
ఆంధ్రప్రదేశ్ భూ దురాక్రమణ (నిషేధం) చట్టం–2024 ఉభయ సభల్లో ఆమోదం పొందింది. గత నవంబర్ 14వ తేదీన రెవెన్యూ శాఖ మంత్రి శాసన సభలో బిల్లు ప్రవేశపెట్టారు. శాసనసభలో ఎలాంటి చర్చలు లేకుండా ఏకపక్షంగా ఈ బిల్లును ఆమోదింప చేసుకుంది ప్రభుత్వం. శాసన మండలిలో పీడీఎఫ్ సభ్యులు చేసిన సూచనలను పట్టించు కోలేదు. పేదలకు అన్యాయం తలపెడతాయని సందే హిస్తున్న క్లాజులను తొలగించాలన్న డిమాండ్లను ప్రభుత్వం తిరస్కరించింది. సెలెక్టు కమిటీకి కూడా సిఫారసు చేయలేదు. కేంద్ర చట్టాలతో ముడిపడి ఉన్నందున రాష్ట్ర ఉభయ సభల్లో బిల్లు ఆమోద మయ్యాక, గవర్నర్ నుంచి ఈ బిల్లు రాష్ట్రపతి పరి శీలన, ఆమోదం కోసం వెళుతుంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం (NDA Government) అధికారంలో ఉంది కనుకా, అది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ఆధార పడి ఉంది కనుకా; ఇటువంటి చట్టం గుజరాత్, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెచ్చినందునా ఈ బిల్లుకు సులువుగానే రాష్ట్రపతి ఆమోదం లభించవచ్చు.
రాష్ట్రంలో వేగవంతంగా జరుగుతున్న పట్టణీకరణ, వ్యాపారీకరణలు.. ప్రభుత్వ, ప్రైవేటు భూముల దురాక్రమణలకు ఉత్ప్రేరకాలుగా ఉన్నాయనీ, రాష్ట్రంలో ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న భూకబ్జాలు, సంబంధిత పరిణామాల వలన అన్ని వర్గాలూ ఇబ్బందులు పడుతున్నాయనీ; వాటిని అరికట్టడానికి చట్టం తెస్తున్నామని కూటమి ప్రభుత్వం బిల్లులో పేర్కొంది. ‘ఏపీ భూ దురాక్రమణ (నిషేధం) చట్టం–1982’ కంటే గట్టి చట్టం తెస్తున్నందున, ఇప్పటివరకు ఉనికిలో ఉన్న ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నామన్నారు. నిజానికి పాత చట్టానికి, కొత్త చట్టానికి మధ్య పెద్దగా వ్యత్యాసం లేదు. 1982 యాక్ట్ అప్పటి ఉమ్మడి ఏపీలోని అర్బన్ ప్రాంతాలకు పరిమితంకాగా, ‘2024 బిల్లు’లో రూరల్, అర్బన్ సహా రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుంది. ప్రభుత్వ, ఎండోమెంట్, వక్ఫ్, చారిటబుల్, ప్రైవేటు భూముల ఆక్రమణలను నేరాలుగా పరిగణించి శిక్షిస్తామన్నారు.
పాత చట్టంలో భూముల కబ్జాకు పాల్పడిన వారిపై అభియోగం రుజువైతే ఆరు నెలలకు తక్కువ కాకుండా జైలు శిక్ష అన్నారు. కొత్తగా తీసుకొచ్చిన బిల్లులో పదేళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష అన్నారు. పధ్నాలుగేళ్ల వరకు జైలు శిక్షను పెంచవచ్చు అన్నారు. ప్రత్యేక కోర్టులు అప్పుడూ ఇప్పుడూ ఉన్నాయి. కోర్టులను ఏర్పాటు చేసే, జడ్జిలను నియమించే అధికారం, రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి దఖలు పర్చారు. దీనిపై 1982 ఆగస్టులో బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చలో, ఎప్పుడుపడితే అప్పుడు కోర్టులను, జడ్జిలను ఏర్పాటు చేసే, రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి దఖలు పరిస్తే, ఒక వేళ ప్రభుత్వంలో ఉన్న వారిపైనే భూకబ్జా అభియోగాలు వస్తే, శిక్షల దాకా వెళితే సదరు కోర్టులను, జడ్జిల నియామకాలను ఆపివేస్తారా అని ప్రశ్నించి.. ఆ గ్యారంటీ బిల్లులో లేదని వామపక్ష పార్టీలు నిలదీశాయి. రద్దు చేసిన చట్టంలో ఏముందో కొత్తగా తెచ్చిన చట్టంలోనూ అదే ఉంది. దీనిని బట్టి ప్రభుత్వం అసలు నైజం బట్టబయల వుతుంది. నాలుగున్నర దశాబ్దాలుగా పాలకులు అమలు చేస్తున్న నూతన ఆర్థిక విధానాల కారణంగా ఆశ్రిత పెట్టుబడిదారులు భూకబ్జాలకు పాల్పడి శిక్షలు పడే దాకా వస్తే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి స్పెషల్ కోర్టులను రద్దు చేయిస్తారు కదా!
బిల్లులో పేర్కొన్న శిక్షల విషయానికొస్తే జైలు శిక్ష, జరిమానా అన్నారు. కబ్జాకు పాల్పడిన ఆస్తి మార్కెట్ విలువను గ్రాబర్ (ఆక్రమణదారు) నుంచి వసూలు చేస్తామంటున్నారు. ఇక్కడ మార్కెట్ విలువంటే (Market Value) రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఉండే బుక్ వాల్యూనా, లేదంటే బహిరంగ మార్కెట్లో క్రయ విక్రయాల రేటా అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ బుక్ వాల్యూనే అయితే కబ్జాదారుకే లాభం. ఆ విధంగా గ్రాబింగ్ చట్టబద్ధమైపోతుంది. అందుకే కబ్జా చేసిన ఆస్తిని ప్రభుత్వం జప్తు చేస్తే కబ్జాదారులకు సరైన శిక్ష అవుతుంది. జైలు శిక్ష, జరిమానాతో పాటు ఆస్తి జప్తు కూడా చట్టంలో ఉండాలి. బిల్లులో ఈ ప్రధాన అంశం లేదు.
ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూములను ఆక్రమించుకున్నవారు ల్యాండ్ గ్రాబర్ల (Land Grabbers) కిందకు వస్తారని బిల్లు చెబుతోంది. ఇళ్లు లేని పేదలు ప్రభుత్వ భూముల్లో వంద యాభై గజాల్లో నివాసాలు ఏర్పరుచుకుంటే చట్ట ప్రకారం ల్యాండ్ గ్రాబర్ అయిపోతారు. ఇళ్లు వేసుకోమని పేదలను ప్రోత్సహించిన రైతు కూలీ సంఘాల నాయకులు కూడా నేరస్థులవుతారు. ప్రభుత్వ ఎండోమెంట్, వక్ఫు భూములను ఎకరమో, రెండెకరాలో సాగు చేసుకుంటున్న పేదలు భూ దురాక్రమణదారులై శిక్షలకు గురవుతారు. కొంత మంది పెద్దలు ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్లాట్లు వేసి దర్జాగా అమ్ముకుంటున్నారు. చౌకగా వస్తుందన్న ఆశతో సామాన్యులు కొంటున్నారు. ఎవరు ప్రస్తుతం పొజిషన్లో ఉన్నారో వారు గ్రాబర్ అయిపోతారు తప్ప ఆక్రమంగా భూములను ఆక్రమించి అమ్మిన అసలు వ్యక్తి తప్పించుకుంటారు.
చదవండి: ఐక్యంగా నిబడటం మనకు తెలుసు!
ఇలాంటి ప్రమాదకర చట్టంపై రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులతో విస్తృతంగా చర్చించకుండా ఏకపక్షంగా అసెంబ్లీలో ఆమోదింపచేసు కోవడం అప్రజాస్వామిక చర్య అవుతుంది. పేదల హక్కులపై భస్మాసుర హస్తంగా మారే భూదురాక్రమణ చట్టానికి వ్యతిరేకంగా పేదలను సంఘటిత పరిచే ఉద్యమాన్ని రైతు కూలీ సంఘాలు తీవ్రతరం చేయాలి.
– ముప్పాళ్ళ భార్గవశ్రీ
సీపీఐ ఎంఎల్ నాయకులు