Land grabbing Act
-
AP: ఈ చట్టం పేదల పాలిట శాపం
ఆంధ్రప్రదేశ్ భూ దురాక్రమణ (నిషేధం) చట్టం–2024 ఉభయ సభల్లో ఆమోదం పొందింది. గత నవంబర్ 14వ తేదీన రెవెన్యూ శాఖ మంత్రి శాసన సభలో బిల్లు ప్రవేశపెట్టారు. శాసనసభలో ఎలాంటి చర్చలు లేకుండా ఏకపక్షంగా ఈ బిల్లును ఆమోదింప చేసుకుంది ప్రభుత్వం. శాసన మండలిలో పీడీఎఫ్ సభ్యులు చేసిన సూచనలను పట్టించు కోలేదు. పేదలకు అన్యాయం తలపెడతాయని సందే హిస్తున్న క్లాజులను తొలగించాలన్న డిమాండ్లను ప్రభుత్వం తిరస్కరించింది. సెలెక్టు కమిటీకి కూడా సిఫారసు చేయలేదు. కేంద్ర చట్టాలతో ముడిపడి ఉన్నందున రాష్ట్ర ఉభయ సభల్లో బిల్లు ఆమోద మయ్యాక, గవర్నర్ నుంచి ఈ బిల్లు రాష్ట్రపతి పరి శీలన, ఆమోదం కోసం వెళుతుంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం (NDA Government) అధికారంలో ఉంది కనుకా, అది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ఆధార పడి ఉంది కనుకా; ఇటువంటి చట్టం గుజరాత్, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెచ్చినందునా ఈ బిల్లుకు సులువుగానే రాష్ట్రపతి ఆమోదం లభించవచ్చు.రాష్ట్రంలో వేగవంతంగా జరుగుతున్న పట్టణీకరణ, వ్యాపారీకరణలు.. ప్రభుత్వ, ప్రైవేటు భూముల దురాక్రమణలకు ఉత్ప్రేరకాలుగా ఉన్నాయనీ, రాష్ట్రంలో ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న భూకబ్జాలు, సంబంధిత పరిణామాల వలన అన్ని వర్గాలూ ఇబ్బందులు పడుతున్నాయనీ; వాటిని అరికట్టడానికి చట్టం తెస్తున్నామని కూటమి ప్రభుత్వం బిల్లులో పేర్కొంది. ‘ఏపీ భూ దురాక్రమణ (నిషేధం) చట్టం–1982’ కంటే గట్టి చట్టం తెస్తున్నందున, ఇప్పటివరకు ఉనికిలో ఉన్న ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నామన్నారు. నిజానికి పాత చట్టానికి, కొత్త చట్టానికి మధ్య పెద్దగా వ్యత్యాసం లేదు. 1982 యాక్ట్ అప్పటి ఉమ్మడి ఏపీలోని అర్బన్ ప్రాంతాలకు పరిమితంకాగా, ‘2024 బిల్లు’లో రూరల్, అర్బన్ సహా రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుంది. ప్రభుత్వ, ఎండోమెంట్, వక్ఫ్, చారిటబుల్, ప్రైవేటు భూముల ఆక్రమణలను నేరాలుగా పరిగణించి శిక్షిస్తామన్నారు.పాత చట్టంలో భూముల కబ్జాకు పాల్పడిన వారిపై అభియోగం రుజువైతే ఆరు నెలలకు తక్కువ కాకుండా జైలు శిక్ష అన్నారు. కొత్తగా తీసుకొచ్చిన బిల్లులో పదేళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష అన్నారు. పధ్నాలుగేళ్ల వరకు జైలు శిక్షను పెంచవచ్చు అన్నారు. ప్రత్యేక కోర్టులు అప్పుడూ ఇప్పుడూ ఉన్నాయి. కోర్టులను ఏర్పాటు చేసే, జడ్జిలను నియమించే అధికారం, రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి దఖలు పర్చారు. దీనిపై 1982 ఆగస్టులో బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చలో, ఎప్పుడుపడితే అప్పుడు కోర్టులను, జడ్జిలను ఏర్పాటు చేసే, రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి దఖలు పరిస్తే, ఒక వేళ ప్రభుత్వంలో ఉన్న వారిపైనే భూకబ్జా అభియోగాలు వస్తే, శిక్షల దాకా వెళితే సదరు కోర్టులను, జడ్జిల నియామకాలను ఆపివేస్తారా అని ప్రశ్నించి.. ఆ గ్యారంటీ బిల్లులో లేదని వామపక్ష పార్టీలు నిలదీశాయి. రద్దు చేసిన చట్టంలో ఏముందో కొత్తగా తెచ్చిన చట్టంలోనూ అదే ఉంది. దీనిని బట్టి ప్రభుత్వం అసలు నైజం బట్టబయల వుతుంది. నాలుగున్నర దశాబ్దాలుగా పాలకులు అమలు చేస్తున్న నూతన ఆర్థిక విధానాల కారణంగా ఆశ్రిత పెట్టుబడిదారులు భూకబ్జాలకు పాల్పడి శిక్షలు పడే దాకా వస్తే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి స్పెషల్ కోర్టులను రద్దు చేయిస్తారు కదా!