
పిడుగుపాటుకు ఎడ్లు మృతి
చిన్నకోడూరు(సిద్దిపేట): పిడుగు పాటుకు రెండు ఎడ్లు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కిష్టాపూర్‌లో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన చక్రాల బాల్‌రాజు రోజు మాదిరిగా ఎడ్లను వ్యవసాయ పొలం వద్ద కట్టేశాడు. సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన వర్షంతోపాటు ఎడ్ల సమీపంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాయి. సుమారు రూ. 80 వేల విలువైన జీవాలు మృతి చెందడంతో రైతు బాల్‌రాజు బోరున విలపించాడు. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
కార్మికుడికి గాయాలు
హత్నూర(సంగారెడ్డి): పరిశ్రమలో విధులు ని ర్వహిస్తుండగా కెమికల్స్ చేతి పైబడి కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హత్నూర మండలం గుండ్ల మాచూనూర్ గ్రామంలో చోటు చేసుకుంది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సమీర్ కొంతకాలంగా గుండ్ల మాచూనూర్ గ్రామ శివారులోని కోవాలంట్ లాబోరేటరీ పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగా శనివారం పరిశ్రమ లో విధులకు వెళ్లాడు. ఈ క్రమంలో చేతి పై కెమికల్స్ పడగా గాయాలు అయ్యాయి. కాంట్రాక్టర్ గానీ పరిశ్రమ యాజమాన్యం ఎలాంటి చికిత్స చేయించలేదని, అవసరమైన వైద్య చికిత్సలు చేయించాలని బాధితుడు కోరుతున్నాడు.
యువతి అదృశ్యం
సంగారెడ్డి క్రైమ్: యువతి అదృశ్యమైన ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రమేశ్ కథనం మేరకు.. నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలం ఎల్లమ్మ కుచ్చ గ్రామానికి చెందిన ఉబిది శివాజీ, సాయవ్వ దంపతులు రెండేళ్ల కిందట బతుకుదెరువు కోసం పట్టణంలోని ఇందిరా కాలనీకి వచ్చి ఉంటున్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె ఉబిది ఇందు (15) పుట్టుకతో మతి స్థిమితం కోల్పోయింది. 3న సాయంత్రం ఇంటి నుంచి ఆడుకోవడానికి వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
రెండు కార్లపై
కట్టెల లోడ్ లారీ బోల్తా
● పలువురికి స్వల్ప గాయాలు
● క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన ఎమ్మెల్యే హరీశ్ రావు
కొండాపూర్(సంగారెడ్డి): మండల పరిధిలోని మల్కాపూర్ 65వ జాతీయ రహదారిపై ఆదివారం కట్టెల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కార్లు ధ్వంసం కాగా పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఇదే సమయంలో అటువైపు నుంచి ఎమ్మెల్యే హరీశ్‌రావు జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్నారు. ఘటనను చూసి తన వాహనాన్ని ఆపారు. పాక్షికంగా ధ్వంసమైన కారులో నుంచి స్థానికులు, సిబ్బంది సాయంతో గాయపడిన వారిని సురక్షితంగా బయటకు తీసి తన వాహనంలోనే చికిత్స నిమిత్తం సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి ప్రమాద పరిస్థితులను వివరించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.

పిడుగుపాటుకు ఎడ్లు మృతి

పిడుగుపాటుకు ఎడ్లు మృతి