
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 3) జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేపై ఆర్సీబీ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో ఆర్సీబీ చివరి ఓవర్‌లో 15 పరుగులను విజయవంతంగా కాపాడుకుంది.
యశ్ దయాల్ చివరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్‌కే ఈ ఓటమితో చివరి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపుగా ఖరారైపోయినట్లే.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. జేకబ్ బేతెల్ (33 బంతుల్లో 55; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రొమారియో షెపర్ట్ (14 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.
సీఎస్‌కే బౌలర్లలో పతిరణ (4-0-36-3), నూర్ అహ్మద్ (4-0-26-1) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. ఖలీల్ అహ్మద్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు (3-0-65-0). ఖలీల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 33 పరుగులు పిండుకున్నాడు. పతిరణ వేసిన చివరి ఓవర్‌లోనూ అదే జోరు కొనసాగించిన షెపర్డ్ ఆ ఓవర్‌లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రాబట్టాడు.
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ
షెపర్డ్ విధ్వంసకాండ ధాటికి ఐపీఎల్‌లో ఆర్సీబీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇన్నింగ్స్ 19, 20 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో షెపర్డ్ చెలరేగిపోవడంతో ఆర్సీబీ చివరి రెండు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఏకంగా 54 పరుగులు సాధించింది. గత సీజన్‌లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ చివరి రెండు ఓవర్లలో 53 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఢిల్లీ రికార్డును బద్దలు కొట్టింది.
చివరి 13 బంతుల్లో (నో బాల్‌తో కలుపుకుని) షెపర్డ్ ఒక్కడే 12 బంతులు ఎదుర్కొని.. 6 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేశాడు.
చివరి రెండు ఓవర్లలో షెపర్డ్ (బంతుల వారీగా)
19వ ఓవర్: 6, 6, 4, 6, 6 (నో బాల్), 0, 4 (ఖలీల్ అహ్మద్ వేసిన ఓవర్)
20వ ఓవర్: 1, 4, 0, 4, 6, 6 (పతిరణ వేసిన ఓవర్)
చివరి బంతి వరకు పోరాడిన సీఎస్‌కే
అనంతరం 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్‌కే.. చివరి బంతి వరుకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేయగలిగింది. ఆయుశ్ మాత్రే (48 బంతుల్లో 94; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), రవీంద్ర జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సీఎస్‌కేను గెలిపించేందుకు సర్వ శక్తులు ఒడ్డారు. ఈ మ్యాచ్‌లో మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్ వరుస బంతుల్లో ఔట్ కావడం సీఎస్‌కే కొంప ముంచింది. ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో ఎంగిడి ఈ ఇద్దరి వికెట్లు తీసి ఆర్సీబీని గేమ్‌లోకి తెచ్చాడు.

బ్రెవిస్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అంపైర్ నిర్ణయం డౌట్ ఫుల్‌గా ఉన్నా బ్రెవిస్ నిర్ణీత సమయంలో రివ్యూ తీసుకోకుండా లేట్ చేశాడు. తీరా రివ్యూలో చూస్తే అతడు నాటౌట్ అని తేలింది. ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న బ్రెవిస్ చివరి వరకు క్రీజ్‌లో ఉండి ఉంటే సీఎస్‌కే తప్పక గెలిచేది.
చివరి మూడు ఓవర్లలో (సుయాశ్, భువీ, దయాల్) ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో సీఎస్‌కే లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. సీజన్‌లో తొలిసారి భువీ వికెట్ లేకుండా అత్యంత ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు (4-0-55-0).