
వడదెబ్బ బారిన పడొద్దు
● వేసవి కాలంలో అప్రమత్తంగా ఉండాలి ● వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలి ● కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి
సిద్దిపేటరూరల్: వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండుటెండలతో ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా వైద్యారోగ్య శాఖతో పాటు, ఇతర శాఖల జిల్లా అధికారులు ప్రజలకు అవగాహన కలిగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లోనే ఉండాలని, బయటకు వెళ్లాల్సి వచ్చినా తలకు టోపీ ధరించడం, తువ్వాల చుట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎండ వేడిమి సమయంలో ప్రయాణాలు పెట్టుకోవద్దని, చల్లని ప్రదేశాలలో ఉండాలని అన్నారు. ఎక్కువ మోతాదులో ద్రవ పదార్థాలు తీసుకుంటూ, కాటన్ వస్త్రాలను ధరించాలన్నారు. చిన్నారుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయా కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, సముదాయాలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు వేసవి తీవ్రత వల్ల వడదెబ్బకు లోను కాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు ఉపాధి హామీ కార్మికులు ఉదయం వేళలోనే పనులు చేసేలా, తాగునీటి వసతి అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుందన్నారు. అన్ని ఆసుపత్రులు, పీహెచ్‌సీ, సీహెచ్‌సీలలో వైద్యాధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ, వడదెబ్బ నివారణ ఔషధాలు సరిపడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ప్రజలు ఎవరైనా వడదెబ్బకు గురైతే, వెంటనే వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే తక్షణ చికిత్స చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.