
30న కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
శ్రీరాంపూర్: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 30న చలో కొత్తగూడెం కార్యక్రమం చేపట్టినట్లు సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. మంగళవారం జేఏసీ నాయకులు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కే విశ్వనాథ్, ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి పోచమల్లు, టీసీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్, సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఉల్లి మొగిలి, టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి తోకల రమేష్, ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్ శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతీనెల 7న వేతనాలు చెల్లించాలని, బోనస్, ఈఎస్‌ఐ, సీఎంపీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కొత్తగూడెం ప్రధాన కార్యాలయం ముందు ధర్నా, నిరాహార దీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపీనాథ్, రాజ్ కుమార్, శ్రీ విముక్తి సంఘం, నాయకురాలు లావణ్య తదితరులు పాల్గొన్నారు.