
కేంద్రం కనీస వేతనాన్ని రూ. 21 వేలుగా ఖరారు చేసినా తెలుగు రాష్ట్రాల్లో అమలుకాని వైనం
నిబంధనల ప్రకారం ఐదేళ్లకోసారి సవరణ జరగాల్సి ఉన్నా 11 ఏళ్లుగా కార్యాచరణ శూన్యం
ఉమ్మడి రాష్ట్రంలో 2006–12 మధ్య నిర్ణయించిన కనీస వేతన ఉత్తర్వులే నేటికీ కొనసాగింపు
తెలంగాణలో 73 ఉపాధి రంగాల్లో ఐదింటికి జీఓలిచ్చినా ఫలితం నిల్.. మరో 12 ప్రతిపాదనలకే పరిమితం
కొత్త ప్రభుత్వం అన్ని ఉపాధి రంగాలకూ నోటిఫికేషన్లు ఇవ్వడంతో మళ్లీ మొదటికొచ్చిన వ్యవహారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రలో అసంఘటిత రంగ కార్మీకుల కనీస వేతన సవరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఒక్కసారి కూడా కనీస వేతన సవరణ జరగలేదు. ఐదేళ్లకోసారి తప్పనిసరిగా కనీస వేతన సవరణను ఖరారు చేయాలని కార్మీక చట్టాల్లో ఉన్నప్పటికీ 11 ఏళ్లుగా ఆ దిశగా ప్రభుత్వాలు కసరత్తు చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2006 నుంచి 2012 మధ్య ఇచ్చిన వేతన సవరణ ఉత్తర్వులే ఇప్పటికీ దిక్కయ్యాయి.
ఆ ఉత్తర్వుల ప్రకారం వివిధ ఉపాధి రంగాల్లో కనీస వేతనం రూ. 3,370 నుంచి రూ. 5,138 మధ్య ఉంది. రాష్ట్రంలో 73 ఉపాధి రంగాలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించగా వాటిలో దాదాపు 1.27 కోట్ల మంది కార్మీకులు పనిచేస్తున్నారు. వారిలో 38 లక్షల మంది మహిళలు ఉన్నట్లు రాష్ట్ర కార్మీక శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
పెరుగుతున్న జీవన ప్రమాణాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఐదేళ్లకోసారి ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వేతన స్థిరీకరణ చేస్తుంది. అదే తరహాలో అసంఘటితరంగ కార్మికుల వేతన సవరణను కూడా ఐదేళ్లకోసారి చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియలో రాష్ట్ర స్థాయిలోని కార్మీక వేతన సలహా బోర్డు పాత్ర కీలకం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా వేతన సవరణ ప్రక్రియ కొలిక్కిరాలేదు.
కొత్త రాష్ట్రంలో నాలుగు బోర్డులు...
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నాలుగు కనీస వేతన సవరణ సలహా బోర్డులు ఏర్పాటయ్యాయి. మొదటి సలహా బోర్డు 2014 నవంబర్‌లో ఏర్పాటై 2016 నవంబర్‌తో ముగిసింది. రెండో బోర్డు 2016 డిసెంబర్ నుంచి 2018 డిసెంబర్ వరకు కొనసాగాల్సి ఉంది. కానీ తదుపరి బోర్డు ఏర్పాటులో జాప్యంతో 2021 ఫిబ్రవరి కొనసాగింది.
ఈ కాలంలో మొత్తం ఆరుసార్లు సమావేశమైంది. ఆ తర్వాత మూడో బోర్డును ప్రభుత్వం 2023 మేలో ఏర్పాటు చేసింది. అయితే 2023 డిసెంబర్‌లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం నామినేటెడ్ పదవులను రద్దు చేయడంతో ఆ బోర్డు రద్దయ్యింది. 2024 మార్చిలో నాలుగో బోర్డు చైర్మన్‌ను నియమించిన ప్రభుత్వం.. పూర్తిస్థాయి బోర్డును 2024 డిసెంబర్‌లో నియమించింది.
ఏయే బోర్డులు ఏం చేశాయి?
అసంఘటితరంగ కార్మీకుల వేతన సవరణ కోసం రాష్ట్రంలో ఏర్పాటైన మొదటి బోర్డు పలు దఫాల చర్చల అనంతరం అన్‌స్కిల్డ్ కార్మీకుడి కనీస వేతనాన్ని రూ. 11,905.36 నుంచి రూ. 12,068.80 మధ్య ఉండేలా సిఫారసు చేసింది. మొత్తం 73 షెడ్యూల్డ్ రంగాలకుగాను 34 రంగాలకు ఈ వేతనాలను ఖరారుచేస్తూ కార్మీక శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఇక రెండో బోర్డు.. మొదటి బోర్డు చేసిన సిఫార్సులను పునఃసమీక్షించి కేటగిరీలవారీగా వేతన సవరణ పూర్తిచేసి ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
అందులో 5 కేటగిరీలకు ప్రభుత్వం జీఓలు ఇచ్చినప్పటికీ వాటిని గెజిట్‌లో చేర్చలేదు. దీంతో మరో 12 కేటగిరీల ప్రతిపాదనలను పెండింగ్‌లో పెట్టింది. ఇక మిగిలిన 56 కేటగిరీల ప్రతిపాదనల ఊసేలేదు. ఆ తర్వాత ఏర్పాటైన మూడో బోర్డు ప్రస్తుతమున్న ఏడు కార్మిక కేటగిరీలను నాలుగుకు కుదించేందుకు ప్రయత్నించింది.
అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మూడో బోర్డు రద్దైంది. ప్రస్తుత నాలుగో బోర్డు పలు దఫాలు సమావేశమైనా ఇంకా నిర్ణయాలేవీ తీసుకోలేదు. ఈలోగా రేవంత్ ప్రభుత్వం గతేడాది మొత్తం 73 ఉపాధి రంగాలకూ కనీస వేతన సవరణ చేయాలని నిర్ణయిస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్లు జారీ చేసింది. దీంతో కనీస వేతన సవరణ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది.
వేతన సవరణ లెక్క సూత్రం...
ఒక కార్మీకుడి కుటుంబంలో నలుగురు సభ్యులుంటే అందులో కార్మీకుడిని ఒక యూనిట్ విలువగా, కార్మికుని భార్యను 0.8 యూనిట్‌గా, ఇద్దరు పిల్లల్ని 0.6 చొప్పున నిర్ధారిస్తారు. లేబర్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ ఆమోదం ప్రకారం ఒక కార్మీకుడు జీవించేందుకు అవసరమైన కేలరీలు 2,700. ఒక కుటుంబానికి ఏడాదికి కావాల్సిన వస్త్రం 72 గజాలు. ఇంటి అద్దె కింద 10 శాతం, పిల్లల చదువులు, వైద్యం, ఇతర ఖర్చులకు 20 శాతం చొప్పున లెక్కించి వేతన సవరణ చేయాలి. సవరణ సమయంలో నిత్యావసరాల ధరలు, మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి.
శాస్త్రీయత పాటించకుంటే న్యాయ చిక్కులు
కార్మికుల కనీస వేతన సవరణ ప్రక్రియను చట్టప్రకారం చేయాలి. అక్రాయిడ్ ఫార్ములా ఆధారంగా గణించాలి. గత ప్రభుత్వ నిర్ణయాల కంటే మెరుగ్గా వేతన సవరణ చేస్తామని ఇప్పటి ప్రభుత్వం చెబుతున్నా అందుకు శాస్త్రీయత, క్రమపద్ధతి పాటించకుంటే న్యాయ చిక్కులు తప్పవు.
– ఎండీ యూసూఫ్, కనీస వేతన సలహా బోర్డు సభ్యుడు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు
దుర్భరంగా కార్మీకుల జీవితాలు
తెలంగాణ ఏర్పాటు తర్వాత అసంఘటితరంగ కార్మీకుల వేతన సవరణ కోసం చాలాసార్లు ప్రభుత్వానికి విన్నవించాం. అయినా వేతన సవరణ జరగకపోవడంతో కార్మీకుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగినా కనీస వేతన సవరణపై ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడం సరికాదు. కేంద్రం కనీస వేతనాన్ని రూ. 21 వేలకు ఖరారు చేసినా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత తక్కువగా వేతనాలున్నాయి.
– సుంకరి మల్లేశం, ఈపీఎఫ్‌ఓ సీబీటీ మెంబర్, భారత్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు
ఇది శ్రమ దోపిడీయే
ప్రభుత్వం దశాబ్దన్నర కాలంగా వేతన సవరణ చేయకపోవడం కార్మీకుల శ్రమను దోచుకోవడమే. మొత్తం 73 ఉపాధి రంగాలకు వేతనాలను సవరించాలని రెండో కార్మీక వేతన సవరణ సలహా బోర్డు 2021 ఫిబ్రవరి 3న రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే అందులో 5 ఉపాధి రంగాలకు తుది ఉత్తర్వులు వెలువడ్డా గెజిట్‌లో ప్రచురించకపోవడం, మిగిలిన ఉపాధి రంగాలకు జీఓలు ఇవ్వకపోవడంతో కార్మీకులు నష్టపోతున్నారు.
– దేవసాని భిక్షపతి, కనీస వేతన సలహా బోర్డు మాజీ సభ్యుడు, ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి
అసంఘటిత రంగ కార్మీకుల కనీస వేతన సవరణకు పడని ముందడుగు
అన్‌స్కిల్డ్ కార్మీకుడైన నర్సింహ 20 ఏళ్లుగా ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో 2007లో ఈ రంగానికి సంబంధించి జరిగిన వేతన సవరణ ప్రకారం ఆయన నెలవారీ కనీస వేతనంరూ. 3,370గా ఖరారైంది. ఆ నిబంధనల ప్రకారం ప్రస్తుతం నర్సింహ అందుకుంటున్న వేతనం రూ. 12,420 మాత్రమే.
వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో రెండో కనీస వేతన సవరణ సలహా బోర్డు సిఫార్సుకు అనుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన జీఓ 22 ప్రకారం నర్సింహ నెలవారీ కనీస వేతనం రూ. 23,275గా ఉండాలి. కానీ ఆ జీఓను గెజిట్‌లో ప్రచురించకపోవడం వల్ల ఆయన ఏకంగా రూ. 10,855 తక్కువ వేతనం పొందుతున్నాడు.