ఏం అమ్మి తీరస్తారు సామీ.. అప్పులన్నీ..? | Special Story On Huge Debts Of Chandrababu Govt | Sakshi
Sakshi News home page

ఏం అమ్మి తీరస్తారు సామీ.. అప్పులన్నీ..?

Published Wed, Mar 19 2025 8:13 PM | Last Updated on Thu, Mar 27 2025 1:03 PM

Special Story On Huge Debts Of Chandrababu Govt

సెంద్రబాబునాయుడు ఓ పక్కన కుర్సీ యెక్కిన కాణ్నించీ యెడాపెడా అప్పులు జేస్తానే వుండారు గదా..! అప్పు పుట్టించడాన్ని గూడా ఏదో యెవరెస్టు యెక్కిన మాదిర్తో టముకు యేసుకుంటా.. పోటోలకు పోజులిస్తావుంటారు గదా..! కానీ ‘యేంది సామీ.. రాజదాని కడతండావు సరే..  ఇన్నేసి డబ్బులు గుమ్మరిస్తండావేంది’ అని అడిగినామే అనుకో.. ‘ఓరి పిచ్చోడా యిది సెల్ఫ సస్టయినబుల్ ప్రోజెక్టురా.. అంటా వుంటాడు. అదేందో పలకడానికే నాకు నోరు తిరగడం లేదుగానీ.. ‘అంటే యేందిరా సామీ’ అని యింకో సావాసగాణ్ని అడిగినా. యేం జెప్పినాడో తెలుసునా...

‘‘వోరి యెర్రోడా.. మన యెసుట్లోకి మనమే బియ్యం సంపాయించాల..  మన డప్పు మనమే గొట్టుకోవాల.. యిట్టాగానే.. ఆ అమరావతి గూడా దాన్ని కట్టడానికి కావాల్సిన డబ్బులంతా అదే సంపాదించుకుంటాదంట’’ అని జెప్పినాడు.

యేడరా సామీ.. యాబయి వేల కోట్ల రూపాయలు ఇప్పుటికే అప్పులు తెస్తిరి.. తీరా జూడబోతే యిప్పుడు కట్టబొయ్యే కతలన్నీ కలిపి నలబై వేల కోట్ల కూడా లేకపాయె.. కొండంత అప్పులు దెచ్చినారు గదా.. యెట్టా తీర్చబోతారు అని కలవరం పుట్టింది నాకు. మా మినిస్టరు నారాయణ మాటలు యింటే మాత్రం సమ్మగా అనిపిస్తండాయి.. కలవరం మొత్తం మాయమైపోతాందంటే నమ్మాల! యింతకీ ఆయనేం అంటండారో తెలుసునా?

యీ అప్పులతో ఇప్పునడు మొదులు బెడుతున్న బిల్డింగులు అన్నీ కట్టేయంగా యింకా నాలుగువేల యెకరాలు మిగల్తాయంట.. సిటీ మొత్తం దూందాంగా అయిపోయుంటాది గాబట్టి.. అప్పుడు బూముల రేట్లు ఆకాసెంలో వుంటాయంట. ఆ యేళకి గవుర్మెంటు కాడ నాలుగువేల యెకరాల బూమి వుంటాదంట.. దాన్నంతా అమ్మితే.. ఈ అప్పులు యేపాటివి.. వుఫ్ మని వూది పారేస్తాను గదా.. అంటాండారు. 

మాట యిన్నప్పుడు సమ్మగానే వుంటంది గానీ.. తలుసుకున్నప్పుడు  మాత్రం గుబులు గుబులుగానే వుంటాండాది సామీ.. యిన్నేసి అప్పులు తెచ్చి గుప్పెడు బిల్డింగులు గట్టంగానే అమరావతి సిటీ మొత్తం పూర్తయిపోయినట్టేనా? ఇల్లలికితే పండగ అయిపోతందా? యిదిగూడా అట్నే గదా అని నా బయ్యిం.

తీరా ఈ యాబైవేల కోట్లు తగలేసి ఏదో ఓ కాడికి పనులు అయినాయని అనుకున్నాక.. యిప్పుటిదాకా అయిందంతా.. కాయితం మీద గుర్రం బొమ్మ గీసినట్టే.. ఈ బొమ్మ పెకారం మంచి గ్రానైటు రాయిని దెచ్చి బొమ్మని చెక్కాల అని.. బొమ్మను చెక్కినాక, అయ్యో బొమ్మ నల్లగా ఉండాది గదా.. దీనికి బంగారం తాపడం జేయిస్తే బెమ్మాండంగా వుంటాది అనీ.. యిట్టా రకరకాల మాటలు జెప్తా.. అరలచ్చ కోట్లు నగరానికి యింకో లచ్చన్నర కోట్లు తగలెయ్యాల్సిందే.. అని కొత్త పాటలు పాడకుండానే వుంటారా? అనేది అనుమానంగా వుండాది సామీ..!

యినుకుంటా వుండారా? ఒక్కో రోడ్డు యెయ్యాలంటే కిలోమీటరుకి యాబై మూడు కోట్ల రూపాయిలా..? నోట్లేమయినా అచ్చేస్తండామా సామీ..! ఈ దేసెంలో ఎంత పెద్ద రాచబాట యేసినా.. సెంట్రలు గవుర్మెంటోల్లు కిలోమీటరుకి 20 కోట్ల దుడ్లు పెడితే చానా జాస్తి అంటాండారే.. మనోళ్లేమైనా కొండల్ని పగలదీసి యేస్తండారా.. ఆకాసానికి అద్దాల నిచ్చెనేసి ఆ పైన రోడ్డేస్తండారా.. యేం జేస్తండారని.. కిలోమీటరుకి అన్నేసి కోట్లు తగలేస్తండారో వొక యితరణ వుండాల గదా? యిట్టా తగలేస్తే యింకో అరలచ్చ కోట్లు అప్పులు దెచ్చినా ఆరతి కర్పూరం అయిపోకుండా వుంటాయా అని నాకు బయం సామీ!

యెనకటికి ఇద్దరు సావాసగాళ్లు వున్నారంట. వొకడు ‘తిందాం తిందాం’ అంటే.. ‘ఏం చేసి తిందాం’ అని రెండోవాడు అన్నాట్ట. ‘అప్పుజేసి తిందాం’ అంటే.. ‘అప్పెట్ట తీర్చాల’ అన్నాట్ట. ‘అప్పుజేద్దాం.. వూరొదిలి పారిపోదాం’ అన్నాట్ట మొదటి పెద్దమనిషి. ఆ మాదిర్తో జనం గుండెల మీద బండరాయి పడకుండా వుండాలంటే ఈ అప్పులకి యీడ పుల్ స్టాపు పెడతాండాం అని ఓ మాట జెప్పండి సామీ. లేపోతే అయ్యన్నీ తీర్చడానికి అమరావతిలోనూ అడుగు బూమీ మిగలదు.. మా బోటోళ్ల బతుకులన్నింటినీ వుడ్డగా అమ్మేస్తే తప్ప ఆ అప్పు తీరదు. కొంచిం దయపెట్టండి.
.. ఎం.రాజేశ్వరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement