
వెబ్‌సైట్‌లో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు
నేటి సాయంత్రం వరకూ
అభ్యంతరాల స్వీకరణ
రాయవరం: ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలను ఆదివారం సాయంత్రంలోగా స్వీకరిస్తారు. పాఠశాల విద్యా శాఖ ఆర్‌జేడీ జి.నాగమణి శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. స్కూల్ అసిస్టెంట్స్ సాధారణ సీనియారిటీ జాబితాను టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (టిస్) ఆధారంగా రూపొందించి, గత నెల 22 వరకూ అభ్యంతరాలకు గడువు ఇచ్చారు. అప్పటి జాబితాపై వచ్చిన అభ్యంతరాల ప్రకారం తయారు చేసిన జాబితాను కాకినాడ ఆర్‌జేడీ కార్యాలయం వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్‌జేడీఎస్‌ఈకేకేడీ.ఓఆర్‌జీ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విద్యా శాఖ వెబ్‌సైట్‌తో పాటు, నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచారు. తాజాగా సిద్ధం చేసిన సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలుంటే ఆదివారం సాయంత్రంలోగా సంబంధిత ఉపాధ్యాయులు ఉమ్మడి జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో సమర్పించవచ్చు. అభ్యంతరం తెలిపే ఉపాధ్యాయుడి పూర్తి పేరు, క్యాడర్ సంబంధిత వివరాలు, సీనియారిటీ జాబితాలో తప్పిదం ఎక్కడుందో స్పష్టంగా తెలియజేయాలి. సంబంధిత ఉంటే జత చేయాలి. గడువు తర్వాత అందిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోరు.
బాల తిరుపతి క్షేత్రంలో
భక్తజన కోలాహలం
మామిడికుదురు: బాల తిరుపతి క్షేత్రంగా పూజలందుకుంటున్న అప్పనపల్లి బాలబాలాజీ స్వామి ఆలయం శనివారం భక్తులతో కోలాహలంగా మారింది. స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయంలో సందడి నెలకొంది. సుప్రభాత సేవ, తొలి హారతి పూజలను అర్చకులు వైభవంగా జరిపించారు. స్వామివారి సన్నిధిలో నిత్యం జరిగే శ్రీలక్ష్మీ నారాయణ హోమాన్ని భక్తులు దర్శించుకున్నారు. గోశాలను సందర్శించి గోపూజలు చేశారు. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. పాత ఆలయంలో అభిషేకాలు చేయించుకున్నారు. స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. వివిధ సేవల ద్వారా స్వామి వారికి రూ.3,77,075 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.66,990 ఆదాయం రాగా, నిత్యాన్నదాన ట్రస్టుకు భక్తులు రూ.82,526 విరాళాలు సమర్పించారన్నారు. స్వామి వారిని 5,500 మంది భక్తులు దర్శించుకున్నారని, స్వామి వారి అన్న ప్రసాదం మూడు వేల మంది స్వీకరించారని ఈఓ వివరించారు.
ఉత్కంఠగా జిల్లా స్థాయి
చెస్ పోటీలు
అమలాపురం టౌన్: జిల్లా స్థాయి అండర్–9 చెస్ పోటీలు స్థానిక విక్టరీ అకాడమీలో శనివారం ఉత్కంఠభరితంగా సాగాయి. పోటీలతో పాటు జిల్లా ఎంపికలు కూడా ఇదే వేదికపై జరిగాయి. మొత్తం నలుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి దాదాపు 45 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు. జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి తాడి వెంకట సురేష్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. బాలుర విభాగంలో పడాల శ్రీయాన్‌రెడ్డి (ప్రథమ), తాడి చేతన్ హర్ష (ద్వితీయ) బహుమతులు సాధించారు. బాలికల విభాగంలో బొడ్డు సాన్వి (ప్రథమ), ఉచ్చుల లియాన (ద్వితీయ) స్థానాలు కైవసం చేసుకున్నారు. ఈ నలుగురు విజేతలు త్వరలో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో తలపడనున్నారని సురేష్ తెలిపారు. పోటీల్లో పాల్గొన్న చెస్ క్రీడాకారులందరికీ బహుమతులు అందజేశామని చెప్పారు.

వెబ్‌సైట్‌లో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు