
ప్రభుత్వాల హవా తగ్గి కార్పొరేట్లు, గుప్పెడుమంది వ్యక్తులు రాజ్యాన్ని శాసించే స్థితి ప్రపంచమంతటా వచ్చి చాన్నాళ్లవుతోంది. ఇలాంటి స్థితిలో డిజిటల్ మార్కెటింగ్ చట్టం (డీఎంఏ) ఉల్లంఘనలకు పాల్పడినందుకు అమెరికన్ బడా టెక్ సంస్థలు యాపిల్, మెటా (ఫేస్‌బుక్)లకు భారీయెత్తున జరిమానా విధించి యూరోపియన్ యూనియన్ (ఈయూ) కొంత సాహసాన్ని ప్రదర్శించిందనే చెప్పాలి. యాపిల్ సంస్థకు 57 కోట్ల డాలర్లు (రూ. 4,868 కోట్లుపైగా), మెటా సంస్థకు దాదాపు 23 కోట్ల డాలర్లు (రూ. 1,965 కోట్లు) ఈయూ పెనాల్టీ విధించింది. వచ్చే జూన్ చివరికల్లా యాపిల్ ఈయూ నిబంధనలకు భిన్నంగావున్న తన యాప్ స్టోర్ నిబంధనల్లో సవరణలు చేయకపోతే రోజువారీ జరిమానాలు మొదలవుతాయి.
మెటా సంస్థ నిరుడు ఈయూ నోటీసు అందుకున్నాక దారికొచ్చి యాప్ స్టోర్‌లో మార్పులు తెచ్చింది. అందువల్ల పాత తప్పులకు మాత్రమే జరిమానా పడింది. ఈయూ తమపై కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నదని ఆ రెండు సంస్థలూ ఆరోపిస్తున్నాయి. నిజానికి ఈ రెండు సంస్థలకు విధించిన జరిమానాలూ చాలా తక్కువన్న అభిప్రాయం యూరప్ ప్రజల్లోవుంది.
మ్యూజిక్ స్ట్రీమింగ్‌లో నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ నిరుడు యాపిల్ సంస్థకు 205 కోట్ల డాలర్ల (రూ. 17,500 కోట్లపైమాటే), మెటా సంస్థకు 90 కోట్ల డాలర్ల (రూ. 7,685 కోట్లకుపైగా) జరిమానాలు విధిస్తున్నట్టు ఈయూ ప్రకటించింది. ఏడాదిగా ఆ సంస్థల వివరణను పరిశీలించే పేరిట తాత్సారం చేసి చివరకు తుది తీర్పు ప్రకటించింది. ఆ సంస్థలు మాత్రం ఇది కూడా అన్యాయమేనన్నట్టు భూమ్యాకాశాలు ఏకం చేస్తున్నాయి.
వర్తమాన పరిస్థితుల్లో ఈయూ ఈ స్థాయి జరిమానాలు విధించటం ఒకరకంగా సాహసమనే చెప్పాలి. ఎందుకంటే అమెరికా అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిష్ఠించాక లెక్కలు మారిపోయాయి. సర్వరోగ నివారిణిగా ఆయన అధిక సుంకాల మోతమోగిస్తానంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రత్యేకించి అమెరికన్ టెక్ కంపెనీల జోలికి ఎవరొచ్చినా తాట తీస్తామంటున్నారు. మొన్న ఫిబ్రవరిలో ప్యారిస్‌లో జరిగిన కృత్రిమ మేధ సదస్సు సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈయూపై బాహాటంగానే అక్కసు వెళ్లగక్కారు.
ఏఐ ప్రగతిని అడ్డుకునేలా యూరప్ వ్యవహ రిస్తున్నదని, అమెరికా బడా సంస్థలను అతిగా నియంత్రించే పోకడలు మానుకోవాలని హెచ్చరించారు. ఆయన ప్రత్యేకించి డీఎంఏ, డిజిటల్ సర్వీసెస్ చట్టం (డీఎస్‌ఏ)లను ప్రస్తావించారు కూడా. జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) సైతం తమకు సమ్మతం కాదని తెలిపారు. యూరప్ దేశాల్లో నిబంధనలు తమ వ్యాపార విస్తరణకూ, లాభార్జనకూ ఆటంకం కలిగిస్తున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులందుతున్నట్టు వాన్స్ వివరించారు. ఈ పోకడల్ని సహించబోమన్నారు. ఇదంతా గుర్తుంచుకుంటే ఈయూ తాజా నిర్ణయంలోని ఆంతర్యమేమిటో బోధపడుతుంది.
