలో యథాతథంగా రూ. 895 వద్ద ముగిసింది.