సీపోర్ట్‌తో కేరళలో ఆర్థిక స్థిరత్వం | Vizhinjam port inauguration by PM Modi | Sakshi
Sakshi News home page

సీపోర్ట్‌తో కేరళలో ఆర్థిక స్థిరత్వం

Published Sat, May 3 2025 2:45 AM | Last Updated on Sat, May 3 2025 2:45 AM

Vizhinjam port inauguration by PM Modi

విఝింజమ్‌ సీపోర్ట్‌ ప్రారంభోత్సవంలో ప్రసంగించిన మోదీ

తిరువనంతపురం: కంటైనర్ల ద్వారా సరుకు రావాణా కోసం ప్రత్యేకంగా నిర్మించిన అతిపెద్ద విఝింజమ్‌ అంతర్జాతీయ సీపోర్ట్‌తో కేరళ రాష్ట్రంలో ఆర్థిక స్థిరత్వం సుసాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. భవిష్యత్తులో ఈ సీపోర్ట్‌ సామర్థ్యం మూడు రెట్లు పెరుగుతుందని, దాంతో కంటైనర్‌ కార్గో రవాణా విభాగంలో భారత సామర్థ్యం మరింత ఇనుమడిస్తుందని ప్రధాని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని శుక్రవారం కేరళలోని తిరువనంతపురం జిల్లా కేంద్రంలోని విఝింజమ్‌ వద్ద రూ.8,686 కోట్ల వ్యయంతో నిర్మించిన డీప్‌వాటర్‌ సీపోర్ట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు.

అప్పుడలా.. ఇప్పుడిలా
‘‘గతంలో భారత కంటైనర్ల రవాణా వ్యవహారంలో 75 శాతం విదేశీ పోర్టుల్లో జరిగేది. దాని వల్ల దేశం భారీ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అప్పటి పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారుతున్నాయి. ఇప్పుడు దేశ సంపద భారత్‌కే ఉపయోగపడుతోంది. గతంలో భారత్‌ను దాటిపోయిన నిధులు ఇప్పడు స్వదేశంలోనే నూతన ఆర్థిక అవకాశాలను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా కేరళలోని విఝింజమ్‌ ప్రజలకు అవకాశాలు పెరిగాయి.

అంతర్జాతీయ వాణిజ్యంలో తొలినాళ్ల నుంచీ కేరళ నౌకలు భారత్‌కు సరుకు రవాణాలో కీలక భూమిక పోషించాయి. సముద్ర మార్గంలో అంతర్జాతీయ వాణిజ్యంలో భారత హబ్‌గా కేరళ ఎదుగుతోంది. ఇప్పుడు కేరళను మెరుగైన ఆర్థికశక్తిగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది’’ అని మోదీ అన్నారు. 

అదానీని పొగిడిన మోదీ
అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌(ఏపీసెజ్‌) ఈ డీప్‌వాటర్‌ పోర్ట్‌ను నిర్మించింది. ఈ నేపథ్యంలో ఈ సంస్థ అధినేత గౌతమ్‌ అదానీని మోదీ పొగిడారు. ‘‘ అదానీ గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సొంత రాష్ట్రంలోనూ ఓడరేవులున్నాయి. అయినాసరే గుజరాత్‌ను కాదని కేరళలో ఇంత పెద్ద సీపోర్ట్‌ను కట్టాడని తెలిస్తే గుజరాత్‌ ప్రజలు సైతం అసూయపడతారు’’ అని సరదాగా అదానీని మోదీ పొగిడారు.

‘‘2014లో సరుకు రవాణా నౌకలు, ప్రజారవాణా, ఇతర పడవల ద్వారా 1.25 లక్షల మంది కార్మికులు ఉపాధి పొందితే ఇప్పుడు వాళ్ల సంఖ్య 3.25 లక్షలకు పెరిగింది. ఈ కార్మికుల సంఖ్యపరంగా భారత్‌ ప్రపంచ టాప్‌–3 స్థానం పొందింది. సరుకు రవాణా విషయంలో టాప్‌–30లో రెండు భారతీయ నౌకాశ్రయాలు స్థానం దక్కించుకున్నాయి’’ అని మోదీ అన్నారు.

స్వప్నం సాకారమైంది
‘‘కేరళ స్వప్నం సాకారమైంది. అంతర్జాతీయ జలరవాణా, వాణిజ్యం, సరుకు రవాణా చిత్రపటంలో ఈ సీపోర్ట్‌ భారత్‌కు కొత్త దారులు తెరిచింది’’ అని మోదీ అన్నారు. కార్యక్రమంలో కేరళ గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్, సీఎం విజయన్, గౌతమ్‌ అదానీ, శశిథరూర్‌ పాల్గొన్నారు. ‘‘ మూడో మిలీనియంలో వృద్ధి అవకాశాలకు విఝింజమ్‌ సీపోర్ట్‌ సింహద్వారంగా నిలవనుంది’’ అని సీఎం విజయన్‌ అన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, అదానీ సంస్థ సంయుక్తంగా ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యంలో ఓడరేవును నిర్మించారు.

ఈ ఇద్దరిని నా పక్కన చూశాక
కొందరికి అస్సలు నిద్రపట్టదు
విపక్షాల ‘ఇండియా’ కూటమిలో కీలక భాగస్వామి అయిన సీపీఎం సీనియర్‌ నేత, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ మోదీతోపాటు వేదికను పంచుకున్నారు. దీంతో కాంగ్రెస్‌నుద్దేశిస్తూ మోదీ సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘సీఎం విజయన్‌కు నేనో విషయం చెప్పదల్చుకున్నా. విపక్షాల ఇండియా కూటమిలో మీరూ ఒక మూలస్తంభం. ఇక కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ సైతం వేదికపైనే ఉన్నారు. మీ ఇద్దరినీ నా పక్కన చూశాక కొందరికి అస్సలు నిద్ర పట్టదు. మలయాళంలోకి నా ప్రసంగాన్ని తర్జుమా చేస్తున్న వ్యక్తి సరిగా చెప్తున్నారో లేదో నాకు తెలీదుగానీ నా ఈ సందేశం చేరాల్సిన వారికి ఇప్పటికే చేరిపోయింది’’ అని వ్యాఖ్యానించారు.

దీనిపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. ‘‘పహల్గాం తర్వాత కూడా విపక్ష  నేతల నిద్రలు పాడుచేయడం మీదే మోదీ దృష్టిపెట్టారు. మేం మాత్రం నిద్రలేని రాత్రులు గడిపైనాసరే మిమ్మల్ని మీ ప్రభుత్వ తప్పులకు బా«ధ్యులను చేస్తాం’’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ అన్నారు. సొంత కాంగ్రెస్‌ పార్టీ నేతలతో శశిథరూర్‌ ఇటీవల అంటీముట్టనట్లు వ్యవహరించడం తెల్సిందే. ‘‘శుక్రవారం నా సొంత నియోజకవర్గం తిరువనంతపురంలో ప్రధానికి స్వాగతం పలికా. సీపోర్ట్‌ ప్రారంభంకావడం మాకెంతో గర్వకారణం’’ అని శశిథరూర్‌ అంతకుముందు ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement