
శ్రీనగర్: పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదని చెప్పుకొచ్చారు. అలాగే, ఈ ఘటనకు భద్రత, నిఘా లోపాలు కూడా ఒక కారణమని అన్నారు.
పహల్గాం ఘటనపై తాజాగా ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ..‘పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోంది. రేపటి రోజు ఎలా ఉండబోతోందో ఎవరికీ తెలియదు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదు. ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పహల్గాం ఉగ్ర దాడి జరగడానికి కారణమైన ఉగ్రవాదులను పట్టుకోవాలి. అలాగే, ఈ ఘటన వెనక ఉన్న వారిని వీలైనంత తొందరగా పట్టుకోవాలి. అప్పుడే యుద్ధాన్ని నివారించే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. భద్రత, నిఘా లోపాలు కూడా ఉగ్ర దాడి జరిగేందుకు ఒక కారణమని అనడంలో సందేహం లేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా.. అంతకుముందు.. పహల్గాం ఘటనపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. ఉగ్రవాదుల బారి నుంచి అతిథుల(పర్యాటకులు)ను కాపాడటంలో తాను విఫలమయ్యానని రాష్ట్ర శాసనసభ వేదికగా ప్రకటించారు. బైసరన్‌లో ఇంత పెద్ద స్థాయిలో దాడి చేయడం మాత్రం 21 ఏళ్లలో ఇదే తొలిసారి. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో తెలియడం లేదు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాదే. నేను ఆ పనిచేయలేకపోయాను. పహల్గాం ఘటన తర్వాత ఏ ముఖం పెట్టుకొని రాష్ట్ర హోదాను డిమాండ్ చేయాలి. నా రాజకీయాలు అంత చౌకబారువి కాదు. గతంలో రాష్ట్ర హోదా అడిగాం.. భవిష్యత్తులో కూడా అడుగుతాం. కానీ, 26 మంది చనిపోయారు.. ఇప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వండి అని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటు. ప్రజలు మాకు మద్దతు ఇస్తే.. ఉగ్రవాదం అంతమవుతుంది’ అని పేర్కొన్నారు.