
సత్యదేవునికి రూ.1.49 కోట్ల హుండీ ఆదాయం
అన్నవరం: సత్యదేవునికి హుండీల ద్వారా దండిగా ఆదాయం సమకూరింది. గడచిన 35 రోజులకు హుండీల ద్వారా రూ.1,48,77,755 రాబడి వచ్చింది. దేవస్థానంలోని హుండీలను సోమవారం తెరచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. ఈ సందర్భంగా నగదు రూ.1,39,47,961, చిల్లర నాణేలు రూ.9,29,794 వచ్చాయని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. హుండీల ద్వారా 62 గ్రాముల బంగారం, 345 గ్రాముల వెండి కూడా లభించాయి. అలాగే, అమెరికన్ డాలర్లు 76, ఇంగ్లండ్ పౌండ్లు 15, సింగపూర్ డాలర్లు 4, సౌదీ రియల్స్ 6, యూఏఈ దీరామ్స్ 20, ఖతార్ రియల్స్ 1, మలేషియా రింగిట్స్ 1 చొప్పున భక్తులు హుండీల్లో వేశారు. గత 35 రోజులకు సరాసరి హుండీ ఆదాయం రూ.4.25 లక్షలుగా నమోదైంది. ఈ 35 రోజుల్లో 23 రోజులు భాద్రపదం కాగా, 12 రోజులు మాత్రమే ఆశ్వయుజ మాసం. దసరా సెలవుల్లో భక్తులు రత్నగిరికి పోటెత్తడం, వివాహాది శుభకార్యాలు గణనీయంగా జరగడం కూడా హుండీ ఆదాయం పెరుగుదలకు కారణమని అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, ఈఓతో పాటు, సిబ్బంది, పలు స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు పాల్గొన్నారు. హుండీల్లో వచ్చిన నగదును స్థానిక యూనియన్ బ్యాంకుకు తరలించారు.

సత్యదేవునికి రూ.1.49 కోట్ల హుండీ ఆదాయం