
భూ భారతిపై గ్రామ సభలు
కొండాపూర్(సంగారెడ్డి): రైతులకు సంబంధించి ఎలాంటి భూ సమస్యలైనా తక్షణమే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ భూ భారతి చట్టంపై ఇది వరకే ప్రతీ మండలానికి ఒక దగ్గర జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. మండల వ్యాప్తంగా 24 రెవెన్యూ గ్రామాలకు గానూ 36,611 ఎకరాల భూమి ఉంది. 15 వేల మంది పట్టాదారులు న్నారు. మండలంలో ధరణి సమస్యలు నేటికీ 330 వరకు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ గ్రామ సభల ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
పైలట్ ప్రాజెక్టుగా కొండాపూర్
భూ భారతి చట్టాన్ని అమలు చేయడం కోసం ముందుగా సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇందులో భాగంగా నేటి నుంచి 19వ తేదీ వరకు గ్రామాల్లో గ్రామ సభలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ గ్రామంలో తహసీల్దార్ అధ్యక్షతన రోజుకు రెండు గ్రామాల చొప్పున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రామసభలను నిర్వహించనున్నారు. ఈ గ్రామ సభల ద్వారా ఫిర్యాదులను స్వీకరించేందుకు హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత అక్కడికక్కడే సమస్యలను పరిష్కారం చేయనున్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే రైతులు పట్టాదారు పాత పాసుబుక్‌తో పాటు, కొత్త పాసుబుక్, రిజిస్టర్ డాక్యుమెంట్, కోర్టు ఉత్తర్వులు, ఆధార్ కార్డుతో పాటు భూమికి సంబంధించిన ఇతర పత్రాలు ఏవైనా ఉంటే జిరాక్స్ పత్రాలతో రావాలి. ఈ గ్రామ సభలకు జిల్లా, మండల రెవెన్యూ అధికారులు గ్రామాలకు సంబంధించిన సమగ్ర రెవెన్యూ రికార్డులతో హాజరుకానున్నారు.
ఆర్డీఓ పర్యటన :
భూ భారతి చట్టం అమలులో భాగంగా ఆదివారం గ్రామ సభలు ఏర్పాటు చేయనున్న అలియాబాద్, తొగర్‌పల్లిలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మండల రెవెన్యూ అధికారులకు గ్రామసభ ఏర్పాటుపై అవగాహన కల్పించారు.
ఏ గ్రామంలో ఎప్పుడు..
గ్రామ సభలు 5వ తేదీన అలియాబాద్, తొగర్‌పల్లి, 6న గారకుర్తి, గిర్మాపూర్, 7న చెర్ల గోపులారం, హరిదాస్‌పూర్, 8న తేర్పోల్, మాచెపల్లి, 9న గడి మల్కాపూర్, గొల్లపల్లి, 12న మునిదేవునిపల్లి, గుంతపల్లిలో నిర్వహించనున్నారు. అలాగే 13న కోనాపూర్, గంగారం, 14న మన్‌సాన్‌పల్లి, మాందాపూర్, 15న సైదాపూర్, మారేపల్లి, 16న కొండాపూర్, అనంతసాగర్, 17న కుతుబ్‌షాహీపేట, మల్లెపల్లి, 19న మల్కాపూర్‌లలో రెవెన్యూ గ్రామ సభలను ఏర్పాటు చేయనున్నారు.
నేటి నుంచి 19 వరకు నిర్వహణ
తహసీల్దార్ అధ్యక్షతన రోజుకు రెండు గ్రామాల్లో..
పైలెట్ ప్రాజెక్టుగా కొండాపూర్