
‘యుద్ధం’ రెండక్షరాల మాటే, ‘శాంతి’ కూడా అంతే! విచిత్రంగా, చావుబతుకులు రెంటినీ ఇముడ్చుకున్నవి కూడా ఆ రెండే; జీవన ప్రవాహానికి రెండు వైపులా కాపుకాసే తీరాలూ, మనిషిని ఇరువైపులా మోహరించిన భిన్న ధ్రువాలూ అవే; వాటి మధ్యనే మానవ సంచారం. లియో తొలు స్తాయ్ ‘వార్ అండ్ పీస్’ పేరుతో, నిర్దిష్ట స్థలకాలాల నేపథ్యంతో రచించిన ఐతిహాసిక నవలలో మార్చి మార్చి జరిగే ఆ సంచారాన్ని అత్యద్భుతంగా, ఆర్ద్రంగా కళ్ళకు కట్టిస్తాడు.
యుద్ధమూ, శాంతీ మనిషితోనే పుట్టి ఉంటాయి. బహుశా మనిషి తొలి యుద్ధం సాటిమనిషితో కాదు, ప్రకృతి శక్తులతో! అది బతకడానికి మొదలైన యుద్ధం; మనుషులొకరి నొకరు చంపుకునే యుద్ధం ఆ తర్వాత వచ్చింది; నాగరికత ముదిరినకొద్దీ అది మహాయుద్ధాల స్థాయికి చేరింది.
శాంతి అన్నది యుద్ధమనే రెండు క్రూర సింహాల మధ్య ఇరుక్కున్న బెదురుచూపుల లేడికూనా, మండు టెడారిలో అక్కడక్కడ మరులుగొలిపే శీతలజలచ్ఛాయా అయింది. మనిషి ఒంటిగా ఉన్నప్పుడు బతకనిచ్చే, బతుకునిచ్చే శాంతినే కోరుకుంటాడు; పదిమందిలో ఒకడైనప్పుడే యుద్ధపిపాసి అవుతాడు. ఈ చంచలత్వం మనిషి స్వభావంలోనే ఉంది.
తన శాంతి యుత అస్తిత్వానికే చేటు వచ్చినప్పుడు చావో, రేవో తేల్చుకోవాలనుకోవడం సహేతుకమే; కానీ ఏదో ఒక విస్తరణ దాహంతో రక్తపుటేరులు పారించడంలోనే ఎక్కువ చరిత్ర మూటగట్టుకున్నాడు. తన లక్షల సంవత్సరాల మనుగడలో శాంతియుత సహజీవనంపై ఇంతవరకు ఏకీభావానికి రాలేక పోయాడు. అతని అనేకానేక విజయాలను నిలువునా వెక్కిరించే మహా వైఫల్యం అదే. ప్రకృతి ప్రణాళికలో లేని బలవంతపు చావును కొని తెచ్చుకునే వికటించిన తెలివి మనిషిది.
ప్రపంచ సాహిత్యంలోని అనేక శిఖరాయమాన రచనల్లో యుద్ధమే ఇతివృత్తం. దేశ కాలాలు, భాషా సంస్కృతులు వేరైనా అవి ఒక్కలానే యుద్ధభాష మాట్లాడాయి, యుద్ధ సంస్కృతిని చిత్రించాయి; యుద్ధం తెచ్చిపెట్టే అపార విధ్వంసంపై, సృష్టించే దుఃఖసముద్రాలపై ఒక్క గుండెతోనే స్పందించాయి. యుద్ధాలను గర్హించే పాత్రలకూ, ఆకాశానికెత్తే పాత్రలకూ కూడా ఒకే గౌరవాన్ని కట్టబెట్టాయి. యుద్ధాలు తగవంటూనే పోరాడి ప్రాణాలు బలిపెట్టిన వీరులకు హారతి పట్టాయి.
మహాభారతాన్నే తీసుకుంటే, యుద్ధం వద్దన్నవారు కూడా యుద్ధంలోకి దిగిపోయినప్పుడు, విదురుడొక్కడే ఒంటరిగా ఒడ్డున మిగిలిపోతాడు. అంతవరకు కురుపాండవులుభయుల శ్రేయస్సునూ కోరుకున్న భీష్మ పితామహుడు యుద్ధంలో పాండవ పక్షాన్ని నిర్దాక్షిణ్యంగా నరికి పోగులుపెడతాడు. చస్తే యుద్ధంలోనే చావాలి, ఇంట్లో రోగమొచ్చి చావడం కన్నా పాపమేదీ ఉండదని ఉద్బోధిస్తాడు.