బిల్లులో పేర్కొన్న శిక్షల విషయానికొస్తే జైలు శిక్ష, జరిమానా అన్నారు. కబ్జాకు పాల్పడిన ఆస్తి మార్కెట్ విలువను గ్రాబర్ (ఆక్రమణదారు) నుంచి వసూలు చేస్తామంటున్నారు. ఇక్కడ మార్కెట్ విలువంటే (Market Value) రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఉండే బుక్ వాల్యూనా, లేదంటే బహిరంగ మార్కెట్లో క్రయ విక్రయాల రేటా అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ బుక్ వాల్యూనే అయితే కబ్జాదారుకే లాభం. ఆ విధంగా గ్రాబింగ్ చట్టబద్ధమైపోతుంది. అందుకే కబ్జా చేసిన ఆస్తిని ప్రభుత్వం జప్తు చేస్తే కబ్జాదారులకు సరైన శిక్ష అవుతుంది. జైలు శిక్ష, జరిమానాతో పాటు ఆస్తి జప్తు కూడా చట్టంలో ఉండాలి. బిల్లులో ఈ ప్రధాన అంశం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూములను ఆక్రమించుకున్నవారు ల్యాండ్ గ్రాబర్ల (Land Grabbers) కిందకు వస్తారని బిల్లు చెబుతోంది. ఇళ్లు లేని పేదలు ప్రభుత్వ భూముల్లో వంద యాభై గజాల్లో నివాసాలు ఏర్పరుచుకుంటే చట్ట ప్రకారం ల్యాండ్ గ్రాబర్ అయిపోతారు. ఇళ్లు వేసుకోమని పేదలను ప్రోత్సహించిన రైతు కూలీ సంఘాల నాయకులు కూడా నేరస్థులవుతారు. ప్రభుత్వ ఎండోమెంట్, వక్ఫు భూములను ఎకరమో, రెండెకరాలో సాగు చేసుకుంటున్న పేదలు భూ దురాక్రమణదారులై శిక్షలకు గురవుతారు. కొంత మంది పెద్దలు ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్లాట్లు వేసి దర్జాగా అమ్ముకుంటున్నారు. చౌకగా వస్తుందన్న ఆశతో సామాన్యులు కొంటున్నారు. ఎవరు ప్రస్తుతం పొజిషన్లో ఉన్నారో వారు గ్రాబర్ అయిపోతారు తప్ప ఆక్రమంగా భూములను ఆక్రమించి అమ్మిన అసలు వ్యక్తి తప్పించుకుంటారు.చదవండి: ఐక్యంగా నిబడటం మనకు తెలుసు!ఇలాంటి ప్రమాదకర చట్టంపై రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులతో విస్తృతంగా చర్చించకుండా ఏకపక్షంగా అసెంబ్లీలో ఆమోదింపచేసు కోవడం అప్రజాస్వామిక చర్య అవుతుంది. పేదల హక్కులపై భస్మాసుర హస్తంగా మారే భూదురాక్రమణ చట్టానికి వ్యతిరేకంగా పేదలను సంఘటిత పరిచే ఉద్యమాన్ని రైతు కూలీ సంఘాలు తీవ్రతరం చేయాలి.– ముప్పాళ్ళ భార్గవశ్రీసీపీఐ ఎంఎల్ నాయకులు -
భూ కబ్జాలపై కఠిన శిక్షలు
సాక్షి, అమరావతి: ప్రస్తుతం ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ చట్టం –1982లో లొసుగులుండటంతో భూ కబ్జాలు పెరిగిపోతున్నందున ప్రస్తుత చట్టాన్ని రద్దు చేసి, కొత్త చట్టం తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత చట్టం నగరీకరణ భూ కబ్జాలకే వర్తిస్తుందని.. శిక్షలు, జరిమానాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో కొత్త చట్టం ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కె.పార్థసారథి మీడియాకు వెల్లడించారు. కొత్త చట్టం ప్రకారం ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటవుతుందని, కలెక్టర్ల ఆధ్వర్యంలో విచారణ జరుపుతారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ, లేదా ప్రైవేట్ భూముల ఆక్రమణలు చేసినట్లు తేలితే 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష, ఆక్రమణ చేసిన భూమి విలువతో పాటు నష్టపరిహారం (జరిమానా) కూడా విధిస్తారని చెప్పారు. కేబినెట్ మరిన్ని నిర్ణయాలు మంత్రి మాటల్లోనే.. రూ.1,000 కోట్లు పెట్టుబడి లక్ష్యంగా డ్రోన్ పాలసీ ఏపీ డ్రోన్ పాలసీతో పాటు సెమి కండక్టర్ పాలసీ, డేటా పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.1,000 కోట్లు పెట్టుబడి లక్ష్యంగా 2024–29 డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. డ్రోన్ పాలసీ ద్వారా రూ.3 వేల కోట్లు రాబడి వస్తుందని అంచనా. డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్ అండ్ డీ ఫెసిలిటీకి కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాలు కేటాయింపు. డ్రోన్ స్కిల్ ఇన్స్టిట్యూట్, డ్రోన్ పైలెట్ శిక్షణ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు. తద్వారా 15 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 25 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు. 