తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ | Mahesh Kumar Goud Comments On Kishan Reddy and Bandi Sanjay Kumar | Sakshi
Sakshi News home page

తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌

Published Fri, May 2 2025 5:47 AM | Last Updated on Fri, May 2 2025 5:47 AM

Mahesh Kumar Goud Comments On Kishan Reddy and Bandi Sanjay Kumar

బీఆర్‌ఎస్‌తో దోస్తీ కట్టి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు 

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ అడ్డంకిగా మారారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆరోపించారు. రాష్ట్రంలో నిర్వహించిన కులగణనను తప్పుల తడక అనడం ఈ ఇద్దరు నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనమని గురువారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. బీఆర్‌ఎస్‌తో దోస్తీ కట్టి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిత్యం విషం కక్కడం వీరికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.

కులగణనపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రాహుల్‌ గాంధీ సంకల్పం సిద్ధించిందని, రాహుల్‌ ఆలోచన మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల బృందం కులగణనను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిందని పేర్కొన్నారు. శాసనసభలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల సాక్షిగా ఏకగ్రీవ తీర్మానంతో బీసీల కులగణనకు చట్టబద్ధత కల్పించామని పేర్కొన్నారు. బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేసేలా పార్లమెంట్‌లో చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

బీసీ బిల్లు చట్టబద్ధత కోసం ప్రధాని మోదీకి లేఖ రాసే దమ్ము కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌లకు ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్ర మంత్రులమన్న విషయం మరిచి మాట్లాడటం వారి అహంకారానికి పరాకాష్ట అని మహేశ్‌గౌడ్‌ దుయ్యబట్టారు. పారదర్శక సర్వేపై తప్పుడు ఆరోపణలు చేయడానికి బీసీ బిడ్డగా బండి సంజయ్‌ ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. కేంద్రం జనగణనతో పాటు కులగణన చేయాలని తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్‌ విజయం అని, కేంద్రం దేశవ్యాప్తంగా కులగణన ఎప్పుడు నిర్వహిస్తుందో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. చరిత్రాత్మక కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల నిర్ణయాలతో దేశానికీ ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement