
వైద్యుడు వద్దు, నెట్టే ముద్దు
సమస్య గోరంత, నెట్ చూపేది కొండంత
ఆన్‌లైన్‌లో వెతకడం, ఆందోళన పడటం
పిల్లలూ, యువతలోనే ఎక్కువ
విజ్ఞత, విజ్ఞానమే ప్రధానం
అన్నింటినీ గూగుల్‌లో వెతకడం అలవాటైపోయిన చాలామంది.. అనారోగ్య సమస్యలకు వైద్యం, మందులను కూడా నెట్‌లోనే వెతికేస్తున్నారు. అంతటితో ఆగకుండా.. దాని గురించి లోతుగా చదివి, తమకు ఏదో పెద్ద జబ్బే వచ్చిందని తెగ ఆందోళన పడిపోతున్నారు. వెతికింది జబ్బో కాదో తెలీదు గానీ.. ఇలా అనవసరంగా వెతకడం మాత్రం పెద్ద జబ్బే. దీనిపేరు సైబర్‌కాండ్రియా లేదా కంప్యూకాండ్రియా. ఇదో విచిత్రమైన వ్యాధి. పిల్లలు, యువతలో ఇప్పుడిది ఎక్కువైపోయింది. -సాక్షి, స్పెషల్ డెస్క్
పత్రికలూ లేదా మేగజైన్లలోనూ ఆరోగ్య సమాచారాన్ని చదువుతూ ఆందోళన చెందడాన్ని ‘హైపోకాండ్రియా’గా చెబితే.. ఇప్పుడు ఇలా ఇంటర్‌నెట్‌లో చదువుతూ ఆందోళన చెందడాన్ని ‘సైబర్’ కాండ్రియాగా పేర్కొంటున్నారు. ఈ సమస్య ఉన్నవారు.. తమ ఆరోగ్య సమస్యల గురించి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో వెతికి.. బాగా లోతుగా చదివి, తమకు ఏదో పెద్ద జబ్బే వచ్చిందని భ్రమ పడుతుంటారు.
ఉదాహరణకు ఓ వ్యక్తికి మామూలుగా తలనొప్పి వచ్చిందనుకోండి. ఆన్‌లైన్‌లో వెతికేటప్పుడు దొరికిన సమాచారంలో దాన్ని ‘బ్రెయిన్ ట్యూమర్’ తాలూకు ఓ మ్యానిఫెస్టేషన్‌గా చదివాక.. తనకూ బ్రెయిన్ ట్యూమర్ లేదా బ్రెయిన్ క్యాన్సర్ ఉందేమోనని అనవసరంగా అపోహపడటం, ఆ భయాలతో ఆందోళనపడటం చేస్తుంటారు. ఇలా తమకున్న గోరంత సమస్యను కొండంత చేసుకుంటారు.
వైద్యపరిశోధకులైన డాక్టర్ రయెన్ వైట్, డాక్టర్ ఎరిక్ హార్విట్జ్ 2009లో నిర్వహించిన ఓ అధ్యయనంలో.. ఇలా వెతికేవారు కేవలం మామూలు లక్షణాలకే పరిమితం కాకుండా.. అరుదైన, తీవ్రమైన వ్యాధుల తాలూకు పేజీలనూ ఎక్కువగా క్లిక్ చేసినట్టు తేలింది. వీరిలో స్వల్ప లక్షణాలున్నా పెద్ద వ్యాధి ఉందేమో అని ఆందోళన చెందడం సర్వసాధారణమైందని ఆ అధ్యయనవేత్తలు వెల్లడించారు. సెర్చ్ ఇంజిన్ ల లాగ్స్‌ను ఉపయోగించి, 515 మందిపై వీరు ఈ సర్వే నిర్వహించారు.
పెద్దలూ అతీతులు కారు...
సైబర్ కాండ్రియాకు పెద్దలూ అతీతులు కాదు. ఉదాహరణకు ఓ కొత్త బ్రాండ్ వాషింగ్ పౌడర్ వాడాక ఒంటి మీద అలర్జీ వచ్చినప్పుడు ఇంటర్నెట్‌లో వెదుకుతారు. ఆ లక్షణాలను బట్టి అది లూపస్ లేదా లైమ్ వ్యాధి అని చెబితే దాని గురించి మరింత భయపడతారు. అవసరం లేని పరీక్షలు చేయించడంతో పాటు అవసరం లేని మందులూ వాడతారు.
ఇది వారి మానసిక, శారీరక ఆరోగ్యం, వ్యాధి నిరోధక శక్తి మీదా దుష్ప్రభావం చూపవచ్చు. ఆరోగ్య భయం ఎక్కువగా ఉన్నవారు ఇంటర్నెట్‌లో ఆరోగ్య సమాచారం కోసం మరింత ఎక్కువ వెతుకుతారు. ఆ తర్వాత అది వారిలో మరింత ఆందోళనకు దారితీస్తుంది. ఇలా ఇదొక విష వలయంలా కొనసాగుతూ ఉంటుంది.
కొంత మంచి సమాచారమూ..
ఇంటర్‌నెట్‌లో దొరికే ప్రతి విషయమూ చెడ్డది కాదు. మయో క్లినిక్, కిడ్స్ హెల్త్, నేషనల్ ఇన్స్ స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్) వంటి వెబ్‌సైట్లు అందరికీ అర్థమయ్యే రీతిలో నమ్మదగిన ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్నాయి. అవి మంచి వెబ్‌సైట్లే అయినా అందులోని విషయాన్ని చదివి తప్పుగా అర్థం చేసుకుంటే అదీ ప్రమాదమే. అందుకే ప్రతి అనారోగ్య సమస్య గురించీ ఆన్ లైన్లో ఎక్కువసేపు వెతకడం తగ్గించాలి. అది త్వరగా తగ్గకపోతే ముందుగా తమ పెద్దవారికి చెప్పడం లేదా మంచి డాక్టర్ని సంప్రదించాలి.
సైబర్‌కాండ్రియా.. ఇప్పుడు కొత్త జనరేషన్‌లో కనిపిస్తున్న సమస్య. చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌తో మనకు ఎంతైనా సమాచారం అందుబాటులో ఉండవచ్చు. కానీ దాన్ని విజ్ఞతతో ఉపయోగించుకోవడం తెలియనప్పుడు ఎదురయ్యే సమస్య ఇది. ఆ విజ్ఞత నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత అని గుర్తెరగాలి.
వైద్యులపైనా నమ్మకం పోవచ్చు!
సైబర్ కాండ్రియా వల్ల జరిగే మరో ప్రధాన నష్టం ఏంటంటే.. ఇలా ఇంటర్‌నెట్‌లో వెదకడమన్నది వైద్యులపై ఉన్న నమ్మకాన్ని కూడా దెబ్బతీయవచ్చు. ఆన్ లైన్ లో చదివిన దానికి డాక్టర్ చెప్పిన అంశాలు భిన్నంగా ఉంటే, వైద్యుని మాటనూ నమ్మకపోవచ్చు, డాక్టర్‌ను అనుమానించవచ్చు. కొంతమంది డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే ‘‘నేనే నిర్ధారణ (సెల్ఫ్ డయాగ్నోస్) చేసుకున్నా’’ అనేలా ప్రవర్తిస్తుంటారు.
ఇది మరింత ప్రమాదకరం. దీనివల్ల ఏమాత్రం ముప్పు కలిగించని ఓ చిన్న సమస్యను పెద్దదిగా భావించడం, పెద్ద సమస్యను చిన్నదిగా భావించడం జరగవచ్చు. నిజానికి ఓ వ్యక్తి తాలూకు పూర్తి వైద్య చరిత్ర (మెడికల్ హిస్టరీ) ఇంటర్‌నెట్‌కు తెలియదు. అలా అది చిన్న జలుబు నుండి క్యాన్సర్ వరకు అన్నింటికీ.. అందరికీ ఒకే రకమైన పరిష్కారాలు చూపిస్తుంది.
పిల్లలు, యువతలోనే ఎక్కువ
సైబర్‌కాండ్రియా సమస్యకు లోనవుతున్న వారిలో ముఖ్యంగా టీనేజ్ పిల్లలతో పాటు కౌమార యువత (అడాలసెంట్ యూత్) ఎక్కువగా ఉంటున్నారు. తమ సమస్యను బయటకు చెప్పుకోలేనప్పుడు వారు ఇంటర్‌నెట్‌నే ఆశ్రయిస్తున్నారు. పైగా తమకు ఉండే ఉత్సుకతకు తోడుగా ఆ వయసు పిల్లల్లో సహజంగా టెక్నాలజీ వాడకంలో ఉన్న నైపుణ్యాలు వారిని ఇంటర్‌నెట్ వైపునకు మళ్లేలా చేస్తున్నాయి. అయితే అక్కడ లభ్యమయ్యే సమాచారాన్ని ఏమేరకు తీసుకోవాలన్న విజ్ఞతగానీ, విజ్ఞానంగానీ ఆ వయసులో ఉండకపోవడమే వారిని అపార్థాలూ, అపోహల వైపునకు నెడుతోంది.
ఉదాహరణకు, స్కూల్ ముగిసేసరికి తాను అలసిపోతుండటాన్ని ప్రస్తావిస్తూ ఓ బాలిక.. అదే విషయాన్ని గూగుల్‌ను అడిగింది. నిజానికి అది మామూలు అలసట మాత్రమే. కానీ గూగుల్ తన సమాచారంలో ‘‘ల్యూకేమియా లేదా గుండె సమస్యల వల్ల ఇలా జరగవచ్చు’’ అనే సమాధానం ఇచ్చింది. దాంతో ఆమె చాలా ఆందోళనకు లోనైంది. నిజానికి ఆమె అలసటకు మరెన్నో మామూలు కారణాలు ఉండవచ్చు.
ఉదాహరణకు తగిన నిద్ర లేకపోవడం లేదా మొబైల్ ఎక్కువ సేపు చూడటం వంటివి. కానీ గూగుల్ సమాధానంతో ఆమెలో కొత్తగా గుండె వేగంగా కొట్టుకోవడం, నిద్రలేమి వంటి ఇతర లక్షణాలు కనిపించవచ్చు. వాటి గురించి మళ్లీ వెదికినప్పుడు దొరికే సమాధానాలు ఆ చిన్నారి లేత మెదడును మరింత గందరగోళానికి గురిచేసే ప్రమాదం ఉంది.
మిడిమిడి జ్ఞానంతో వీడియోలు
ఇటీవలి కాలంలో ఆరోగ్య సమాచారాలకు మంచి వ్యూవర్‌షిప్ ఉండటంతో వీడియోలు, రీల్స్ తయారు చేసే కొందరు రేటింగ్ కోసం తమ మిడిమిడి జ్ఞానంతో ఆందోళన పెంచే అభూత కల్పనలనూ వైరల్ చేస్తుండటంతో ‘సైబర్‌కాండ్రియా’కు లోనయ్యేవారి సంఖ్య పెరుగుతోంది.
సైబర్‌కాండ్రియా నివారణకు..
సెర్చ్ ఇంజిన్ కంటే వైద్యులను నమ్మడమే మేలు. ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. నిజానికి కొన్నిసార్లు ఆందోళన వల్లే శారీరక సమస్యలు కనిపిస్తాయి.ధ్యానం, శ్వాస వ్యాయామాలు (బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్),
నలుగురితో కలిసి వినోదాత్మకమైన కార్యకలాపాల్లో పాల్గొనడం, ఏదైనా పనితో తమను తాము బిజీగా ఉంచుకోవడం వంటివి సైబర్‌కాండ్రియా సమస్యను చాలావరకు నివారిస్తాయి. – డాక్టర్ ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్