అర్జునుడు తనను చంపుతానని ప్రతిజ్ఞ చేసినప్పుడు ప్రాణభయంతో వచ్చి తనను కలిసిన సైంధ వునితో ఆచార్య ద్రోణుడూ అదే అంటాడు; ‘మృత్యువుకెందుకు భయపడుతున్నావు, వెళ్ళి యుద్ధం చేయి, ఎవరూ భూమ్మీద శాశ్వతం కాదు, అందరూ పోయేవాళ్ళే’ నంటాడు. ‘వార్ అండ్ పీస్’లో మరియా దిమిత్రెవ్నా అనే పాత్ర, తన కొడుకులు నలుగురు సైన్యంలో ఉన్నారనీ, అయినా తనకు చింత లేదనీ, చావనేది ఇంట్లో పడుకుని ఉన్నా వస్తుందనీ సగర్వంగా అంటుంది.
యుద్ధానికి ఎందుకు సిద్ధమవుతున్నావని పియర్ అనే పాత్ర తన మిత్రుడు ప్రిన్స్ ఆంద్రైని అడిగినప్పుడు, ‘ఏమో, ఎందుకో నాకే తెలియదు, ఇప్పుడు జీవిస్తున్న జీవితం నాకు నచ్చడంలే’దని అతనంటాడు. హోమర్ కృతి ‘ఇలియడ్’లో ట్రాయ్ రాకుమారుడు హెక్టర్, అర్జునుడిలానే యుద్ధాన్ని ద్వేషిస్తాడు, తన భార్య శత్రువుకి బానిసగా చిక్కి ఊడిగం చేసే దృశ్యాన్ని ఊహించుకుని కుంగిపోతాడు, అయినా సరే యుద్ధం చేసి అఖిలీస్ చేతిలో మరణిస్తాడు.
అఖిలీస్ చంపడంలోనే వెర్రి ఆనందాన్ని అనుభ విస్తాడు, అదే ఉత్తమోత్తమ పుణ్యకార్యమనుకుంటాడు, ఆ రోజుకి యుద్ధమైపోయాక మళ్ళీ మనిషై పోతాడు. తను రథానికి కట్టి ఈడ్చుకొచ్చిన హెక్టర్ మృతదేహాన్ని యాచించడానికి అతని తండ్రి ప్రియామ్ వచ్చినప్పుడు, అతణ్ణి సగౌరవంగా ఆహ్వానించి శవాన్ని అప్పగించి పంపిస్తాడు.
యుద్ధవ్యతిరేకతా, యుద్ధప్రియత్వాల మధ్య; మానుష, అమానుషత్వాల మధ్య మనిషి ఊగిస లాట ఆశ్చర్యం గొలుపుతుంది; క్షతగాత్రుడై పడున్న శత్రువీరుడు ఆంద్రైని చూసి నెపోలియన్ గుండె కరుగుతుంది. తన చేతిలో మరణించిన వాలిపై పడి తారా, రావణునిపై పడి మండోదరీ హృదయ విదారకంగా రోదిస్తున్నప్పుడు రాముడు మ్రాన్పడి ఉండిపోతాడు. ఏ యుద్ధంలోనైనా విజేతలు, పరాజితులన్న తేడా కేవలం సాంకేతికమే; అంతిమ విజయం మృత్యు, విధ్వంసాలదే! విజేత పక్షానికి చెందిన గర్భవతి ఉత్తర, భర్త అభిమన్యుని మరణానికి కన్నీరుమున్నీరవుతుంది.
ఉప పాండవులను పోగొట్టుకున్న ద్రౌపది కడుపుకోతా, నూరుగురు కొడుకులను కోల్పోయిన గాంధారి గర్భశోకమూ ఒక్కటే అవుతాయి. నివాసాలు శ్మశానాలవుతాయి, ఊళ్ళు కాలిబూడిదవుతాయి,కొంపలు కొల్లేరవుతాయి, ఖజానాలు ఖాళీ అవుతాయి, శవాల గుట్టల మధ్య బతికున్నవాళ్లు జీవచ్ఛ వాలవుతారు. గాంధారి శోకం శాపమై యదువంశాన్ని పట్టి కుదుపుతుంది, యుద్ధం ఇంకో యుద్ధానికే బీజావాపమవుతుంది, విధ్వంసం మరో విధ్వంసానికే దారి తీయిస్తుంది.
శాంతి, రెండు యుద్ధాల మధ్య విరామ చిహ్నమవుతుంది. ఎంతో ఎదిగామనుకునే ఈ రోజున కూడా యుద్ధానికీ, శాంతికీ మధ్య ద్వైదీభావాన్ని మనిషి జయించలేకపోతున్నాడు; ఉండి ఉండి యుద్ధోన్మాది అవుతూనే ఉన్నాడు, భేరీలు మోగిస్తున్నాడు, నినాదాలు ఎలుగెత్తుతున్నాడు! ఇందుకు ఏ ఒక్కరో బాధ్యులు కారు, ఇది సమష్టి వైఫల్యం, ఉమ్మడి చితిపేర్పు.