strong objection
-
బీబీసీది పక్షపాత రిపోర్టింగ్
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడిపై బీబీసీ కవరేజ్ పట్ల కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీబీసీది పక్షపాత రిపోర్టింగ్ అని విమర్శించింది. పాక్ జాతీయుల వీసాల రద్దుపై బీబీసీ రాసిన కథనంలో ఉగ్రదాడిని మిలిటెంట్ అటాక్‌గా పేర్కొనడంపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇది దేశం మనోభావాలను దెబ్బతీస్తుందని బీబీసీ ఇండియా హెడ్ జాకీ మార్టిన్‌కు విదేశాంగశాఖ లేఖ రాసింది. బీబీసీ రిపోర్టింగ్‌ను విదేశాంగ శాఖ పర్యవేక్షిస్తుందని లేఖలో పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దు వెంబడి తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే సందేశాలను నిరోధించడానికి 16 పాకిస్తాన్ యూట్యూబ్ చానళ్లను భారత్ నిషేధించింది. నిషేధానికి గురైన చానళ్లలో పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానల్ ఉండటం గమనార్హం. -
వెన్నుపోటు పొడిచింది
న్యూఢిల్లీ: ఒక ఖలిస్తానీ వేర్పాటువాద ఉగ్రవాదికి వంతపాడుతూ భారత్ వంటి ప్రజాస్వామ్య దేశం పట్ల కెనడా అత్యంత అనైతికంగా వ్యవహరించిందని అక్కడి నుంచి తిరిగొచ్చిన భారత హైక మిషనర్ సంజయ్ కుమార్ వర్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. కెనడాలో ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతంలో సంజయ్ వర్మసహా పలువురు దౌత్యాధికారులను విచారిస్తామని కెనడా ప్రకటించడం, కెనడా చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ భారత్ తన దౌత్యాధికారులను వెంటనే వెన క్కి రప్పించి, కెనడా దౌత్యాధికారులను బహిష్కరించడం తెల్సిందే. హఠాత్తుగా భారత్– కెనడా దౌత్యబంధంలో భారీ బీటలు వారిన వేళ సంజయ్ గురువారం ‘పీటీఐ’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.పాలకవర్గం మొదలు పార్లమెంట్‌దాకా‘‘ కెనడాలో పాలకవర్గం మొదలు రక్షణ బలగాలు, చివరకు పార్లమెంట్‌దాకా అన్ని రాజ్యాంగబద్ధ్ద సంస్థల్లో ఖలిస్తానీ సానుభూతిపరులు చొరబడ్డారు. ఇలా ఖలిస్తానీవాదులు తమ అజెండాను బలంగా ముందుకు తోస్తున్నారు. భారత సార్వభౌమత్వాన్ని సైతం సవాల్ చేసే సాహసం చేస్తున్నారు. మన సమగ్రతను అక్కడి ఎంతోమంది కెనడియన్ పార్లమెంటేరియన్లు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. తోటి ప్రజాస్వామ్య మిత్రదేశంగా భారత సమగ్రతను కెనడా గౌరవిస్తుందని భావించా. కానీ వాళ్లు వెన్నుపోటు పొడిచారు. అత్యంత అనైతికంగా వ్యవహరించారు. ఖలిస్తానీవాదుల కారణంగా కెనడా విదేశాంగ విధానం పెడతోవలో వెళ్తోంది. ఓటు బ్యాంక్‌ను కాపాడుకునేందుకు రాజకీయనేతలకు ఖలిస్తానీ వాదుల మద్దతు అవసరమైంది. ఇదే చివరకు ఇరుదేశాల దౌత్యసత్సంబంధాల క్షీణతకు ప్రధాన హేతువు. రోజురోజుకూ కెనడా రాజకీయ ముఖ చిత్రంపై ఖలిస్తానీవాదుల పాత్ర పెద్దదవుతోంది. అక్కడి భారతీయ సంతతి ప్రజలు ప్రశాంత జీవనం గడుపుతుంటే ఖలిస్తానీవాదులు మాత్రం తమ అనైతిక డిమాండ్ల కోసం తెగిస్తున్నారు. ‘ఖలిస్తాన్’ వాదనను ఖలిస్తానీవాదులు కెనడాలో ఒక వ్యాపారంగా మార్చేశారు. ఆయుధాలు, మత్తుపదార్థాల అమ్మకాలు, మానవుల అక్రమ రవాణా, వ్యభిచారం, బెదిరింపులు వంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. ఓట్లు పోతాయన్న భయంతో అక్కడి ప్రభుత్వం ఇవన్నీ తెల్సి కూడా కళ్లుమూసుకుంటోంది’’ అని అన్నారు.దౌత్య రక్షణ పీకేస్తామన్నారుతనతోపాటు మరో ఐదుగురు దౌత్యసిబ్బందిని కెనడా బహిష్కరించిన ఘటనను వర్మ గుర్తుచేసుకున్నారు. ‘‘ అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం టొరంటో ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నప్పుడు నాకొక మెసేజ్ వచ్చింది. అర్జంటుగా కెనడా విదేశాంగ శాఖకు వచ్చి అధికారులను కలవాలని ఆ సందేశంలో ఉంది. 