
చాట్ జీపీటీలో ‘ధన్యవాదాలు’, ‘దయచేసి’ ఖరీదే
వీటికి భారీగా అదనపు విద్యుత్
సమాధానం కోసం గూగుల్ కంటే 10 రెట్లు ఎక్కువ శక్తి
విద్యుత్ బిల్లు పది లక్షల డాలర్లు ఎక్కువ
జపాన్‌కి సరిపడా విద్యుత్ వినియోగం
2,500 స్విమ్మింగ్ పూల్‌లకు సరిపోయే నీరు
భారీగా కర్బన ఉద్గారాలు
ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్, ఇతర పరిశోధనల్లో వెలుగులోకి
కృత్రిమ మేధ (ఏఐ).. సాంకేతిక ప్రపంచాన్ని శాసిస్తున్న ఓ సరికొత్త ఆవిష్కరణ. గూగుల్ సెర్చ్ ఇంజన్ మాత్రమే తెలిసిన మనకు అంతకు మించి సమాచారాన్ని క్రోడీకరించి ఇచ్చే అనువైన సాధనం. అందుకే, ఏఐని రోజువారీ వ్యాపకాల్లో అత్యధికంగా వినియోగిస్తున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది.
గిబ్లి–శైలి, పోర్ట్రెయిట్ సెల్ఫీలు, గ్రూప్ చిత్రాల రూపకల్పనలో ఏఐని ఎక్కువగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో చాట్ జీపీటీకి సంబంధించి ఎవరూ ఊహించలేని, ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ . కేవలం రెండు పదాల వినియోగం వల్ల ఏఐ ఖర్చు విపరీతంగా పెరుగుతోందట. ఇప్పుడు ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా ఏఐని వినియోగించేవారిని నివ్వెరపోయేలా చేసింది.
కృత్రిమ మేధకు కృతజ్ఞతల భారం
ధన్యవాదాలు, దయచేసి అనే పదాలను.. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు(జీపీయూ)గా పిలిచే ప్రత్యేక చిప్‌లతో నిండిన సర్వర్లను ఉపయోగించి ఏఐ ఉత్పత్తి చేస్తుంది. ప్రజలు చాట్‌జీపీటీకి ‘దయచేసి, ధన్యవాదాలు‘ అని చెప్పడం వల్లే కంపెనీ విద్యుత్ ఖర్చుల కోసం పది మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ్స కంపెనీ (ఓపెన్ ఏఐ) సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ వెల్లడించారు. ఏఐ ద్వారా ఒక ప్రశ్నకు సమాధానం వెదకడానికి గూగుల్ కంటే 10 రెట్లు ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. వినియోగదారులతో ఏఐ మర్యాదగా ఉండటానికి రోజుకి 10 మిలియన్ల డాలర్లు ఖర్చవుతుందని ఆయన వివరించారు.
ఒక దేశానికి సరిపోయే విద్యుత్
కృత్రిమ మేధ, చాట్ జీపీటీ వంటి వ్యవస్థలకు ఎక్కువ విద్యుత్ శక్తిని వినియోగించే భారీ డేటా కేంద్రాలు (సర్వర్లు) అవసరం. వాషింగ్టన్ పోస్ట్ పరిశోధన ప్రకారం ఏఐ ద్వారా 100 పదాల ఇ–మెయిల్‌ను తయారు చేయడానికి వాడే విద్యుత్... గంటకు 14 ఎల్‌ఈడీ లైట్లు వెలగడానికి వాడేంత విద్యుత్ వినియోగంతో సమానం. అలాంటిది ప్రతిరోజూ ఏఐని మనం లక్షలాది ప్రశ్నలు అడుగుతుంటాం. వాటన్నిటికీ ఏఐకి ఎంత విద్యుత్ అవసరం అవుతుందో ఊహించడమే కష్టం.
ప్రస్తుతం ఉన్న డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం వాటా ఇప్పటికే ప్రపంచంలోని మొత్తం విద్యుత్ వినియోగంలో 2 శాతంగా ఉంది. ఏఐ మన నిత్య జీవితంలో మరింతగా కలిసిపోయినందున ఇది ఇంకా భారీగా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆర్థిక సలహాల సైట్ బెస్ట్ బ్రోకర్స్ పరిశోధకులు చాట్‌జీపీటీకి ఏటా సగటున 1.059 బిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని కనుగొన్నారు. అంటే విద్యుత్ ఖర్చుల్లో ఏఐ చాట్‌బాట్ కోసం మాత్రమే ఏటా దాదాపు 139.7 మిలియన్ డాలర్లు ఖర్చవుతుంది. ఇది 2026 నాటికి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అంటే జపాన్ వంటి దేశం మొత్తం ఇంధన అవసరాలకు సరిపోయేంత విద్యుత్‌ను ఒక్క ఏఐ వాడేస్తోంది.

కర్బన ఉద్గారాలు.. ఖర్చైపోతున్న నీరు
రివర్‌సైడ్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధన ప్రకారం.. ఏఐకి శక్తినిచ్చే సర్వర్‌లను చల్లబరచడానికి అధిక మొత్తంలో నీరు అవసరం. వంద పదాల ఇ–మెయిల్‌కు చాట్‌జీపీటీకి 1,408 మిల్లీలీటర్ల వరకూ నీరు వినియోగం అవుతుంది. మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం పరిశోధన ప్రకారం ఒక పెద్ద ఏఐ మోడల్‌ను తయారు చేయడం వల్ల విడుదలయ్యే కార్బన్... ఐదు కార్లు వాటి మొత్తం జీవితకాలంలో విడుదల చేసే కార్బన్ కంటే ఎక్కువ.
గూగుల్ కూడా 2019 నుంచి ఉద్గారాలలో 48 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఇదంతా ఎక్కువగా ఏఐ వల్ల జరిగింది. కాబట్టి, ఏఐ అసిస్టెంట్‌కు కృతజ్ఞతలు చెప్పడం మనకు చాలా సాధారణంగా అనిపిస్తున్నప్పటికీ, ప్రతి అదనపు పదం సిస్టమ్ పనిభారాన్ని, పర్యావరణానికి ముప్పుని, సంస్థలకు ఖర్చుని పెంచుతుందని గుర్తించాలనే సలహా ఇప్పుడు టెక్ నిపుణుల నుంచి ఎక్కువగా వినిపిస్తోంది.
ఏఐ మర్యాద నేర్పుతోందా?..: ‘ఫ్యూచర్’ అనే అమెరికాకు చెందిన ఓ పత్రిక తాజా అధ్యయనం ప్రకారం అమెరికాలో ఏఐని ఉపయోగించే 67శాతం వ్యక్తులు చాట్‌బాట్‌తో మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. వారిలోని 18 శాతం మంది ‘దయచేసి, ధన్యవాదాలు‘ అని చెబుతున్నారు. మిగిలిన 82శాతం మంది అది ఏఐ అయితే ఏంటీ, సాటి మనిషి అయితే ఏంటి.. ఎవరితోనైనా మర్యాదగా ప్రవర్తించడం మంచిదని తాము ఆ విధంగా ఉన్నామని చెప్పారు. కాగా ఏఐతో మర్యాదగా ఉండటం వల్ల ప్రయోజనాలున్నాయని మైక్రోసాఫ్ట్ డిజైన్ డైరెక్టర్ కుర్టిస్ బీవర్స్ మైక్రోసాఫ్ట్ బ్లాగ్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. మీరు ఏఐతో మర్యాదగా ప్రవర్తిస్తే, అది అదే విధంగా స్పందించే అవకాశం ఉందనేది ఆయన మాటల సారాంశం.