కలెక్టర్ మహేష్‌కుమార్
సాక్షి, అమలాపురం: అంతర్వేది పల్లిపాలెం హార్బర్ నిర్వహణను ఆర్‌ఆర్ ఏజెన్సీకి నవంబర్ నుంచి అప్పగిస్తామని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్‌కుమార్ వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్‌లో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో హార్బర్ అభివృద్ధిపై కలెక్టర్ అధ్యక్షతన సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, సుమారు రూ.26 లక్షలతో వివిధ పనులకు అంచనాలు రూపొందించారని, ఈ పనులు నవంబర్ లోపు పూర్తి చేసి, నిర్వహణను ఏజెన్సీకి అప్పగిస్తారని వివరించారు. భద్రతా చర్యలు పటిష్టంగా చేపట్టాలని, ఆర్‌డబ్ల్యూఎస్ విభాగం, జల్‌జీవన్ మిషన్ ద్వారా హార్బర్ అవసరాలకు వాటర్ ట్యాంకును నిర్మించాలని, ఉపాధి హామీ అనుసంధానంతో అప్రోచ్ రోడ్డును, విద్యుత్ సరఫరాను ఏపీఈపీడీసీఎల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒప్పంద పత్రాలపై ఆర్డీఓ, మత్స్య శాఖ సంతకాలు చేయాలని ఆదేశించారు. హార్బర్ నిర్వహణ ద్వారా అంతర్వేది ప్రాంతంలో మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలన్నారు. పూర్తి స్థాయి వసతులు కల్పించి, సమర్థవంతంగా నిర్వహణ చేపట్టి, మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో జేసీ నిషాంతి, ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డీవో కె.మాధవి, జిల్లా మత్స్య శాఖ అధికారి పీవీ శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఏవీఎస్ రామన్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ బి.రాజేశ్వరి, ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆర్జీలపై అలసత్వం వద్దు
అమలాపురం రూరల్: ప్రజల అర్జీలపై అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ ప్రాంతాల అర్జీదారుల నుంచి సుమారు 150 అర్జీలను స్వీకరించారు. అర్జీలను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా విచారించి, నూరు శాతం సంతృప్తి కలిగేలా ఫిర్యాదును ముగించాలన్నారు. గడువు దాటిన అర్జీలు లేకుండా, ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలు చూపాలన్నారు. ఇద్దరు దివ్యాంగులకు సాంకేతిక విద్యాభ్యాసం కోసం ల్యాప్‌టాప్‌లను విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా కలెక్టర్ ఉచితంగా అందజేశారు. డీఆర్వో మాధవి, సమగ్ర శిక్షా ఏపీసీ జి.మమ్మీ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
బ్రిటిష్ మ్యాపుల ఆధారంగా సర్వే
జిల్లాలో బ్రిటిష్ కాలం నాటి మ్యాపులు సర్వే ప్రమాణాల ప్రకారం పంట కాలువలు, డ్రెయినేజీలకు ప్రయోగాత్మక సర్వే నిర్వహించి సరిహద్దుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్టు కలెక్టర్ మహేష్‌కుమార్ వెల్లడించారు. సోమవారం అమలాపురం మండలం నడిపూడి లాకు వద్ద బ్రిటిష్ కొలమానం ప్రకారం సర్వే నిర్వహించి, సరిహద్దు రాళ్ల ఏర్పాటు చేసే ప్రక్రియకు నాంది పలికారు. కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా ఉన్న డ్రెయిన్లు, పంట కాలువల సర్వేను నాలుగైదు నెలల్లో పూర్తి చేసి, పూర్తిగా ఆక్రమణలను తొలగించి, సరిహద్దు రాళ్ల ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు. బ్రిటిష్ సర్వే కొలమానం ప్రకారం వంద మీటర్లకు ఒక సరిహద్దు రాయిని ఏర్పాటు చేసి, దానిపై పూర్తి వివరాలను రాస్తారన్నారు. భవిష్యత్తులో ఎవరు ఈ సరిహద్దు దాటి ముందుకు రాకూడదని హెచ్చరించారు. ఎమ్మెల్యే ఆనందరావు, ఆర్డీవో కె.మాధవి, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.