
● డబ్బుల కోసం ఎంతకై నా తెగిస్తున్న వైనం ● జిల్లాలో దారి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పోలీసు శాఖలో కొందరు అధికారుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. నస్పూర్ పోలీసుస్టేషన్ ఎస్‌హెచ్‌వో సుగుణాకర్ క్షుద్రపూజల కేసులో జప్తు చేసిన రూ.2లక్షలు బాధితుడికి ఇచ్చేందుకు ఇబ్బందులకు గురి చేసిన వైనం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. డబ్బులు ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా ఫొటో దిగి బాధితుడినే బెదిరిస్తూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ ఎస్సై ప్రవర్తించిన తీరు ఆ శాఖకే మచ్చ తెస్తోంది. చివరికి బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. జిల్లాలో నిక్కచ్చిగా, నిజాయతీగా పని చేస్తున్న అధికారులూ ఉన్నారు. ఆ నిజాయతీ అధికారులకు కీలక స్థానాల్లో పోస్టింగ్ దొరకడం లేదు. ఆదాయం వచ్చే స్టేషన్లుగా చెప్పుకునే చోట్ల కొందరు తిష్ట వేస్తూ రాజకీయ అండదండలతో చెలరేగుతున్నారు.
ఆగని వసూళ్ల పర్వం
ప్రతీ కేసులో ఎంతో కొంత స్టేషన్ ఖర్చుల పేరుతో వసూళ్లు చాలా చోట్ల పరిపాటిగా మారింది. ఇదంతా నిత్యం బహిరంగంగానే సాగుతున్నా ఎవరూ చెప్పక వెలుగులోకి రావడం లేదు. సివిల్ పంచాయితీలు, కుటుంబ తగాదాలు, రోడ్డు ప్రమాదాలు, గంజాయి, చీటింగ్, ఇతర క్రిమినల్ కేసుల్లో నిందితుల శిక్ష తగ్గింపు, సీజ్ చేసిన వాహనం, నగదు, ఆస్తుల విడుదలలోనూ చేతివాటం చూపిస్తున్నారు. ఇక దొంగతనాల కేసుల్లో కోల్పోయిన, రికవరీ సొమ్ములోనూ తేడా చూపిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. గతంలో జిల్లా కేంద్రంలో పని చేసిన ఓ ఎస్‌హెచ్‌వో అవయవదానం కేసులో రూ.లక్షలు వసూలు చేసిన ఘటన నేటికీ అధికారుల్లో చర్చకు వస్తుంది. స్టేషన్ బెయిల్ కోసం గతంలో బెల్లంపల్లి టూటౌన్ పరిధిలో ఓ పోలీసు అధికారి ఏసీబీకి చిక్కారు. గతంలో జిల్లా కేంద్రంలో పని చేసిన ఓ ఎస్సై బార్ల వద్ద నెలనెలా మామూళ్లు వసూలు చేస్తూ, తిరిగి బార్ యజమాని వద్దకు వెళ్లి బెదిరించడం అప్పట్లో వివాదాస్పదమైంది.
అండ ఉంటే చాలన్నట్లుగా..
చాలామంది పోలీసు అధికారులు స్థానిక రాజకీయ అండ ఉంటే చాలన్నట్లుగా వ్యవహరిస్తూ వివాదా స్పదం అవుతున్నారు. పోస్టింగ్ నుంచి రోజువారీ డ్యూటీ దాకా క్రమశిక్షణ గీత దాటినా, ఏం చేసినా తమను చూసుకుంటారనే ధీమాలో ఉంటున్నారు. కొన్ని చోట్ల వ్యాపారులు, బడా వ్యక్తులు, ఆర్థికంగా ‘అవసరమైన’ వారితో దోస్తీ చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ప్రతీ కేసులో రాజకీయ కోణం ఎంత? ఫిర్యాదు, నిందితుల బ్యాక్‌గ్రౌండ్ పరిశీలిస్తూ ఒక్కో కేసులో ఒక్కో తీరుగా వ్యవహరిస్తున్నారు. అంతా మట్లాడాకే ఎఫ్‌ఐఆర్ చేస్తున్నారు. కొన్ని కేసులను నీరుగారుస్తూ పక్కదారి పట్టిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఇందుకు నమ్మకస్తులైన సీని యర్, స్థానిక కింది స్థాయి సిబ్బందిని ఉన్నతాధికారులకు మధ్య వారధిగా వాడుకుంటున్నారు. గతంలో ఇక్కడ పని చేసిన ఇద్దరు పోలీసు అధికారులపై రాష్ట్రస్థాయిలో ఫిర్యాదులు వెళ్లాయి. ఎంతో కష్టపడి కొలువు సాధించి, సమాజంలో సేవ చేసే అవకాశం దొరికితే అత్యాశకు పోయి చివరకు ఉద్యోగానికే ఎసరు తెచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. ఉన్నతాధికారులు తమ కింది అధికారులు పక్కదారి పట్టకుండా నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంది.