
కళాపోషణ లేక..
ఫ వైభవం కోల్పోతున్న రంగస్థలం
ఫ ఉమ్మడి జిల్లాలో కొన్నిచోట్లే ప్రదర్శనలు
ఫ చిన్న నాటకాలు, ఆ కళాకారులకు ఆదరణ కరవు
కొత్తపేట: కళా‘పోషణ’ కనుమరుగవుతోంది.. నాటక రంగం పూర్వ వైభవాన్ని కోల్పోతోంది.. కళాకారులకు పూట గడవడమే కష్టమవుతోంది.. ఒకప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక వెలుగు వెలిగిన రంగస్థల పౌరాణిక నాటక రంగంపై క్రమంగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. గతంలో ఊరూరా నాటక ప్రదర్శనలతో సందడి నెలకొనేది. అనేక ఉత్సవాల్లో రంగస్థల వేదికలపై పౌరాణిక, జానపద, సాంఘిక నాటకాలతో కళావైభవం కనువిందు చేసేది. ప్రస్తుతం ఇది కొన్ని ఉత్సవ పందిర్లకే పరిమితమైంది. పెద్ద నాటకాల్లో కళాకారులకే ప్రాధాన్యం లభిస్తోంది. చిన్న నాటకాలు, ఆ కళాకారులకు ఉపాధి దూరమైంది. ప్రస్తుతం వారి పరిస్థితి రంగులు వెలిసిన జీవితంగా మారింది.
దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు నాటక రంగంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. జిల్లాకు చెందిన రంగస్థల నటుల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన వారెందరో ఉన్నారు. లవకుశ సినిమా రాక ముందే చింతా సుబ్బారావు నేతృత్వంలో లవకుశ డ్రామా ట్రూపు ఉండేదట. అప్పట్లో ఆ నాటకం ప్రేక్షకాదరణ పొందిందని చెబుతూంటారు. తరువాత రాజానగరం మండలం సంపత్ నగరం గ్రామానికి చెందిన పేపకాయల లక్ష్మణరావు (సంపత్ నగరం లక్ష్మణరావు) ఆంజనేయుని పాత్ర పోషించి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇచ్చి అభినవ ఆంజనేయునిగా పేరొందారు. రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం అందుకున్నారు. కొత్తపేటకు చెందిన జగత పెద్దకాపు 1960–75 మధ్య కాలంలో దుర్యోధనుడు, విశ్వామిత్రుడు తదితర పాత్రలకు జీవం పోశారు. కోరుకొండకు చెందిన ఎన్‌వీఎల్ ఆచారి దుర్యోధనుడిగా రాణించారు. కృష్ణుడిగా సత్యంశెట్టి (ద్వారపూడి) సూర్యారావు, ఆయన తనయుడు శేషగిరిరావు, యెరుబండి మందేశ్వరరావు, కోట నాగేశ్వరరావు, సుబ్బిశెట్టిగా పడాల సుందరం (జూనియర్ రేలంగి), మాయల ఫకీర్‌గా బెజవాడ రామారావు, బత్తిన నాగేశ్వరరావు, ధర్మరాజుగా నరేంద్రపురపు గంగరాజు, కొమ్మిశెట్టి పెద వీర్రాజు, అర్జునుడిగా తంబాబత్తుల నాగేశ్వరరావు తదితర నటులు రంగస్థలంపై తమ నటనా కౌశలాన్ని చాటారు. అలాగే ప్రస్తుతం శ్రీరాముడిగా సంపత్ నగరం లక్ష్మణరావు కుమారుడు పి.రామాంజనేయులు, ఆయన తనయుడు జూనియర్ లక్ష్మణరావు ఆంజనేయుడిగా, చింతామణిలో శ్రీహరిగా పుణ్యక్షేత్రం సత్యప్రసాద్ తదితరులు రాణిస్తున్నారు.
ఎందరున్నా కొందరికే..
ప్రస్తుత తరం నటీనటుల్లో కేవలం కొందరికే నాటక అవకాశాలు లభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో రాజమహేంద్రవరం, అమలాపురం, కొత్తపేట, కడియం, వాడపాలెం, వానపల్లి, అవిడి, రామచంద్రపురం, తుని, ద్రాక్షారామ, తుని, జగ్గంపేట, కాకినాడ, యానాం, తాళ్లరేవు, చల్లపల్లి, సీతానగరం, అనపర్తి, రాజోలు, రాజానగరం, బిక్కవోలు, పెద్దాపురం, సామర్లకోట, మండపేట, ముమ్మిడివరం తదితర అనేక ప్రాంతాల్లో గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులతో పాటు శ్రీరామ నవమి, శ్రీకృష్ణాష్టమి, సుబ్రహ్మణ్య షష్ఠి, ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాలను పురస్కరించుకుని వరుసగా 9, 10 రోజులు నాటక ప్రదర్శనలు నిర్వహించేవారు. దానితో రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన పెద్ద కళాకారులకే కాక చిన్న కళాకారులకు కూడా అవకాశాలు లభించేవి. కాలక్రమేణా పందిర్ల లైటింగ్, తదితర ఏర్పాట్లు, ఉత్సవాల ఖర్చు పెరగడంతో పాటు ఆర్టిస్టుల పారితోషికం అధికమవడంతో అనేక పందిర్లలో నాటక ప్రదర్శనలకు స్వస్తి చెప్పారు. రాజమహేంద్రవరం దేవీచౌక్, చాగల్లు, అమలాపురం, కడియం వంటి పలు పందిర్లలో ఐదారు నాటకాలు ప్రదర్శిస్తూండగా, మరో ఐదారు పందిర్లలో కళా ప్రోత్సాహకుల ఆర్థిక సహకారంతో కేవలం ఒకటి, రెండు ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. అవీ రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ నటులను తీసుకువచ్చి నాటకాలు వేయిస్తున్నారు. ఆ నాటకాల్లో ఒక్కో నటుడు రూ.20 నుంచి రూ.50 వేల వరకూ పారితోషికం తీసుకుంటున్నారు. అలా ఒక్కో నాటకానికి రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకూ అవుతుంది.
హార్మోనిస్టుల పాత్ర కీలకం
రంగస్థల నాటకానికి హార్మోనియం ప్రధానం. నాటక కళాకారుడు ఎంత బాగా పాడినా, పద్య రాగాలాపన చేసినా దానికి హార్మోనియం, డోలక్, క్లారినెట్ సహకారం అవసరం. వేదికపై నటుడి కృషి ఎంతో ఉంటుందో, స్టేజీ ముందు హార్మోనియం, డోలక్, క్లారినెట్ కళాకారుల కృషి కూడా అంతే ఉంటుంది. ఇటువంటి కళాకారులు జిల్లాలో ఎంతో మంది ప్రతిభ చూపి తెరమరుగయ్యారు. ప్రస్తుతం రాజమహేంద్రవరానికి చెందిన కలిగట్ల వెంకటరమణ, సత్తిబాబు, సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన మైలవరపు శ్రీనివాస్ నాయుడు, కోరుకొండకు చెందిన సుబ్రహ్మణ్యం, నరేంద్రపురానికి చెందిన టేకి వీరబాబు తదితరులు హార్మోనిస్టులుగా రాణిస్తున్నారు.