కాకి పిల్ల కాకికి ముద్దన్నట్టు ఏటా కోట్లాది డాలర్లు పన్నుల రూపంలో చెల్లిస్తున్న తమ బడా సంస్థలంటే అమెరికాకు అభిమానంవుండొచ్చు. కానీ ఆ సంస్థలు రకరకాల నిబంధనల పేరిట సాధారణ వినియోగదారుల్ని పీల్చి పిప్పి చేస్తున్నా, దివాలా తీయిస్తున్నా వేరే దేశాల వారెవరూ మాట్లాడకూడదని ట్రంప్, వాన్స్ భావించటం తెంపరితనం తప్ప మరోటి కాదు. యాపిల్ యాప్ స్టోర్‌లో లభించే మ్యూజిక్ యాప్ తదితరాలపై అధికంగా వసూలు చేస్తున్నారని భావించే వినియోగదారులు నేరుగా తమ వద్ద కొనుగోలు చేయొచ్చని చెప్పే డెవలపర్ల సందేశం కనబడకుండా, ఆ యాప్‌కు నేరుగా తీసుకెళ్లే లింక్‌లు పనిచేయకుండా యాపిల్ నిరోధిస్తున్నది.
ఇక మెటా అయితే తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో లభ్యమయ్యే యాప్‌లు కావాలంటే వినియోగదారుల వ్యక్తిగత డేటా ఉపయోగించుకోవటానికి అనుమతించాలని షరతు విధిస్తోంది. అంగీకరించనివారికి ఆ యాప్‌లలో వాణిజ్య ప్రకటనలు కనబడేలా చేస్తోంది. అవి వద్దనుకుంటే నెలవారీ ఫీజు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. సాంకేతికతలు ఎంతగానో విస్తరించిన ఈ తరుణంలో బడా కార్పొరేట్ సంస్థలు వాటిపై ఆధారపడకతప్పని స్థితి జనాలకు కల్పించి చెల్లిస్తారా... చస్తారా అన్నట్టు పీక్కుతింటున్నాయి. ఈ స్థితిలో కీలెరిగి వాతపెట్టిన చందాన డీఎంఏ రంగప్రవేశం చేసింది. టెక్ కంపెనీలు ఉల్లంఘనలకు పాల్పడితే ఆ సంస్థల ప్రపంచ టర్నోవర్‌లో 10 శాతం, పదే పదే ఆ తప్పులు చేస్తూ పోతే ప్రపంచ టర్నోవర్‌లో 20 శాతం మేర జరిమానాలు విధించాలని చట్టం నిర్దేశిస్తోంది.
కార్పొరేట్ సంస్థలకు వాతలుపెట్టి అనవసరంగా ట్రంప్ ఆగ్రహాన్ని చవిచూడటమెందుకని ఈయూ జంకుతున్న వైనం తాజా నిర్ణయంలో స్పష్టంగా కనబడుతోంది. వాటిపై చర్య తీసుకుంటున్నామన్న అభిప్రాయం యూరప్ ప్రజల్లో కలగాలి... అదే సమయంలో ట్రంప్ చేత చీవాట్లు తినకుండా, ఆయనగారిని మరీ నొప్పించకుండా గండాన్ని గట్టెక్కాలి అని ఈయూ భావిస్తోంది. అయితే మనకన్నా ఈయూ ఎంతో నయం. గుత్తాధిపత్య వ్యాపార ధోరణులను అరికట్టడానికున్న కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కఠినంగా ఉండలేకపోతున్నది.
గూగుల్ సంస్థ పోకడలను అరికట్టడంలో ఎంతో కొంత విజయం సాధించినా అది చాలినంతగా లేదు. వినియోగదారులూ, స్థానిక పరిశ్రమలూ నిలువుదోపిడీకి గురికాకుండా... టెక్ సంస్థలైనా, మరే ఇతర సంస్థలైనా ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా ప్రభుత్వాలు పనిచేయాలి. అందుకు కావలసిన చట్టాలు తీసుకురావాలి. అనారోగ్యకర వ్యాపార పోకడలపై కఠినచర్యలుండాలి. బడా కార్పొరేట్ సంస్థలు తమ లాభాలను అపారంగా పెంచుకోవటం, అవి ప్రభుత్వాల్ని శాసించే స్థితికి ఎదగటం ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తుంది. అందుకే ఈయూ చర్యల్ని స్వాగతించాలి.