
అయినవిల్లికి భక్తుల తాకిడి
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. అర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. స్వామికి మహానివేదన చేశారు. సాయంత్రం ఎనిమిది గంటలకు విశేష సేవలు చేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 44 మంది, లక్ష్మీగణపతి హోమంలో 17 జంటలు, స్వామివారి పంచామృతాభిషేకాల్లో నలుగురు దంపతులు పూజలు చేశారు. స్వామివారి గరిక పూజలో ఒక జంట పాల్గొంది. ఐదు జంటలు స్వామికి ఉండ్రాళ్ల పూజ చేశారు. స్వామి వారి సన్నిధిలో 13 మంది చిన్నారులకు అక్షరభ్యాసం, నలుగురికి తులాభారం, ఒకరికి నామకరణ, ఏడుగురు చిన్నారులకు అన్నప్రాశన నిర్వహించారు. 37 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 2400 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాలు ద్వారా రూ.1,98,976 ఆదాయం లభించినట్లు ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
కొత్త అక్రిడిటేషన్లు మంజూరు చేయాలి
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు
ఐవీ సుబ్బారావు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు కోరారు. కాకినాడ జేఎన్‌టీయూలో ఆదివారం జరిగిన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో బలమైన శక్తిగా ఏపీయూడబ్ల్యూజే ఉందన్నారు. ప్రస్తుతం జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువు ముగిసిందని, దీనిపై ఈ నెలలో జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని కొత్త అక్రిడిటేషన్లు జారీ చేయాలని అన్నారు. ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు స్వాతి ప్రసాద్ మాట్లాడుతూ, పోరాటాలకు పురిటి గడ్డగా ఉమ్మడి జిల్లా ఉందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఏపీయూడబ్ల్యూజే తరఫున ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు నూతన కమిటీలు నియమించామని చెప్పారు. సమావేశంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖర్ కూడా ప్రసంగించారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షునిగా డి.అంజిబాబు, కార్యదర్శిగా అర్జున్‌లతో కూడిన నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. యూనియన్ రాష్ట్ర ప్రతినిధి శ్రీరామ్మూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల అధికారిగా దురాని వ్యవహరించారు.
ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉచిత విద్యకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా హక్కు చట్టంలో నిర్దేశించిన విధంగా ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయన్నారు. ఈ విషయం పేదలందరికీ తెలిసేలా విస్త్తృత ప్రచారం చేయాలని, పత్రికల్లో వచ్చిన వార్తలను వాట్సాప్, స్కూలు, ఇతర గ్రూపుల్లో దపదఫాలుగా షేర్ చేయాలని ఎంఈఓలకు సూచించారు. అన్ని సచివాలయాలు, ఎంఈఓ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి, ఫొటోలు షేర్ చేయాలన్నారు. సోమవారం నుంచి వీలైనంత ఎక్కువ మందితో తమ మండలాల్లో రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అయినవిల్లికి భక్తుల తాకిడి