25 వేల మందికి డ్రోన్ పైలెట్లుగా శిక్షణ ఇస్తారు. రాష్ట్రంలో 20 రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కేంద్రాల ఏర్పాటు. 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు. డ్రోన్ రంగంలో పరిశోధనలు చేపట్టే విద్యా సంస్థలకు రూ.20 లక్షలు ప్రోత్సాహం. 2024–29 డేటా పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024–29 సెమి కండక్టర్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. సెమి కండక్టర్ మాన్యుఫ్యాక్చర్ యూనిట్‌కు 50% కేంద్రం కేపిటల్ సబ్సిడీ ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 30% సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. టీడీపీ కార్యకర్తలకు ‘ఉపాధి’ నజరానా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ ఖజానా నుంచి భారీ నజరానా మంజూరు చేస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. 2014–18 సంవత్సరాల మధ్య నామినేషన్‌పై పనులు చేసిన టీడీపీ కార్యకర్తలకు రూ.331 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్లు, తదితర పనులు చేసిన చిన్న చిన్న కార్యకర్తలను ఆర్ధికంగా ఇబ్బందికి గురి చేయడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ పేరుతో బిల్లులు ఇవ్వలేదు. చాలా మంది బిల్లుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ప్రభుత్వం ఎప్పుడైనా సరే తిరిగి విచారణ చేయొచ్చని చెప్పింది. నష్టపోయిన వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తగు నిర్ణయం తీసుకోవచ్చని కూడా తెలిపింది. ఈ మేరకు 4.41 లక్షల పనులకు సంబంధించి రూ.331 కోట్లు చెల్లించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ చట్టం ప్రకారం బకాయిలకు 12 శాతం వడ్డీ కూడా చెల్లించాల్సి ఉందనే విషయంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. మరిన్ని నిర్ణయాలు ఇలా.. ⇒ జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు ఈ నెల 1వ తేదీ నుంచి వర్తించేలా 60 నుంచి 61 ఏళ్లకు పెంపు. ⇒ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గాల సమగ్రాభివృద్ధికి కుప్పం, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటు. ⇒ ఏపీసీఆర్డీఏ పరిధిని 8,352.69 చదరపు కిలో మీటర్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం. సత్తెనపల్లి మున్సిపాలిటీలోని 1,069 చదరపు కిలోమీటర్లను, పల్నాడు జిల్లాలోని ఆరు మండలాల్లో 92 గ్రామాలను, బాపట్ల జిల్లాలోని ఐదు మండలాల్లో 62 గ్రామాలను ఏపీ సీఆర్డీఏ పరిధిలోకి తెచ్చారు. జాతీయ హైవేలను కలుపుతూ 189 కిలోమీటర్ల పొడవునా ఏపీ సీఆర్డీఏలో ఓఆర్ఆర్ నిర్మాణం. ⇒ పిఠాపురంలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ కేంద్రం 100 పడకలకు పెంపుతో పాటు 66 అదనపు పోస్టులు మంజూరు. ⇒ సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం సరఫరా చేసేందుకు తీసుకువచ్చిన నూతన మద్యం విధానం మూడు ఆర్డినెన్స్‌ల స్థానే మూడు చట్టాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం. జీఎస్టీ చట్ట సవరణ ముసాయిదా బిల్లుకూ ఆమోదం. ⇒ సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థుల ఫీజు బకాయిలను తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీ యాజమాన్యాలకు చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం. ⇒ ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ చట్టంలోని సెక్షన్–3లో సవరణలకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం. 