కొత్తపేట: కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ బండ్లగూడ ప్రాంతానికి చెందిన కూచుబట్ల శ్రీగిరి, సుధా దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.1,00,116, పలువురు దాతలు నిత్యాన్న ప్రసాద పథకానికి విరాళాలు అందించారు. ఆయా దాతలకు దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, సిబ్బంది స్వామివారి చిత్రపటాలను అందజేశారు.
నిత్యాన్నదానానికి విరాళాలు
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి పి.గన్నవరం మండలం పెదపూడి గ్రామానికి చెందిన బొరుసు వీరవెంకట సత్యనారాయణ, రమాదేవి దంపతులు ఆదివారం రూ.51,116 విరాళంగా సమర్పించారు. ఈ సొమ్మును ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావుకు అందజేశారు. దాతను వేదమంత్రాలతో సత్కరించి స్వామివారి చిత్రపటం, ప్రసాదం ఇచ్చారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన బల్ల వెంకట నాగసతీష్, జానకి రత్న జ్యోతిర్మయిలు రూ.10,116 అందించారు.
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
అమలాపురం రూరల్: అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ గోదావరిభవన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను సోమవారం ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ సమస్యలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి, పరిష్కార మార్గాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజనల్ అధికారుల కార్యాలయాల్లో, మండల తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో గ్రీవెన్స్ జరుగుతుందన్నారు.
ఏలేరులో పెరిగిన
నీటి నిల్వలు
ఏలేశ్వరం: పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ఏలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. జలాశయంలోకి ఆదివారం 1,616 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి 1,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 86.46 మీటర్లు కాగా, ప్రస్తుతం 84.37 మీటర్లకు చేరింది. పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలకు గానూ నీటి నిల్వలు 19.81 టీఎంసీలకు చేరాయి. ఆయకట్టుకు 900, విశాఖకు 175 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. తిమ్మరాజు చెరువుకు నీటి విడుదలను నిలిపివేశారు.
దుర్గమ్మ విగ్రహం @
రూ.1.45 లక్షలు
దేవరపల్లి: దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా స్థానిక మూడు బొమ్మల సెంటర్‌లోని సౌభాగ్య దుర్గాంబికా ఆలయం వద్ద ప్రతిష్ఠించి, పూజలు నిర్వహించిన అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఆలయ కమిటీ ఆధ్వర్యాన శనివారం రాత్రి వేలం నిర్వహించారు. ఈ పాటలో గ్రామానికి చెందిన జుత్తిగ సత్యనారాయణ రూ.1.45 లక్షలకు అమ్మవారి విగ్రహాన్ని దక్కించుకున్నారు. ఈ విగ్రహాన్ని ఈ నెల 8వ తేదీన గ్రామంలో ఊరేగించి, నిమజ్జనం చేయనున్నారు.
అన్నదాన భవనానికి రూ.లక్ష విరాళం
అన్నదాన భవనానికి రూ.లక్ష విరాళం