క్రిస్మస్ రోజు ముస్లిం రెస్టారెంట్ పెద్ద మనసు
లండన్: త్వరలో క్రిస్మస్ నేపథ్యంలో లండన్లోని ఓ ముస్లిం రెస్టారెంటు తన ఔదర్యాన్ని చాటుకుంది. క్రిస్మస్ సందర్భంగా ఆరోజు నిరాశ్రయులకు, వృద్దులకు ఉచితంగా భోజనం సౌకర్యాలు అందిస్తామని ప్రకటించింది. మూడు రకాల్లో ఆ రోజు డిన్నర్ అందిస్తామని తెలిపింది. లండన్ నగరంలో టర్కీ ముస్లింలకు చెందిన షిష్ అనే రెస్టారెంటు ఉంది. ఇది ఇక్కడ 1993లో ఏర్పాటుచేశారు. అక్కడి వారితో బాగా కలిసిపోయిన రెస్టారెంటు యజమానులు త్వరలో క్రిస్మస్ నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు.
ఇస్రాన్ కెన్ జెంక్ అనే ఈ రెస్టారెంటుకు చెందిన మేనేజర్ ఓ పత్రికకు ఈ విషయాన్ని చెబుతూ తాము క్రిస్మస్ రోజున ఒంటరిగా ఉండాల్సి వస్తుందని ఓ మహిళా వృద్ధురాలు చెప్పగా విన్నానని, ఆ విషయం తనను కదిలించి వేసిందని అందుకే మతానికి అతీతంగా మనుషులే ముఖ్యమనే భావనతో ఆ రోజు ఉచితంగా భోజనం వసతిని ఏర్పాటు చేస్తున్నామని, తాము ఒంటరి వాళ్లం అని భావించిన వారంతా తమ రెస్టారెంటుకు వచ్చి ఉచితంగా సంతృప్తికరమైన డిన్నర్ చేసి వెళ్లొచ్చని చెప్పాడు.