ఎంఈఓ మహతీ లక్ష్మీ ఆధ్వర్యంలో బెజ్జంకిలో నిర్వహణ
స్పోకెన్ ఇంగ్లిష్, యోగా, డ్రాయింగ్, కరాటే వంటి వాటిపై శిక్షణ
ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు
విద్యార్థులకు పరీక్షలు ముగిశాయి. నిన్నటి వరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ప్రస్తుతం సమ్మర్ క్యాంపులపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ముందుకొస్తున్నారు.
బెజ్జంకిలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపునకు విద్యార్థుల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది. ఏప్రిల్ 24 నుంచి 3 తేదీ వరకు ఎంఈఓ మహతీ లక్ష్మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో స్పోకెన్ ఇంగ్లిష్, యోగా, డ్రాయింగ్, కరాటే, కాలీగ్రాఫీ, ఎథిక్స్, అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులు వేసవిలో బయట తిరగకుండా ఉండటమే కాకుండా విజ్ఞానాన్ని, సృజనాత్మకతని పెంపొందిస్తారని తల్లిండ్రులు సైతం ఆసక్తిని కనబరుస్తూ పిల్లలను పంపుతున్నారు.
180 మంది హాజరు
బెజ్జంకితోపాటు కల్లెపెల్లి, ముత్తన్నపేట, వీరాపూర్, పోతారం, రేగులపల్లె, దాచారం గ్రామాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సుమారు 180 మంది హాజరవుతున్నారు. మరింత మంది ఎన్‌రోల్ చేసుకుంటారని కో ఆర్డినేటర్ వడ్లకొండ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాద్యాయులు శిక్షణ ఇస్తున్నారు.

సమ్మర్ క్యాంపునకు అపూర్వ స్పందన