1990లో ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఆరు పైసలు, 2022లో ఒక రూపాయిగా ఉంది. ఈ డ్యూటీని చెల్లించకుండా న్యాయ స్థానాలకు వెళ్తున్నందున, బకాయిల వసూలుకు వీలుగా చట్టంలో సవరణలు. ⇒ ఏపీఐఐసీకి 50 ఎకరాల వరకు భూమి కేటాయింపునకు అనుమతివ్వడంతో పాటు ఏపీఐఐసీ చేసిన 311 భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం. -
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు
ఖమ్మం అర్బన్: నగరంలోని విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమణదారుల నుంచి కాపాడేందుకు హైదరాబాద్ తరహాలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ (భూఆక్రమణ చట్టం) కఠినంగా అమలుచేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ (జేసీ) సురేంద్రమోహన్ ఆదేశించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. ఆయన సోమవారం ఖమ్మం అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో ‘గ్రీవెన్స్ డే’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం, వివిధ శాఖల పనితీరుపై మూడు గంటలపాటు సమీక్ష సమావేశం నిర్వహించారు. కొన్ని శాఖల పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఖమ్మం నగరంలో ఎంతో విలువైన ప్రభుత్వ భూములు ఉన్నాయని, అవి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను ఆక్రమించినవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు. నగరంలోని ప్రభుత్వ భూమిని ఎక్కడైనా ఆక్రమించినట్టయితే.. భూఆక్రమణ చట్టం ఆధారంగా ఆయా శాఖల అధికారులే కోర్టును ఆశ్రయిస్తే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. ఇందుకోసం అవసరమైతే ఈ చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు. నగరంలోని ప్రభుత్వ పాఠశాలల స్థలాల వివరాలను వారం రోజుల్లో కార్పొరేషన్, రెవెన్యూ రికార్డుల్లో చేర్చాలని ఆదేశించారు. చర్యలు తీసుకోకపోతే బాధ్యులవుతారు.. ‘‘ప్రభుత్వ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా, అందుకు అనుమతి ఇచ్చినా, అప్పటికే అక్కడ చేపట్టిన నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా మీరే బాధ్యులవుతారు’’ అని, కార్పొరేషన్ అధికారులను హెచ్చరించారు. ‘‘మీరు లెక్కలు తెల్చండి. లేకపోతే వేరే వారితో లెక్కలు తీసి దానికి మిమ్మల్ని బాధ్యులుగా చేయాల్సుంటుంది. ఇప్పటికే విజిలెన్స్ నివేదిక మా వద్ద ఉంది’’ అన్నారు. నగరంలో ప్రభుత్వ భూముల వివరాలతో వారం రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పౌర సరఫరాల, విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ఆగస్టులో బియ్యం సరఫరాలో జాప్యంపై జాయింట్ కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పౌర సరఫరాల, విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బడి బియ్యం సరఫరా నగరంలోనే ఇలా ఉంటే గ్రామాల్లో ఇంకెలా మెరుగ్గా ఉంటుంది..? బియ్యం నిల్వ ఉండి కూడా ఇతరుల వద్ద అప్పుగా తీసుకుని వండాల్సిన ఖర్మేమిటి..?’’ అని, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి (డీఎస్ఓ) గౌరీ శంకర్‌ను ప్రశ్నించారు. దీనిని మూడు నెలల్లో గాడిలో పెట్టాలని డీఈఓ, డీఎస్ఓను ఆదేశించారు. సమావేశంలో డీఎస్ఓ గౌరీశంకర్, డిపో మేనేజర్ సాంబశివరావు, తహశీల్దార్ వెంకారెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.