13వ తేదీన గ్లోబల్ అఫైర్స్ కెనడా(విదేశాంగశాఖ) ఆఫీస్‌కు నేను, డెప్యూటీ హైకమిషనర్ వెళ్లాం. ‘నిజ్జర్ హత్య కేసులో మీ ప్రమేయంపై మిమ్మల్ని ఇంటరాగేషన్ చేయాల్సి ఉంది. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు మిమ్మల్ని విచారిస్తారు. వీటికి అవరోధంగా ఉన్న, మిమ్మల్ని కాపాడుతున్న ‘దౌత్యరక్షణ’ను తీసేస్తాం’ అని కెనడా అధికారులు మాతో చెప్పారు. దాంతో మాకో విషయం స్పష్టమైంది. దౌత్యనీతిని అవహేళన చేస్తూ, నిబంధనలకు నీళ్తొదిలేస్తూ హైకమిషనర్‌ను ప్రశ్నిస్తామని చెప్పడంతో నిర్ఘాంతపోయాం. పలు దేశాల్లో దౌత్యవేత్తగా పనిచేసిన నా 36 సంవత్సరాల కెరీర్లో ఇలాంటి అవమానాన్ని ఏ దేశంలోనూ ఎదుర్కోలేదు. నిజ్జర్హత్యసహా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు మేం పాల్పడలేదు. అయినా దౌత్యవేత్తలతో వ్యవహరించాల్సిన పద్ధతి ఇదికాదు’’ అని ఆయన అన్నారు. -
భారత్‌లో ముస్లింలు బాధలు పడుతున్నారు
టెహ్రాన్/న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ సోమవారం చేసిన ప్రకటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు వేదనను అనుభవిస్తున్నారు. మయన్మార్, గాజా, భారత్..తదితర ఏప్రాంతంలోనైనా ముస్లింలు పడుతున్న బాధలను పట్టించుకోకుంటే మనం ముస్లింలమే కాదు’అంటూ ఖమేనీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. భారత్‌లోని మైనారిటీ వర్గాన్ని గురించి ఇరాన్ సుప్రీం నేత చేసిన ఈ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తప్పుడు సమాచారంతో చేసిన ఈ ప్రకటన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇతర దేశాల్లోని మైనారిటీల గురించి వ్యాఖ్యలు చేసే ముందు సొంత మానవ హక్కుల రికార్డును పరిశీలించుకోవాలని ఇరాన్‌కు హితవు పలికింది. ప్రభుత్వ ఉత్తర్వులను తోసిరాజని ఇరాన్లో వేలాదిగా మహిళలు హిజాబ్ లేకుండా వీధుల్లోకి వచ్చిన రోజే ఖమేనీ భారత్‌పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
కెనడాలో ఖలిస్తానీల ‘సిటిజన్స్ కోర్ట్’
న్యూఢిల్లీ: కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. వాంకోవర్‌లో ఉన్న భారత కాన్సులేట్ ఎదురుగా రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ దిష్టి»ొమ్మను దహనం చేయడంతోపాటు ‘సిటిజన్స్ కోర్ట్’ను నిర్వహించారు. ఈ వ్యవహారంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్‌లోని కెనడా హై కమిషన్‌కు డిప్లొమాటిక్ నోట్ ద్వారా అభ్యంతరం తెలిపింది. ఖలిస్తానీ శక్తుల చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రూడో ప్రభుత్వం వేర్పాటువాదులకు దన్నుగా నిలుస్తోందని ఆరోపించింది. గతేడాది జరిగిన నిజ్జర్ హత్యకు భారత్ ఏజెంట్లే కారణమన్న కెనడా ప్రధాని ట్రూడో తీవ్ర ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. -
చైనా మ్యాప్‌పై భారత్ తీవ్ర అభ్యంతరం
నూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్ తమ భూభాగంలోని ప్రాంతంగా పేర్కొంటూ చైనా రూపొందించిన తాజా మ్యాప్‌పై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చిత్ర పటాల్లో చూపినంత మాత్రాన వాస్తవ పరిస్థితి మారిపోదని, అరుణాచల్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమని పేర్కొంది. అరుణాచల్‌లోని వివాదాస్పద ప్రాంతాలను, దక్షిణ చైనా సముద్రాన్ని చైనాలో అంతర్భాగంగా చూపుతూ ఇటీవల ఆ దేశం విడుదల చేసిన మ్యాప్‌లపై.. కేంద్ర విదేశాంగ శాఖ అధికారులను వివరణ కోరగా వారు పైవిధంగా స్పందించారు. అరుణాచల్ పూర్తిగా భారత్‌లో అంతర్భాగమని, ఇదే అంశాన్ని పలుమార్లు చైనా ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ నేతత్వంలోని బృందం కూడా చైనా ప్రతినిధుల వద్ద ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉందని వెల్లడించారు.