
శ్రీనగర్: అందాల కశ్మీరంలో పర్యాటకులపై తూటాల వర్షం కురిసింది. వారిపై ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలోని బైసారన్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ దారుణానికి 26 మంది పర్యాటకులు బలయ్యారు. 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులున్నారు. వారిలో ఒకరు నేపాలీ కాగా మరొకరిది యూఏఈ. మరో ఇద్దరు స్థానికులు కాగా మిగతావారు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, బిహార్ తదితర రాష్ట్రాలకు చెందినవారు. వారిలో కేరళ రాష్ట్రానికి చెందిన ఓ బృందం ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పించుకుంది.
కేరళ నుంచి చిన్నారి సహా దాదాపు 23 మంది కశ్మీర్ పర్యటనకు వచ్చారు. వాళ్లంతా బైసరన్ ప్రాంతంలో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వెళ్లారు. అయితే, టూరిస్ట్ స్పాట్‌కు వెళ్లాలంటే గుర్రంపైన వెళ్లాల్సి ఉంటుంది. దీంతో వారు గుర్రపు స్వారీ ఖరీదు అధికంగా ఉండటంతో వేరే ప్రదేశానికి ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్లిపోయారు. దీంతో ఈ దాడి నుంచి తృటిలో ప్రాణాలతో పడ్డారు.
వేరే ప్రదేశానికి వెళ్తున్న టైంలో తమకు కొన్ని భారీ శబ్దాలు వినిపించాయని.. దుకాణాలు మూసివేస్తున్నారని.. ప్రజలు కూడా పారిపోతున్నారని ఆ పర్యాటకులు వివరించారు. అక్కడ ఏం జరుగుతోందో తమకు అర్థంకాలేదన్నారు. మేము అందమైన ప్రదేశానికి తీసుకెళ్లమని తమ గైడ్‌ను అడిగామని.. బతికి ఉండాలనుకుంటున్నారా..? లేదా..? అని. ట్యాక్సీ అతను సరాసరి తామున్న హోటల్ వద్దకు తీసుకెళ్లాడన్నారు. టీవీలో వార్తలు చూసిన తర్వాత అక్కడ ఉగ్రదాడి జరిందని.. గుర్రపు స్వారీకి వెళ్లి ఉంటే తమ పరిస్థితి ఎలా ఉండేందోనంటూ భయంకరమైన అనుభవాన్ని వివరించారు.