
ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి
● కేంద్రాలను పునఃప్రారంభించి లక్ష్యాలను పెంచాలి
● కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై
త్వరలో ఉద్యమం
● చంద్రబాబు మోసపూరిత ప్రకటనలు..
● ప్రశ్నించని పవన్ కల్యాణ్ తీరుపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి ధ్వజం
అమలాపురం టౌన్: రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయలేక కూటమి ప్రభుత్వం చేతులేత్తేసిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. తక్షణమే మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్మన్, పార్టీ ఎమ్మెల్సీలు, జిల్లాలోని పలు నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్లు, పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ధాన్యం అమ్మలేక అవస్థల పడుతున్న రైతులకు మద్దతుగా ఆయన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దళారులతో కుమ్మకై ్క లక్ష్యాలు పూర్తయ్యాయని కొనుగోళ్లు ఆపేయడంపై జగ్గిరెడ్డి నిలదీశారు. జిల్లా అధికార యంత్రాగం తీరు ఇలా ఉంటే, అకాల వర్షాలతో ధాన్యాన్ని కాపాడుకోలేక రైతులు పడుతున్న యాతన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 6 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి లక్ష్యంగా ఉంటే ప్రభుత్వం కేవలం 2 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు లక్ష్యం పెట్టుకోవడంపై బాధాకరమని ఆయన అన్నారు. మిగిలిన దాన్యాన్ని దళారులకు అమ్ముకోమని ప్రభుత్వం చెప్పకనే చెప్తోందని జగ్గిరెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో విఫలమైన ప్రభుత్వంపై రెండు మూడు రోజుల్లో పార్టీ తరఫున ఉద్యమించనున్నామని, త్వరలో ఓ తేదీ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ జిల్లాల వారీగా ధాన్యం దిగుబడుల లక్ష్యాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు నుంచి పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేశారని, ఆ పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదన్నారు. సీఎం చంద్రబాబు ధాన్యం కొనుగోళ్లపై ముందు నుంచీ మోసపూరిత ప్రకటనలు చేస్తూనే ఉన్నారన్నారు. ప్రతిసారీ ప్రశ్నిస్తానని చెప్పే పవన్ కల్యాణ్ ఈ విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదని ఎదురు ప్రశ్న వేశారు. అమరావతి పనుల పునఃప్రారంభం కాదు.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే పునః ప్రారంభించాలని ఆయ డిమాండ్ చేశారు. అవినీతి అమరావతి కోసం సీఎం చంద్రబాబు, లోకేష్‌లు చూపతున్న ఆసక్తి రైతు కష్ట నష్టాలపై, ధాన్యం కొనుగోళ్లపై చూపాలని జగ్గిరెడ్డి అన్నారు. శాసించే రైతులు నేడు యాచించే స్థాయికి చేరుకోవడం బాధగా ఉందని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ గొల్లపల్లి సూర్యారావు, అమలాపురం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ మాట్లాడుతూ ధాన్యం పండించిన రైతులపై అటు ప్రభుత్వం పగ పట్టినట్లే ప్రకృతి కూడా అకాల వర్షాల పేరుతో పగపట్టిందని ఆదేదన వ్యక్తం చేశారు. జగ్గిరెడ్డి నాయకత్వంలో రైతుల నుంచి ప్రతీ ధాన్యం గింజా కొనుగోలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని వారు ప్రకటించారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, అమలాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, వైస్ చైర్మన్ రుద్రరాజు నానిరాజు, అమలాపురం, అల్లవరం ఎంపీపీలు కుడుపూడి భాగ్యలక్ష్మి, ఇళ్ల శేషగిరిరావు, జెడ్పీటీసీ సభ్యులు పందిరి శ్రీహరి రామగోపాల్, గెడ్డం సంపతరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, అమలాపురం పట్టణం, రూరల్,అల్లవరం మండలాల పార్టీ అధ్యక్షులు సంసాని బులినాని, గుత్తుల చిరంజీవి, కొనుకు బాపూజీ, పార్టీ అనుబంధ కమిటీల అధ్యక్షులు మట్టపర్తి నాగేంద్ర, వంగా గిరజా కుమారి, తోరం గౌతమ్ రాజా, మిండగుదటి శిరీష్, కాశి మునికుమారి, సూదా గణపతి పాల్గొన్నారు.