
కంకి మీద కునుకు మాయం!
● భయపెడుతున్న వర్షం.. హెచ్చరికలు
● పలుచోట్ల నిలచిన రబీ మాసూళ్లు
● పనల మీద చేలు.. కోతలకు విఘాతం
● ధాన్యం రాశులు తడిసి రైతుల ఆందోళన
● నీట మునిగిన రోడ్లు..
● తెగిపడిన విద్యుత్ వైర్లు..కూలిన స్తంభాలు
● విద్యుత్ సరఫరాకు అంతరాయం
సాక్షి, అమలాపురం: జిల్లాలో ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింప చేసింది. పలు ప్రాంతాల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు రెండు గంటల పాటు ఎడతెరపి లేకుండా వర్షం పడింది. వర్షం వల్ల మండే ఎండల నుంచి సామాన్యులకు ఉపశమనం దక్కినా రైతులను దెబ్బతీసింది. చేలకు నేరుగా కలిగే నష్టం ఇప్పటికిప్పుడు పెద్దగా లేకున్నా పనల మీద ఉన్న చేలు.. నీట మునిగిన రాశులు రైతులను నష్టాలపాలు చేయనుంది. జోరుగా సాగుతున్న రబీ కోతలకు అంతరాయం కలిగించింది. మరో రెండు, మూడు రోజులు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
జిల్లాలో ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, రామచంద్రపురం నియోకవర్గాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. వర్షానికి ఈదురుగాలలు వీచాయి. కొత్తపేట, మండపేటలలో ఒక మోస్తరు వర్షం కురిసింది. అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాలలో సుమారు 70 వేల ఎకరాల్లో వరిసాగు జరిగిందని అంచనా. ఇక్కడ సగటున 50 శాతం వరి కోతలు జరిగాయి. రబీకి వర్షం వల్ల చేలకు కొంత మేర నష్టం కలిగించింది. ఈ ప్రాంతాలలో రబీ వరి కోతలు ఆలస్యంగా మొదలయ్యాయి. ఈ నాలుగు నియోజకవర్గాలలో మధ్య డెల్టాలలో శివారు ప్రాంతాలు అధికం. ఇక్కడ కోతలు ఏప్రిల్ మూడో వారం నుంచి మొదలయ్యాయి. ఇప్పడిప్పుడే కోతలు జోందుకుంటున్న సమయంలో భారీ వర్షం కురవడం రైతులకు ఇబ్బందిగా మారింది.
కోతలు జరగని వరి చేలకు ఈ వర్షం వల్ల పెద్దగా ఇబ్బంది లేదు. ఉప్పలగుప్తం, అయినవిల్లి, ఐ.పోలవరం మండలాల్లో ధాన్యం రాశులు, ధాన్యం బస్తాలు వర్షాలకు తడిసిపోయాయి. మండుటెండలు కాస్తుండడంతో బరకాల కప్పకుండా రైతులు వదిలేయడంతో అవి తడిసిపోయాయి. దీనితో వీటిని ఒబ్బిడి చేసేందుకు రైతులు తిప్పలు పడుతున్నారు. అలాగే ఈ ప్రాంతాలలో సుమారు సుమారు 600 ఎకరాల్లో పంట పనల మీద ఉందని అంచనా. ఇలా పనల మీద ఉన్న చోట్ల వర్షానికి పది శాతం ధాన్యం రాలిపోతోందని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతానికి ఇంతకుమించి వర్షం లేకున్నా మరో రెండు మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పడంతో పనలు ఒబ్బిడి చేసుకునేందుకు రైతులు హైరానా పడుతున్నారు. మధ్యాహ్నం నుంచి ఎండ కాయడంతో రైతులకు కొంత వరకు ఊరట నిచ్చింది. తడిచిన ధాన్యం ఆరబెట్టుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరంలో సగటున 50 శాతం కోతలు జరిగాయి. ఉప్పలగుప్తం, అమలాపురంలో 60 శాతం, అల్లవరంలో 45 శాతం వరకు కోతలు జరిగినట్టు అంచనా.
ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో సుమారు 40 శాతం మాత్రమే కోతలు జరిగాయి. ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే కోతలు జోరందుకున్నాయి. వర్షం వల్ల రెండు, మూడు రోజుల పాటు యంత్రం మీద కోతలకు అంతరాయం ఏర్పడింది. మలికిపురం, రాజోలు, సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాల్లో సుమారు 70 శాతం కోతలు జరిగాయి. ఇక్కడ యంత్రాలతో కోతలు అధికం కావడం వల్ల వరికి పెద్దగా నష్టం లేదు.
రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలో కె.గంగవరంలో వర్షం వల్ల వరి పంటలకు నష్టం ఎక్కువగా జరిగింది. రామచంద్రపురం, కాజులూరు మండలాల్లో సైతం వరి పనలు, ధాన్యం రాశులు వర్షం బారిన పడ్డాయి. రైతులు ముందుగా రాశులపై బరకాలు కప్పడంతో నష్టం తీవ్రత చాలా వరకు తగ్గింది. మండపేట, కొత్తపేట నియోజకవర్గాల పరిధిలో ఒక మోస్తరు వర్షం పడింది. ఉదయం గంటపాటు చెదురుమదురుగా జల్లులు కురిసాయి. ఈ ప్రాంతంలో రబీ వరి కోతలు 70 శాతం వరకు పూర్తయ్యాయి. ఇక్కడ వరికి పెద్దగా నష్టం కలగలేదు.
నీట మునిగిన రహదారులు
భారీ వర్షానికి అమలాపురం పట్టణం తడిసి ముద్దయ్యింది. రెండు గంటల పాటు కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో రోడ్ల మీద నీరు చేరింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఈదరపల్లి రహదారితో పాటు అశోక్ నగర్, హౌసింగ్ బోర్డు కాలనీ, సావరం వంటి ప్రాంతాల్లో రోడ్ల మీద నీరు చేరడంతో వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు. వర్షంతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం
భారీ వర్షానికి తోడు గాలి తీవ్రతకు విద్యుత్ వైర్లు తెగిపడడం, ట్రాన్స్‌ఫార్మర్లలో సాంకేతిక లోపం వంటి కారణాలతో జిల్లాలో అమలాపురం, అంబాజీపేట, మలికిపురం, రాజోలు, సఖినేటిపల్లి మండలాల్లో పలు ప్రాంతాలకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సఖినేటిపల్లి మండలంలో ఒక ట్రాన్స్‌ఫార్మర్, ఉప్పలగుప్తంలో మూడు విద్యుత్ స్తంభాలు, ఐ.పోలవరంలో ఒక స్తంభం, పి.గన్నవరం, రాజోలులో ఐదు స్తంభాల చొప్పున నేలకొరిగాయి. అల్లవరం మండలం గోడితిప్పలో విద్యుత్ తీగలపై కొబ్బరి చెట్టు విరిగిపడడంతో విద్యుత్ స్తంభం నేలకొరిగింది.

కంకి మీద కునుకు మాయం!