
వైద్యుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి
చీరాల రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని వైఎస్సార్ సీపీ వైద్యుల విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఇస్తర్ల బాబురావు పేర్కొన్నారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీహెచ్‌సీల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు గత కొద్దిరోజులుగా విధులు బహిష్కరించి నిరసన తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో క్లినికల్ విభాగంలో 30 శాతం, నాన్ క్లినికల్‌లో 50 శాతం చొప్పున గత ప్రభుత్వంలో ఇన్ సర్వీస్ కోటా ఉండేదని గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ కోటాను చంద్రబాబు ప్రభుత్వం రాగానే క్లినికల్ కోర్సుల్లో 15 శాతం, నాన్ క్లినికల్ విభాగంలో 30 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. దీంతో వైద్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం ఇన్ సర్వీసు కోటాను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న వైద్యులకు అలవెన్సులు, పదోన్నతులు కల్పించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు విష జ్వరాలతో అల్లాడిపోతున్నారని గుర్తుచేశారు. పీహెచ్‌సీల్లో వైద్యులు ఎమర్జెన్సీ వైద్య సేవలు నిలిపివేయడంతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేక పేదలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
వైఎస్సార్‌సీపీ వైద్యుల విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఇస్తర్ల బాబురావు